వామపక్ష పార్టీలు ఎట్టకేలకు తమ మనసులోని మాటను బయటపెట్టాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ మద్దతును ప్రొఫెసర్ నాగేశ్వర్, జయసారథికే ఇస్తున్నట్లు వామపక్ష పార్టీలన్నీ ప్రకటించాయి. మొన్నటి వరకు నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీచేస్తున్నటిజెఎస్ అధ్యక్షుడు కోదండరామ్‌కు సిపిఐ, సిపిఎం పార్టీలు.. మద్దతిస్తాయని అంతా అనుకున్నారు. కానీ ఏకంగా కోదండరామ్ కు పోటీగా నల్గొండ-ఖమ్మం-వరంగల్ నుంచి సిపిఐ అభ్యర్థి అయిన జయసారథికి బరిలో దింపి మరీ మద్దతునిస్తున్నట్లు పేర్కొన్నాయి. అలాగే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న ప్రొఫెసర్ నాగేశ్వర్ కు కూడా వామపక్షాలు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాయి.
కుదరని ఏకాభిప్రాయం…
ప్రతిపక్ష పార్టీలన్నీ ఉమ్మడిగా అభ్యర్థులను బరిలో దింపాలనుకున్నాయి. అయితే పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అది సాధ్యం కాలేదని సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం, సిపిఐ నేత చాడ వెంకట్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఉమ్మడి అభ్యర్థులను నిలిపే విషయంపై కసరత్తులు చేసినా అవి సఫలం కాలేదని వారు తెలిపారు. అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ మద్దతిచ్చే విషయంలో కోదండరామ్ వాదన సరైంది కాదని తమ్మినేని, చాడ వెంకట్‌రెడ్డి తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
టిజెఎస్ వాదన..
నల్గొండ-ఖమ్మం-వరంగల్ నుంచి టిజెఎస్ అభ్యర్థిగా ప్రొఫెసర్ కోదండరరామ్, వామపక్ష పార్టీలు బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా జయసారథి పోటీ చేస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా హైదరాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్రావుకు టిఆర్ఎస్ పార్టీ మద్దతునిస్తుందనే ప్రచారం జరుగుతుందని టిజెఎస్ వానను లేవనెత్తుతోంది. అలాగైతే తాము నాగేశ్వర్ కు మద్దతివ్వబోమని టిజెఎస్ చెప్పిందని తమ్మినేని తెలిపారు. ఒకవేళ టిఆర్ఎస్ బలపరిస్తే అప్పుడు ప్రధాన పోటీ బిజెపితోనే ఉంటుంది. మరీ అలాంటప్పుడు బిజెపికి ఇస్తారా? నాగేశ్వర్లలో ఎవరికి మద్దతు ఇస్తారని అడిగితే తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి తెరాస అని టిజెఎస్ తెలిపినట్లు వెల్లడించారు. అయితే తమకు మాత్రం దేశంలో ప్రధాన రాజకీయ శత్రువు బిజెపినే అని వామపక్ష నేతలు తెలుపుతున్నారు.
మెలికల పేరుతో…
కానీ టిఆర్ఎస్ పార్టీ బలపరిచే అభ్యర్థికి కమ్యూనిస్టులు మద్దతిస్తారు గానీ లౌకిక పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒకవేళ టిజెఎస్‌కు మద్దతిస్తానంటే మరీ వీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారనే చర్చ జరుగుతోంది. కెసిఆర్ విధానాలను ఎప్పుడూ విమర్శించే సిపిఐ, సిపిఎం, ఇతర వామపక్ష పార్టీలు.. టిఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చే అభ్యర్థికి కమ్యూనిస్టులు ఎలా మద్దతు తెలుపుతారని అంటున్నారు. ఒక వేళ టిఆర్ఎస్ మద్దతో నాగేశ్వర్ గెలిచి మండలిలో అడుగుపెట్టి ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించే వీలు ఉండదు కదా. అలాంటప్పుడు తెరాసకు సరండర్ అయినట్లేనని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వామపక్ష పార్టీలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయని, అందుకే కొదండరామ్ను ఓడించేందుకే ఏకాభిప్రాయం కుదరలేదనే పేరుతో మెలికలు పెడుతున్నాయని విమర్శలు వస్తున్నాయి.
కోదండరామ్ ను దెబ్బకొట్టేందుకేనా?..
నల్గొండ-ఖమ్మం-వరంగల్ నుంచి పోటీ చేస్తున్న కోదండరామ్ గెలుపు అంచుల్లో ఉన్నాడనే ప్రచారం నియోజకవర్గ ప్రజల్లో జరుగుతోంది. టిజెఎస్ ను దెబ్బకొట్టాలంటే వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో బలమైన ఓటు బ్యాంకు ఉన్న కమ్యూనిస్టులను బరిలోకి దింపి వారి మద్దతు కోదండరామ్‌కు ఇవ్వకుండా ఓడించేందుకే ఏకాభిప్రాయం అనే మెలికన పెట్టినట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. కోదండరామ్ ను చట్టసభల్లో అడుగుపెట్టకుండా ఈ సరికొత్త స్ట్రాటజీని గులాబీ నాయకత్వం పై నుంచి మానిటరింగ్ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. కోదండరామ్ ఒక వేళ గెలిచి మండలిలో అడుగుపెడితే ప్రజావ్యతిరేక విధానాలపై ప్రశ్నించే అవకాశం ఉంది. ఇది తెరాసకు అస్సలు మింగుడుపడని అంశం. ఈ క్రమంలోనే కోదండరామ్ కు కమ్యూనిస్టులను దూరం చేస్తే గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని చెప్పి ఆయనకు పోటీగా సిపిఐ అభ్యర్థి జయసారథిని బరిలోకి దింపేలా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కమ్యూనిస్టులు.. కోదండరామ్‌కు మద్దతు ఇస్తాయా? లేదా? అనే సస్పెన్స్‌కు సోమవారం సిపిఐ, సిపిఎం, ఇతర వామపక్ష పార్టీలన్నీ తెరదించాయి. రాజకీయ ఎత్తుగడలో భాగంగానే వామపక్ష పార్టీలు ఈ స్టాండ్‌ను తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.











