మాజీ మంత్రి కొడాలి నాని, వైసీపీ సీనియర్ నేత, ఎమ్ఎల్ఏ వల్లభనేని వంశీకి వారి సన్నిహిత మిత్రుడు, వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా హ్యాండ్ ఇచ్చారా?. ఆ ఇద్దరు ఎంత కోరినా పట్టించుకోకుండా వైసీపీకి ఝలక్ ఇచ్చి టీడీపీ జనసేన బీజేపీ కూటమి వైపు మొగ్గుచూపుతున్నారా?. తనకి టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ, తన మద్దతు కూటమికే అని ఆయన తేల్చి చెప్పారా?? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది..
వంగవీటి రాధా గత ఎన్నికలలో పోటీ చేయలేదు.. ఈ దఫా ఆయన ఏదో ఒక పార్టీ నుండి బరిలోకి దిగి అసెంబ్లీ లేదా పార్లమెంట్లో అడుగుపెడతారని భావించారు.. అంచనాలకు భిన్నంగా ఈ సారి కూడా ఆయన ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయడం లేదు.. గత కొన్ని రోజలుగా వంగవీటి రాధా ఏం చేస్తారనే అంశంపై భారీ బెట్టింగులు జరుగుతున్నాయి. టీడీపీతో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు రాధా.. ఆ తరవాత వైసీపీతోనూ టచ్‌లో లేరు.. ఇటు, జనసేనకీ దూరంగా లేరు. దీంతో, రాధాని తమ చెంతకి చేర్చుకోవడం కోసం జగన్ టీమ్ ముఖ్యంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ తీవ్రంగా కృషి చేసింది..
వీలయినప్పుడల్లా ఈ ఇద్దరూ రాధాని కలిసి వైసీపీలోకి ఆహ్వానించే ప్రయత్నం చేశారు.. రాధాతో తమది విడదీయరాని బంధం అని ప్రకటించుకునే వారు.. టీడీపీ జనసేన కూటమితో కాపు ప్లస్ కమ్మ సామాజిక వర్గాల బంధం వైసీపీకి మైనస్ అవుతుందని, ఇదే తమ ఓటమికి కారణం అవుతుందని భావించిన వైసీపీ .. రాధాకోసం విశ్వప్రయత్నం చేసింది.. వారి వ్యూహానికి చెక్ పెట్టిన వంగవీటి రాధా తాజాగా కూటమికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది..
ఇటీవల రాధా.. తెనాలి జనసేన అభ్యర్ధి, కూటమి కేండిడేట్… నాదెండ్ల మనోహర్‌తో భేటీ అయ్యారు.. ఆయనతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఆయన తరఫున తెనాలిలో ప్రచారానికి అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారట.. అంతేకాదు, జనసేన తరఫున పోటీ చేసే ప్రతి ఒక్కరికి తాను ప్రచారం చేస్తానని తెలిపారట. దీంతో, వల్లభనేని వంశీ, కొడాలి నాని ఆశలకు గండి కొట్టారు వంగవీటి రాధా.. ఇప్పటివరకు ఆయన ఎటు వైపు అడుగులు వేస్తారో క్లారిటీ లేదు. తాజాగా దీనిపై ఒక స్పష్టత రావడంతో జనసేనలో మరింత జోష్ వచ్చింది.. ఇక దూకుడు పెంచాలని భావిస్తోంది జనసేన టీమ్..











