ఏపీ సీఎం జగన్‌తో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు ఆయన సోదరి వైఎస్ షర్మిల. సొంత గడ్డపైనే అన్నను రాజకీయంగా దెబ్బ కొట్టడానికి సన్నాహాలు చేసుకొంటున్నారు. బాబాయ్ వివేకానందరెడ్డి హత్య విషయంలో జగన్‌ను ఏకిపారేసి ఆయన పరువు తీశారు చెల్లెల్లు షర్మిల, సునీత. కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి, అవినాశ్‌రెడ్డిని ఓడించడం ద్వారా వివేకా హత్యకు ప్రతీకారం తీర్చుకోవడం పాటు.. జగన్ పొలిటికల్ పునాదులు కదిలించే ప్లాన్‌లో ఉన్నారు. కడప ఓటర్లలో ఎంత మంది షర్మిలకు జై కొడతారు.. వివేకా మర్డర్ ఇష్యూ ప్రజలను ప్రభావితం చేస్తుందా.. అవినాశ్‌రెడ్డికి ఈసారి గెలిచే అవకాశాలు ఉన్నాయా.. లెట్స్ వాచ్..
ఏపీ సీఎం జగన్ ఎన్నికలకు సమరానికి సిద్ధం అంటున్నారు. ప్రతిపక్షాలు ఆయనతో యుద్ధానికి సై అంటున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏకమైంది. షర్మిల రూపంలో వైసీపీ అనుకూల ఓటుకు గండిపడే సూచనలు కనిపిస్తున్నాయి. వైసీపీ పునాదులు రక్తంతో తడిచిపోయాయని ఆరోపిస్తున్న జగన్ సోదరి.. తన అన్న పార్టీ మూలాలపై గురి పెట్టారు. దేశంలో ఏ ప్రాంతంలో అయినా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కాంగ్రెస్ పార్టీకి నమ్మకమైన ఓటు బ్యాంకుగా ఉంటూ వస్తున్నారు. జగన్ సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత ఈ సామాజిక వర్గాల వారంతా వైసీపీలో చేరిపోయారు. జగన్ వెంట వెళ్లిన కాంగ్రెస్ ఓటు బ్యాంకును తిరిగి హస్తం గూటికి చేర్చే ప్రయత్నాల్లో ఉన్నారు షర్మిల.
ఇప్పటికే అనేకమంది వైసీపీ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. ఫ్యాన్ గుర్తుపై పోటీ చేసే అవకాశం దక్కని కోడుమూరు ఎమ్మెల్యే పరిగెల మురళి, నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్దర్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. టికెట్ల కేటాయింపులో తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలనే పక్కన పెట్టారు. వైసీపీ అధిష్టానం తీరుతో ఆ పార్టీపై బీసీలు, ఎస్సీ, ఎస్టీల్లో అసహనం కనిపిస్తోంది. ఇలాంటి వారందరనీ పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు షర్మిల. స్వయంగా ఆమె కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. కడప నుంచి వైసీపీ అభ్యర్ధిగా సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డికి టికెట్ ఇచ్చారు సీఎం జగన్.
వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాశ్‌రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. సీబీఐ విచారణకు జగన్ ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృస్టించింది. సీబీఐ అధికారులు అవినాశ్‌ను అరెస్టు చేయడానికి వచ్చినప్పుడు వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ విషయాలను గుర్తు చేస్తూ.. వచ్చే ఎన్నికల్లో తన సోదరుడు జగన్‌కు ఓటేయొద్దని విజ్ఞప్తి చేశారు వివేకా కుమార్తె సునీత. ఆమెకు మొదటి నుంచి అండగా ఉంటూ వస్తున్న షర్మిల కూడా జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని కోరుతున్నారు. తన సోదరుడి పతనం కడప జిల్లా నుంచి ప్రారంభం కావాలని ఆశిస్తున్నారు. కడప ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న తనకే మద్దతివ్వాలని వైఎస్సార్ అభిమానులకు విన్నవించుకొంటున్నారు.
గత మూడున్నర దశాబ్దాల నుంచి కడప ఎంపీ సీటు నుంచి వైఎస్ కుటుంబ సభ్యులే గెలుస్తూ వస్తున్నారు. 1989 నుంచి 2024 వరకూ వైఎస్ కుటుంబంలోని రాజశేఖరరెడ్డి, వివేకానందరెడ్డి, జగన్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి.. నలుగురే కడప ఎంపీలుగా ఉన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తొలిసారి వైఎస్ కుటుంబం నుంచి ఇద్దరు పోటీ పడబోతున్నారు. వైసీపీ అధినేత జగన్.. కడప టికెట్‌ను సిట్టింగ్ ఎంపీ అవినాశ్‌రెడ్డికి ఇచ్చారు. ఆయనకు పోటీగా వైఎస్సార్ కుమార్తె షర్మిల కాంగ్రెస్ గుర్తుపై బరిలోకి దిగబోతున్నారు. అవినాశ్‌రెడ్డిపై షర్మిల గెలవడం చాలా కష్టమైన విషయం. వైసీపీకి ఆమె కనీసం పోటీ ఇవ్వగలరా అనే అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.
ఒక్క 1996 ఎన్నికలు మినహా మిగిలిన సందర్భాల్లో వైఎస్ ఫ్యామిలీ నుంచి కడప ఎంపీ స్థానంలో పోటీ చేసిన అభ్యర్ధులు 50 నుంచి 75 శాతం ఓట్లు సాధించి భారీ మెజారిటీతో గెలిచారు. ఈసారి షర్మిల బరిలో ఉండటంతో.. జగన్‌కి అండగా ఉంటున్న ఓటు బ్యాంకులో చీలిక వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ పాలనపై వ్యతిరేకత, వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను కాపాడటంపై ఆగ్రహం, వైఎస్ సునీత ఆవేదన వంటి కారణాలతో వైసీపీ సానుభూతిపరులు రివర్స్ అయ్యారు. వీరిలో ఎంత మంది జగన్‌ను వదిలేసి షర్మిల వైపు టర్న్ అవుతారనే దాన్ని బట్టి కడపలో ఎవరు గెలుస్తారనే విషయం ఆధారపడి ఉంది. జగన్ ఓటు బ్యాంకులో సగానికి పైగా కోత పడితే.. షర్మిల కడప ఎంపీ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా పది శాతం వరకూ ఓట్లు చీల్చినా అవినాశ్‌రెడ్డి ఓటమికి, తెలుగుదేశం అభ్యర్ధి విజయానికి కారకులవుతారు. కడప ఓటర్లలో ఎంత మంది వివేకానందరెడ్డికి న్యాయం చేయాలనుకుంటున్నారు.. ఎంత మంది జగన్ అరాచకాలను ఎదిరించాలని అనుకొంటున్నారో వచ్చే ఎన్నికల ఫలితాల్లో తేలుతుంది.