బిగ్ బాస్.. నాలుగు సీజన్లు, ముగ్గురు హోస్ట్ లు. వీరిలో అసలు ఎవరు రాణించారు? అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలన్న కుతూహలం అందరిలోనూ ఉంటుంది. కంటెస్టెంట్ లకు మాత్రమే కాదు హోస్ట్ లకు కూడా ఇది పెద్ద టాస్కే. దాదాపు 100 రోజుల పాటు ఈ షో నడుస్తుంది. హౌస్ లో వివాదాలు, గిల్లికజ్జాలు, సరదా సంగతులు, టాస్క్ లు.. వెరసి బిగ్ బాస్ గేమ్. ఇప్పుడు తెలుగులో సీజన్ 5 సెప్టెంబరు 5 నుంచి ప్రారంభం కాబోతోంది. టీఆర్పీల పరంగానూ ఈ షోలకు ఉన్న క్రేజే వేరు.
ఇంతమంది కంటెస్టెంట్స్ తో ఆటను సరదాగా నడపాలంటే హోస్ట్ కు కూడా ఎంతో దమ్ముండాలి. పైగా ఈ హోస్ట్ కు లభించే పారితోషికం కూడా మామూలుగా ఉండదు. షో నిర్వాహకులు వివాదాస్పద కంటెస్టెంట్స్ కోసం వెతుకుతుంటారు. సోషల్ మీడియాలో లేదా సినిమాల పరంగా ఫాలోవర్లు ఎక్కువ ఉన్నవారినే కంటెస్టెంట్స్ గా ఎంచుకుంటున్నారు. ఈ షోకు మొట్టమొదటి హోస్ట్ జూనియర్ ఎన్టీఆరే. మొదటిసారే తారక్ హోస్ట్ గా మంచి మార్కులు కొట్టేశారు. రేపు ప్రారంభం కాబోయేది 5వ సీజన్.
ఈ ఐదు సీజన్లలో ఎన్టీఆర్. నాగార్జున, నాని హోస్ట్ లు ఈ కార్యక్రమం నిర్వహించారు. బిగ్ బాస్ 2 వ సీజన్ లో హోస్ట్ గా నాని రంగ ప్రవేశం జరిగింది. జూనియర్ స్టామినా చూశాక నానీని హోస్ట్ గా జీర్ణించుకోవడం కూడా కష్టమైంది. దాంతో నిర్వాహకులు మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ వైపు చూసినా ఆయన ఆసక్తి చూపలేదు. దాంతో కింగ్ నాగార్జున రంగ ప్రవేశం జరిగింది. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో నాగ్ సత్తా ఏంటో అందరికీ తెలుసు. పైగా బిగ్ బాస్ లోనూ సత్తా చాటారు. దాంతో రెండు సీజన్లకు నాగార్జుననే హోస్ట్ గా ఎంచుకున్నారు.
ఐదో సారి మాత్రం రానా పేరు పరిశీలనకు వచ్చినా నిర్వాహకులు మాత్రం మళ్లీ నాగ్ వైపే మొగ్గుచూపారు. బిగ్ బాస్ హోస్ట్ గా మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకు రావాలని ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దానికి కారణం జూనియర్ సినిమాలతో బిజీగా ఉండటమే. దాంతో పాటు తాజాగా జెమినీ కోసం ‘ఎవరు మీలో కోటీశ్వరులు?’ అంగీకరించారు. ఈ ముగ్గురిలో ఒక్క నానీ తప్ప మిగతా ఇద్దరూ బిగ్ బాస్ హోస్ట్ లుగా రాణించిన వారే. వీరిలో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అనడం కూడా కరెక్ట్ కాదు.
Must Read ;- పాలిటిక్స్ అంటేనే ఎన్టీఆర్ కట్ అంటున్నారే











