టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని, ఏపీకి నెక్ట్స్ సీఎం ఆయనేనని కొందరు తెలుగు తమ్ముళ్లు అక్కడక్కడ నానా యాగీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా కెరీర్ పరంగా ఓ బ్రహ్మాండమైన్ గ్రాఫ్ లో దూసుకుపోతున్న తారక్.. రాజకీయాల పట్ల అంతగా ఆసక్తి కనబరచడం లేదనే చెప్పాలి. ఎప్పటికప్పుడు ఆయనను దీనిపై ప్రశ్నిస్తున్నా.. సమాధానం దాటవేస్తూనే వస్తున్న ఆయన తాజాగా తన మనసులోని మాటను మరింత సూటిగా చెప్పారన్న వాదనలు వినిపిస్తున్నాయి. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడిగా.. అచ్చు గుద్దినట్లు ఆయన పోలికలతోనే ఉన్న తారక్ రాజకీయాల్లోకి వస్తే.. టీడీపీ పుంజుకుంటుందని పలువురు తెలుగు తమ్ముళ్లు బలంగా విశ్వసిస్తున్న వైనం అక్కడక్కడా, అప్పుడప్పుడూ కనిపించి వినిపిస్తోంది. అయితే ఎన్టీఆర్ మాత్రం ఆ దిశగా పయనించే ఉద్దేశమే లేదన్న రీతిలో కదులుతున్నారు.
చెర్రీతో కలిసి తొలి షో..
ఇలాంటి క్రమంలో త్వరలో జెమినీ టీవీలో ప్రసారం కానున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రాం హోస్ట్ గా కనిపించనున్న తారక్.. అందులో కొన్ని ఎపిసోడ్ల షూటింగ్ ను అప్పుడే పూర్తి చేశారట. ఈ కార్యక్రమంలో తొలి ఎపిసోడ్ లో సినీ రంగంలో తనకు ఆప్త మిత్రుడిగా కొనసాగుతున్న రాంచరణ్ తేజ్ తో కలిసి తారక్ కనిపిస్తారట. ఈ ఎపిసోడ్ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. దాని ఎడిటింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి అయినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఎపిసోడ్ చాలా ఉల్లాసంగా జరిగిందని.. ఎన్టీఆర్ సంధించే ప్రశ్నలకు బదులిస్తూనే రాంచరణ్ కూడా ఆయనకు పలు కీలక అంశాలకు సంబంధించిన ప్రశ్నలు సంధించారట. ఈ ప్రశ్నలకు ఇతరుల వద్ద అయితే పెద్దగా మాట్లాడని తారక్.. రాంచరణ్ అడిగిన వెంటనే చాలా బోల్డ్ గానే స్పందించారట. రాంచరణ్ ప్రశ్నల్లో తారక్ రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించిన ప్రశ్న కూడా ఉందట.
అన్నీ చెప్పి.. అంతా కట్ చేయించి..
ఈ సందర్భంగా తారక్ ను ఓ కీలక ప్రశ్న అడిగిన చెర్రీ.. నువ్వు కూడా రాజకీయాల్లోకి వెళ్తున్నావంటగా’ అంటూ ప్రశ్నించారట. దీనికి బదులుగా రాజకీయాలపై తన మనసులోని మాటను క్లిస్టర్ క్లియర్ గానే తారక్ చెప్పేశారట. అంతేకాకుండా తన పొలిటికల్ ఎంట్రీపై చెర్రీకి పూర్తి క్లారిటీ వచ్చేలా కూడా తారక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారట. ఇదంతా బాగానే ఉన్నా.. ఆ షూటింగ్ అవగానే.. సదరు వ్యాఖ్యలను, తన రాజకీయ రంగ ప్రవేశం గురించి చెర్రీ అడగడం, తాను ఆన్సర్ ఇవ్వడం.. ఆ మొత్తాన్ని కట్ చేయమని ఎడిటర్లకు చెప్పిన తారక్.. వాటిని పూర్తిగా డిలీట్ చేయించేశాడట. అంటే రాజీకయాల మాటెత్తితేనే కట్ చెబుతున్నాడంటే.. రాజకీయాలపై తారక్ కు ఏమాత్రం ఆసక్తి లేనట్టేగా. ఈ షూటింగ్ కు సంబంధించిన తారక్ పొలిటికల్ ప్రస్థానం అంశాలు ఇకపై ఏ ఒక్కరికి తెలియకపోయినా.. ఆ నోటా, ఈ నోటా అవి లీకై.. ఇలా బయటపడ్డాయట.
Must Read ;- వ్యూస్ కొల్లగొడుతున్న ట్రిపుల్ ఆర్‘దోస్తీ’ పాట