యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక దిగ్గజం రాజమౌళి సినిమాలో విడుదలయ్యే పాట ఏ స్థాయిలో ఉంటుందన్న అంచనాలు అందరికీ ఉంటాయి. ఆ రోజు రానే వచ్చింది. పాట కూడా విడుదలైంది. తెలుగు పాట విడుదలైన రెండో రోజుకే యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ ను కొల్ల గొట్టింది. ఇక ఇతర భాషల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ సినిమా ఆడియో హక్కులను టీ సిరీస్ సొంతం చేసుకుంది. కీరవాణి సంగీత సారథ్యంలో హేమచంద్ర పాడిన ‘దోస్తీ’ పాటకు ఊహించని రీతిలో స్పందన లభిస్తోంది.
ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఈ పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తమిళంలో అనిరుధ్ రవిచందర్, హిందీలో అమిత్ త్రివేదీ, మలయాళంలో విజయ్ యేసుదాసు, కన్నడంలో యాజిన్ నిజార్ ఈ పాటను పాడారు. తెలుగులో ఈ పాటకు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. తమిళంలో మదన్ కర్కి, హిందీలో రియా ముఖర్జీ, కన్నడంలో ఆజాద్ వరదరాజ్, తమిళంలో మన్‌కొంబు గోపాలకృష్ణన్ సాహిత్యం అందించారు.
‘పులికీ విలుకాడికీ.. తలకీ ఉరి తాడుకీ.. కదిలే కార్చిచ్చుకీ .. కసిరే వడగళ్ళకీ .. రవికీ మేఘానికీ .. ఈ.. దోస్తీ …. దోస్తీ ..’ అనే పల్లవితో సాగే ఈ పాటకు భావగర్భితమైన పదజాలాన్ని సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించారు. మల్టీస్టారర్ మూవీ అనగానే హిందీలో షోలే సినిమానే ఎవరికైనా గుర్తొస్తుంది. ఇప్పటికీ చెరిగిపోని రికార్డు ఆ సినిమాకే ఉంది. అందులో అమితాబ్, ధర్మేంద్రలపై ఇలాంటి దోస్తీ సాంగ్ ఉంటుంది. ట్రిపుల్ ఆర్ లో కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్ ల స్నేహాన్ని ఈ పాట ద్వారానే దర్శకుడు చెప్పేశాడు.
అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్ లుగా నటించే ఈ సినిమాలో అజయ్ దేవ్ గణ్ ఓ ప్రత్యేక పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 1 నుంచి ప్రారంభమైన ఈ పాటల విందు ఇక ముందు కూడా కొనసాగుతుంది. త్వరలోనే మరో పాటను విడుదల చేయడానికీ సన్నద్ధమవుతున్నారు. సినిమాని మాత్రం దసరా సందర్భంగా అక్టోబరు 13న విడుదల చేయనున్నారు.
ప్రస్తుతం మరో పాట చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ ఉక్రెయిన్ వెళుతున్నట్టు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్ ల మీద చిత్రీకరించే ఈ పాటతో సినిమా షూటింగ్ పూర్తయిపోతుంది. ఆగస్టు రెండో వారం వరకూ షూటింగ్ జరుగుతుంది. దీంతో ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయిపోతుంది.
Must Read ;- ఇంతకీ బోయపాటి నెక్స్ట్ సినిమా హీరో ఎవరు?











