అంతటా బిగ్ బాస్ ఫీవర్ అలుముకుంటోంది. తెలుగు బుల్లితెర రంగంలో ఈ షోకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ 5 సీజన్ గురించి ఇప్పటినుంచే రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈసారి హోస్ట్ మారబోతున్నారన్న వార్త మొదట ప్రచారంలోకి వచ్చింది. దగ్గుబాటి రానా హోస్ట్ గా రానున్నారన్న ప్రచారం సాగిందికానీ దానికి ఇప్పుడు ఫుల్ స్టాప్ పడింది. ఈసారి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా రానున్నారన్న సమాచారం ఉంది. మరి కంటెస్టెంట్స్ ఎవరు? దీని మీదే ఇప్పుడు సోషల్ మీడియా అంతా చర్చ సాగుతోంది. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాలన్న ఉబలాటం చాలా మందిలో ఉంది.
అసలు ఈ షోలో అడుగుపెట్టడం కోసమే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు కూడా ఉన్నారు. తరచూ ఏదో ఒక రూపంలో వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు. హౌస్ లోకి వెళ్లే అవకాశం ఎవరిని వరిస్తుందో చెప్పలేం. అదేంటోగానీ గత షోకీ, ఈషోకీ కూడా కరోనా భయం ఉంది. కరోనా మూడో వేవ్ భయాందోళనలు ఓ పక్క వణికిస్తున్నాయి. అందరూ వ్యాక్సిన్సు వేయించుకున్నారు కాబట్టి అందరూ ధైర్యంగానే ఉన్నారు. ఈ షోకి సంబంధించిన అధికారిక సమాచారం త్వరలోనే రానుంది. నిర్వాహకులు కూడా ఆ సన్నాహాల్లోనే ఉన్నారు.
కంటెస్టెంట్స్ ఎవరు?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్స్ మీద ఇప్పటికే ఊహాగానాలు ఉన్నాయి. లీకేజీలు కూడా వస్తున్నాయి. సెప్టెంబరు 5 నుంచి ఈ షో ప్రారంభమవుతుందన్న ప్రచారం ఉంది. ప్రేమకావాలి చిత్రంలో హీరోయిన్ గా నటించిన ఇషాచావ్లాకి ఇందులో చోటు దక్కిందన్న వార్త బయటికి పొక్కింది. టిక్ టాక్ దుర్గారావు పేరు కూడా ప్రచారంలో ఉంది. యాంకర్లు వర్షిణి, శివ, లోబో, రవి, సురేఖావాణి, మంగ్లీ, టీవీ 9 ప్రత్యూష, నృత్య దర్శకుడు శేఖర్ మాస్టర్ లేదా రఘు మాస్టర్ తదితరుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. 100 రోజులు పాటు సాగే ఈ షోకి ప్రధాన ఆకర్షణ ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్లే.
టిక్ టాక్ దుర్గారావు తన భార్యతో కలిసి ఈ హౌస్ కి వెళ్లడానికి రెడీ అంటున్నారు. టిక్ టాక్ వీడియోలతో సెలబ్రిటీగా మారిన దుర్గారావుకు జబర్దస్త్ లాంటి కామెడీ షోలలో కూడా అవకాశం లభించింది. తనకు ఈ అవకాశం వస్తే మాత్రం వదులకోనని దుర్గారావు అంటున్నారు. అవకాశం దొరికే వరకూ మౌనంగా ఉండటమేనని, ఆ తర్వాత తుపానేనంటూ ట్విట్టర్ స్పందిస్తోంది ఇషా చావ్లా.. ఏం జరుగుతుందో చూడాలి. మరో వారం రోజుల్లో తెలుగు బిగ్ బాస్ 5పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటిదాకా ఎదురుచూడక తప్పదు.
Must Read ;- పాలిటిక్స్ అంటేనే ఎన్టీఆర్ కట్ అంటున్నారే