చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం మోపిన మద్యం కేసు అసలు టార్గెట్ టీడీపీ అధినేత కాదని, మరో వ్యక్తి అని తెలుస్తోంది. చంద్రబాబు హయాంలో లిక్కర్ పై ప్రివిలేజ్ ఫీజును మాఫీ చేసి కొంత మంది లబ్ది పొందారని ఏపీ సీఐడీ ఆరోపణలు చేసింది. దీంట్లో అప్పటి సీఎం చంద్రబాబు, అప్పటి మంత్రి కొల్లు రవీంద్రలతో పాటు శ్రీరామశ్రీనరేష్ అనే ఐఏఎస్ అధికారిని కూడా నిందితులుగా చేర్చారు. కానీ, లిక్కర్ పై ఈ ప్రివిలేజ్ ఫీజు రద్దు ప్రతిపాదన పెట్టింది అప్పట్లో ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న కల్లం అజేయ రెడ్డి. ఆ తర్వాత వచ్చిన ముఖేష్ కుమార్ మీనా దాన్ని అమలు చేశారు. అసలు ఈ మొత్తం కేసులో కీలకంగా ఉన్నది ఈ ఇద్దరు వ్యక్తులే కానీ, సరిగ్గా ఈ ఇద్దరి పేర్లే పైకి రానివ్వలేదు. ఈ కేసు అసలు లక్ష్యం చంద్రబాబు కాదని, ముఖేష్ కుమార్ మీనా అని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ముకేష్ కుమార్ మీనా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, మరో నాలుగు నెలల్లో ఆయన చేతుల మీదుగానే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి.
అందుకే ముకేష్ కుమార్ మీనాతో ఎన్నికల్లో తమకు సహకరించడం కోసం ఈ మద్యం కేసును తెరపైకి తెచ్చినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల్లో తాము చెప్పినట్లుగా చేయకపోతే, ఈ మద్యం కేసులో పేరు చేరుస్తామని.. తాము చెప్పినట్లు వింటే అజేయ కల్లం తరహాలో ఏ చింత లేకుండా ఉండొచ్చని ముకేష్ కుమార్ మీనాను బెదిరించినట్లు తెలుస్తోంది. ఇలా సీనియర్ ఐఏఎస్ అఫీసర్ ని ప్రభుత్వమే బెదిరింపులకు గురి చేస్తుండడం అధికారవర్గాల్లో సంచలనంగా మారింది. నిలబడని కేసులతో జైలు పాటు చేయిస్తున్న ప్రస్తుత ప్రభుత్వం.. అందులోని వ్యవస్థల పతనంపై అధికారులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
లిక్కర్ షాపులకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయడం అనేది పూర్తిగా విధానపరమైన నిర్ణయం. ఏ ఒక్కరి వ్యక్తిగత నిర్ణయమో కాదు. ఇది కోర్టులో ఎక్కువ రోజులు నిలబడదు. పదే పదే ఖజానాకు నష్టం జరిగిందని వాదిస్తుంటారు. కానీ మరోవైపు, ప్రివిలైజ్ ఫీజు రద్దు చేయడం వల్ల ఏపీలో దాని నుంచి వచ్చే ఆదాయం పెరిగిందని కాగ్ నివేదిక కూడా ఉంది. అయినా కోర్టును తప్పుదోవ పట్టిస్తుంటారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసు తరహాలో చంద్రబాబును వేధించినట్లుగా ఇప్పుడు ముఖేష్ కుమార్ మీనాపైన కూడా ఇదే ప్రయోగం చేస్తున్నారని జోరుగా చర్చ సాగుతోంది.
ముఖ్యంగా ఓటర్ల జాబితా విషయంలో ఎన్నికల ప్రధాన అధికారిని తమ చేతల్లో పెట్టుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. వేలాది నకిలీ ఓటర్లు జాబితాలో ఉన్నారు. అలా ఒక్కో నియోజకవర్గంలో 10 వేలకుపైగా ఓట్లు గ్యాంబ్లింగ్ చేసినా.. అధికార పార్టీ ఎన్నికల్లో లబ్ధి పొందొచ్చు. టీడీపీ మద్దతుదారుల ఓట్లు తొలగించడం, దొంగ ఓట్లు చేర్చడం లాంటి పనులు చేస్తున్నారు. ఓటర్ జాబితా సవరణలో వాలంటీర్లను భాగం చేస్తున్నారు. జగన్ సైన్యంగా చెప్పుకొనే వారి ప్రమేయం వద్దని చెప్పినప్పటికీ మొత్తం వారి చేతుల మీదుగానే జరుగుతోంది. అయినా ఎన్నికల ప్రధాన అధికారి ఏమీ చేయలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఏ చర్యలు తీసుకుంటుందో చూడాలి.











