ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తిరుమల మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు దూకుడు పెంచారు. సోమవారం ప్రధాని మోదీ తిరుమల పర్యటన సందర్భంగా రమణ దీక్షితులు ప్రధానిని కలిసి జగన్ పై ఫిర్యాదు చేశారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ప్రధాని శ్రీరచన గెస్ట్ హౌస్‌లో విశ్రాంతి తీసుకోగా అదే సమయంలో రమణ దీక్షితులు ప్రధానితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే జగన్ సర్కారుపై ఫిర్యాదులు సమర్పించారు. తిరుమల ఆలయం ప్రభుత్వ కబంధ హస్తాల్లో ఉందని.. శ్రీవారి ఆలయాన్ని పరిరక్షించాలని ప్రధాని నరేంద్ర మోదీని రమణ దీక్షితులు కోరారు. అంతేకాకుండా.. ఒకప్పుడు ఏపీలో హిందూ దేవాలయాలు, నిర్మాణాలు, పురాతన సాంప్రదాయాలను జగన్ నాశనం చేస్తున్నారని.. వెంటనే శ్రీవారి ఆలయాన్ని రక్షించాలని కోరినట్లు తెలుస్తోంది.
కొన్నేళ్ల క్రితం వరకూ సీఎం జగన్ అంటే రమణ దీక్షితులకు అత్యంత అభిమానం ఉండేది. ఆయన సీఎం అవ్వాలని ఎన్నో పూజలు కూడా చేసేవారు. జగన్ కోసం తిరుమలలోనే సుదర్శనయాగం చేశారు. తిరుమల వ్యవహారాల్లో టీడీపీ జోక్యంపై ఎప్పటికప్పుడు అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న జగన్ కు లీకులు ఇచ్చేవారని చెబుతారు. అలాంటి రమణ దీక్షితులే తాజాగా ఇలా జగన్ పై మోదీకి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.
కొన్నాళ్లుగా జగన్ పై రమణ దీక్షితులు వ్యతిరేకత ప్రదర్శిస్తూనే ఉన్నారు. ప్రధాన అర్చకులుగా ఉన్న సమయంలో గత టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. పింక్ డైమండ్ పోయిందని.. పోటులో తవ్వకాలు చేశారని, చెన్నై, హైదరబాద్, బెంగళూరుల్లో ప్రెస్ మీట్లు పెట్టిమరీ గత ప్రభుత్వాన్ని నిందించారు. దీంతో ప్రధాన అర్చక పదవి ఊడింది. అలా జగన్ కు దగ్గర అవడంతో తమ ప్రభుత్వం రాగానే పూర్తి స్థాయిలో ప్రధాన అర్చక పదవి ఇప్పిస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఐదేళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆయనకు ఆ పదవి రాలేదు. ఈ కారణంతోనే సీఎం జగన్ పై రమణ దీక్షితులు కోపం పెంచుకున్నారని తెలుస్తోంది.











