తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీ విషయంలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఎలాంటి కల్తీ జరగకుండా అత్యంత ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకువస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కల్తీ నెయ్యి వివాదాల దృష్ట్యా, ఫ్రాన్స్ నుండి ప్రత్యేక యంత్రాలను తెప్పిస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు.
ప్రధానంగా నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు రూ.3.5 కోట్లతో ఈ-టంగ్ ఈ-నోస్ అనే యంత్రాలను దిగుమతి చేసుకుంటున్నారు. మనుషులు సైతం పసిగట్టలేని అతి సూక్ష్మమైన తేడాలను, అంటే నెయ్యి రంగు, రుచి లేదా వాసనలో ఏ చిన్న మార్పు ఉన్నా ఈ యంత్రాలు ఇట్టే కనిపెట్టేస్తాయి. మే నెల కల్లా ఈ టెక్నాలజీ తిరుమలలో అందుబాటులోకి వస్తుంది.
తిరుమలలోని పిండిమిల్లు ఆవరణలో రూ.25 కోట్లతో నిర్మిస్తున్న అత్యాధునిక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయి. వచ్చే నెల నుంచి ఇది భక్తులకు సేవలు అందించనుంది. ఇక్కడ కేవలం నెయ్యి మాత్రమే కాకుండా, శ్రీవారి ప్రసాదాల తయారీకి వాడే జీడిపప్పు, బాదం, యాలకులు, పసుపు, కారం వంటి 60 రకాల ముడి సరకులను ఎప్పటికప్పుడు నిశితంగా పరీక్షిస్తారు.
ఈ ల్యాబ్‌లో దాదాపు 50 రకాల అత్యాధునిక పరికరాలతో 200 రకాల పరీక్షలు చేసే వెసులుబాటు ఉంటుంది. సరుకుల్లో ఏవైనా పురుగుమందుల అవశేషాలు,హెవీ మెటల్స్, క్రిమికీటకాలను గుర్తించేందుకు మైక్రోబయోలజీ, కెమిస్ట్రీ విభాగాల్లో నిపుణులు తనిఖీ చేస్తారు. TTD అందించే జల ప్రసాదాన్ని కూడా ఇక్కడే పరీక్షిస్తారు. దీనివల్ల భక్తులకు అత్యంత పవిత్రమైన, నాణ్యమైన ప్రసాదాలు అందుతాయని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.











