2026లో కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్‌లో భారీ ప్రాజెక్టులు చేపడుతోంది. దేశవ్యాప్తంగా 17 లక్షల కోట్ల రూపాయల విలువైన రవాణా, లాజిస్టిక్స్.. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఈ సంవత్సరం పట్టాలెక్కనున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక లక్షా 16 వేల కోట్ల విలువైన పనులను దక్కించుకొంది. ఏపీలో హైవేలు, పోర్టులు, ఎయిర్‌పోర్టుల వంటి మౌలిక సదుపాయల కల్పనకు కూటమి ప్రభుత్వం చూపిస్తున్న చొరవకు.. కేంద్ర ప్రాజెక్టుల సాధన ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది.
ఈ ప్రాజెక్టులన్నీ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మిస్తున్నవే కావడం విశేషం. విజయవాడ, బెంగళూరు హైవే ప్రాజెక్టులో ప్రైవేటు నిర్మాణ సంస్థ.. 4 గిన్నిస్ రికార్డులు దక్కించున్న వైనం చూశాం. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 20 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. జీఎమ్మార్ సంస్థతో కలిసి.. భోగాపురం ఎయిర్‌పోర్టు.. ఏవియేషన్ ఎడ్యూ సిటీ నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఈ ఏడాది జూన్ నాటికి భోగాపురం విమానాశ్రయంలో కమర్షియల్ ఫ్లయిట్స్ ఆపరేషన్లు ప్రారంభం అవుతాయి. దుగరాజపట్నంలో పోర్టు, దగదర్తిలో ఎయిర్‌పోర్టు ప్రతిపాదనలు కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్‌లో.. ఈ సంవత్సరమే ఆచరణలోకి రానున్నాయి.
వచ్చే మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 270 ప్రాజెక్టులు ప్రారంభం అవుతాయి. విశాఖ, విజయవాడ మెట్రో రైలు, అమరావతిలో కనెక్టివిటీ ప్రాజెక్టులు.. సౌర విద్యుత్ ఉత్పత్తి వంటి రంగాల్లో పీపీపీ విధానంలో ప్రాజెక్టులు పట్టాలెక్కేనున్నాయి. ఏపీ తర్వాత తమిళనాడు, మధ్యప్రదేశ్ రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. కొత్తగా వస్తున్న ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు ఊతంగా మారుతాయి. మౌలిక సదుపాయాలు అభివృద్ది చెందితే.. ప్రజా రవాణా, సరకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు చౌకగా మారుతాయి. అత్యుత్తమ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే.. అధునాతన పరిశ్రమలు రాష్ట్రంలో తమ యూనిట్లు ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తాయి. కొత్త కంపెనీలు వస్తే ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకశాలు పెరగడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరుతుంది. ఇప్పటి వరకు కేంద్రం మంజూరు చేసిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పూర్తయితే.. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే బెస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కలిగిన స్టేట్‌గా నిలవడంతో పాటు.. లాజిస్టిక్స్ హబ్‌గా మారుతుంది.











