ఒక కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తే ఎస్సై పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారు. అది కూడా ఎక్కడంటే.. సాక్షాత్తు పోలీస్ స్టేషన్‌లోనే కేక్ కట్ చేశారు. వివరాల్లోకి వెళితే గుంటూరు మాచర్లలో తెలుగుదేశం పార్టీ నేతలపై జరిగిన హత్యాయత్నం ఘటనలో నిందితుడిగా తురకా కిశోర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆ కేసులో నిందితుడిగా ఉన్న కిశోర్.. పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఎస్సై జన్మదిన వేడుకలకు ముఖ్యతిధిగా హాజరు కావడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
బుధవారం జరిగిన ఈ పుట్టినరోజు వేడుకల ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ సంవత్సరం మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మాచర్ల పరిధిలోని పలుచోట్ల తెలుగుదేశం పార్టీ వర్గీయుల నామినేషన్ పత్రాలను కొందరు వైసిపి కార్యకర్తలు చించేసి, దౌర్జన్యం చేశారు. ఈ ఘటనపై పరిశీలనకు వెళ్లిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, న్యాయవాది కిశోర్‌లు మాచర్ల పట్టణంలోకి రాగానే వారిపై బరిశెలతో దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇందులో వైసిపి మాచర్ల మునిసిపల్ ఛైర్మన్ అభ్యర్థి తురకా కిశోర్ వారిపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఫోటోలు క్షణాల్లో వైరలయ్యాయి. ఈ కేసులో సిఐ రాజేశ్వరరావు సరిగా స్పందించలేదని అతనిపై ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు అదే సిఐ సమక్షంలో హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న తురకా కిశోర్.. పోలీసు స్టేషన్‌లోనే ఏకంగా ఎస్సై మోహన్ పుట్టిన రోజు వేడుకలకు హాజరై కేక్ కట్ చేయడం పోలీసు, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే ఇలా నిందితులతో చెట్టాపట్టాల్ వేసుకొని తిరగడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. నిజనిజాలను వెలికితీయాల్సిన పోలీసులకు నిందితులతో స్నేహమేంటని విమర్శలు చేస్తున్నారు.











