టీడీపీ నుంచి ఎమ్మెల్సీ పదవి పొంది వైసీపీలో చేరిన పోతుల సునీత పదవికి రాజీనామా సమర్పించారు. అమరావతి రాజధాని బిల్లుపై పార్టీ విప్ ధిక్కరించారు. పోతుల సునీతపై విప్ ధిక్కరించినందుకు వేటు వేయాలని మండలి ఛైర్మన్ కు టీడీపీ ఫిర్యాదు చేసింది. దీనిపై మండలి ఛైర్మన్ షరీఫ్ ఐదు సార్లు ఆమెను విచారణకు పిలిచినా, అనేక కారణాలు సాకుగా చూపుతూ హాజరు కాలేదు. చివరగా పోతుల సునీత తల్లికి కరోనా సోకిందని హాజరు కాలేనని చెప్పారు.
అదే రోజు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన విద్యాకానుక పథకం ప్రారంభానికి హాజరయ్యారు. ఈ వీడియోలను కూడా టీడీపీ సభ్యులు మండలి ఛైర్మన్ కు అందించారు. దీంతో ఇక వేటు ఖాయమని తేలిపోయింది. వేటు కన్నా రాజీనామా చేస్తే రాజకీయంగా సానుభూతి దక్కుతందనే ఉద్దేశంతోనే పోతుల సునీత రాజీనామా లేఖను మండలి ఛైర్మన్ కు పంపారని తెలుస్తోంది.
వైసీపీ సిద్దాంతాల కోసమే అని చెప్పే అవకాశం
వైసీపీ సిద్దాంతం ప్రకారం ఆ పార్టీలో చేరే ప్రజా ప్రతినిధులు ముందుగా పదవికి రాజీనామా చేయాలని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అనేక మీటింగుల్లో చెప్పారు. అందుకే టీడీపీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేస్తున్నానని పోతుల సునీత ప్రకటించే అవకాశం ఉంది. డొక్కా తరహాలో రాజీనామా చేసి, మరలా వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికవ్వాలని పోతుల సునీత భావించడం కూడా ఇందుకు కారణం కావచ్చు.
దీనికితోడు ఆమె చీరాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నా, అక్కడ ఇప్పటికే ఇద్దరు సీనియర్ వైసీపీ నేతలు పాగా వేశారు. ఇక వారితో పోరాడి చీరాల వైసీపీ సీటు దక్కించుకోవడం కూడా సాధ్యం కాదని సునీత భావిస్తున్నారట. అందుకే రాజీనామా చేసి మరలా ఎన్నికైతే మరో ఆరేళ్లు ఎమ్మెల్సీగా కొనసాగవచ్చనే అభిప్రాయంతోనే ఆమె రాజీనామా చేశారని తెలుస్తోంది.
మరలా మండలికి పంపిస్తారట…
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన పోతుల సునీతను మరలా మండలికి పంపిస్తామనే హామీ వైసీపీ పెద్దల నుంచి లభించిందట. అందుకే ఆమె రాజీనామాకు సంసిద్దత వ్యక్తం చేశారని సమాచారం. ఎలాగూ ఆమెకు చీరాలలో కానీ, అనంతపురం జిల్లాలో కానీ ఎమ్మెల్యే సీటు ఇచ్చే అవకాశాలు లేవు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన సమయంలో ఆ పార్టీ నేతలు హామీ ఇచ్చిన ప్యాకేజీ కూడా సరిగా అందలేదని సునీత అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. ఆమెను బుజ్జగించేందుకైనా మరలా ఎమ్మెల్సీ పదవి ఇస్తారని తెలుస్తోంది.
ఎమ్మెల్సీలకు ఒక సిద్దాంతం, ఎమ్మెల్యేలకు మరొకటా….
ఎమ్మెల్సీలు రాజీనామా చేసినా వాటిని గ్యారంటీగా వైసీపీ గెలుచుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఎమ్మెల్సీల రాజీనామా విషయంలో మాత్రం సిద్దాంతాలు గుర్తుకువస్తున్నాయి. ఇక టీడీపీ నుంచి వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేల విషయంలో మాత్రం వైసీపీ నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. టీడీపీ గెలిచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యేలు రాజీనామాచేసి ఎన్నికలకు వెళితే ఒక్కరు కూడా గెలిచే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే వారిని అధికారికంగా పార్టీలో చేర్చుకోకుండా.. నాటకీయంగా చేరిక పరిణామాలను రక్తి కట్టిస్తున్నారు. రాజీనామా చేశాకే పార్టీలో చేర్చుకుంటా అని చెప్పిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేరికల సందర్భంలో మీడియా ముందుకు రాకపోవడానికి కూడా ఇదే కారణమనే ప్రచారం సాగుతోంది.











