తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.. ఏదో మైలేజీకోసం తన పార్టీలోని కాపు నాయకులు కొందరు తలాకొంచెం వేసుకుని అదృశ్యం అయిన సాయికృష్ణ కుటుంబానికి సాయంగా అందించడానికి పూనుకుంటే.. ప్రజలు తిరస్కరించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి దానిని కూడా అడ్డుకుంటున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.
తనతో సంప్రదించకుండానే.. తన అనుమతి లేకుండానే.. సాయికృష్ణ కుటుంబానికి కాపునేతలందరూ సాయం చేయడానికి పూనుకోవడంపై వైఎస్ జగన్ ఆగ్రహించినట్టుగా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మళ్లీ తాను చెప్పే వరకు సాయికృష్ణ కుటుంబానికి కాపునేతలు ఆర్థిక సాయం అందించడం ఆపాలని ఆయన పురమాయించినట్టు సమాచారం. తొందరపడి డబ్బు ఇచ్చేయడం వద్దనే ఆయన ఉద్దేశాన్ని తాజా ట్వీట్ బయట పెడుతోంది.
సాయికృష్ణ విషయంలో తన పాచిక పారకుండా.. అతని తల్లి- చంద్రబాబునాయుడు తమకు న్యాయం చేశారని సంతృప్తి వ్య్తక్తం చేయడాన్ని సహించలేకపోతున్న జగన్ తాజాగా ఒక ట్వీట్ చేశారు. సాయికృష్ణ బతికున్నాడా చనిపోయాడా అంటూ అందులో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. ఒకవేళ మరణించి ఉంటే మృతదేహం ఎక్కడ? అని కూడా ట్వీట్ లో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ నమోదై నాలుగు రోజులు అయిందని, ఇప్పటిదాకా ఎవరినీ ఎందుకు అరెస్టు చేయలేదని జగన్ ట్వీట్ లో ప్రశ్నించారు.
ఈ ట్వీట్ వెనుక అసలు కుట్ర ఉందని పార్టీ వర్గాలే అంటున్నాయి. సాయికృష్ణ చనిపోయాడో లేదో ముందు కన్ఫర్మ్ కావాలని అప్పటిదాకా ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడం వద్దని జగన్ కాపునేతలను హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. ఆ కన్ఫర్మేషన్ కోసమే ఈ ట్వీట్ పెట్టారని అంటున్నారు. పార్టీ పరంగా రూపాయైనా విదిలించడం లేదు. కాపునేతలు వాళ్లలో వాళ్లు చందాలు వేసుకుని సాయం చేస్తోంటే .. దానికి కూడా జగన్ అడ్డం పడుతున్నారని.. ఆ పార్టీలోని కాపు నాయకులే ఆవేదన చెందుతున్నారు.
కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు? అనేది సామెత. రాష్ట్ర ప్రజలు ఛీత్కరించుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆరాటం గమనిస్తే అదే సామెత గుర్తుకువస్తోంది. సాయికృష్ణ అదృశ్యం అయిన వ్యవహారంలో మైలేజీ కోసం కుటిల రాజకీయాలు చేయదలచుకున్న తన పన్నాగాలు ఫలించకపోయేసరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసహనానికి గురవుతున్నారు. అదృశ్యం అయిన సాయికృష్ణ తల్లి, కుటుంబ సభ్యులు స్వయంగా చంద్రబాబు తీసుకుంటున్న చర్యల పట్ల సంతృప్తిగా ఉండగా.. కత్తిపీటకు ఎక్కువ దురద పుట్టినట్టుగా.. తన ప్యాలెస్ నుంచి బయటకు అడుగు పెట్టని జగన్మోహన్ రెడ్డి ఎక్స్ ఖాతాలో అతి చేస్తున్నారని ప్రజలు అంటున్నారు.











