రౌద్రం.. రణం.. రుధిరం.. వెరసి ఆర్.ఆర్.ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తనకంటూ ప్రత్యేక ముద్రను సాధించుకోవడం విశేషమే. కానీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ విషయంలో ఆయన తప్పటడుగులు వేస్తున్నారా అనే సందేహం కలుగుతోంది. అసలు ఈ సినిమాని ప్రకటించినప్పుడే వివాదం మొదలైంది. ఇది 1920 నాటి కథాంశం. అంటే దాదాపు వందేళ్ల వెనక్కి వెళ్లిన కథ. ఎప్పుడైనా చరిత్రను చెప్పేటప్పుడు అనేక విషయాలను మనసులో పెట్టుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చరిత్రను వక్రీకరించడం అతి పెద్ద తప్పిదం. మనకు పరిచయం లేని వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.
సైరా నరసింహారెడ్డి సినిమా చేసేటప్పుడు కూడా వివాదాలు తలెత్తాయి. అసలు నరసింహారెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడే కాదనేవారు కూడా ఉన్నారు. ఆ విషయాన్ని అలా పెట్టేసి ట్రిపుల్ ఆర్ సినిమాలోకి వచ్చేద్దాం. ఇందులో ఎన్టీఆర్ ను ముస్లిం గెటప్ లో చూపించడం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ఆ వివాదంలోకి వెళ్లే ముందు మనం కొంత వెనక్కి కూడా వెళ్లాలి. సినిమాలో రాజమౌళి ఏం చెప్పబోతున్నారు? నిజ జీవితంలో ఏం జరిగింది అనేది కొంచెమైన తెలిసి ఉంటే మంచిది కాబట్టి వెనక్కి వెళదాం.
ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే..
మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు 1897లో జులై 4న విజయనగరం సమీపంలోని పాండ్రంగిలో పుట్టారంటారు. బ్రీటీష్ సామ్రాజ్యమనే మహాశక్తిని ఢీకొని 27 ఏళ్లకే సైనికుల చేతిలో చనిపోయాడు. 1924 మే 7న బ్రిటీషు సైనికులు ఆయనను కాల్చి చంపారు. ఆయన స్కూలులో నేర్చుకున్న చదువుకన్నా బయట నేర్చుకున్న విద్యే ఎక్కువ. 1916లో ఆయన ఉత్తర భారతానికి వెళ్లారు. బెంగాల్ లో సురేంద్రనాధ్ బెనర్జీ దగ్గర కొంతకాలం ఉన్నారు. లక్నోలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో పాల్గొన్నారు. కాశీలో కొంతకాలం ఉండి సంస్కృతం నేర్చుకున్నారు. అలా అనేక ప్రదేశాలను తిరిగారు. బ్రహ్మకపాలంలో సన్యాస దీక్ష తీసుకున్నాక తిరిగొచ్చారు.
ఆ తర్వాత రెండోసారి 1918లో కూడా యాత్రకు వెళ్లారు. ఇక గోండు వీరుడు కొమరం భీమ్ విషయానికి వస్తే 1901 అక్టోబరు 22న సంకేపల్లిలో పుట్టారు. ఇది తెలంగాణ ప్రాంతం. 1940 అక్టోబరు 27న చనిపోయారు. నిజాం సైన్యం అతన్ని తుదముట్టించింది. ‘జల్-జంగిల్-జమీన్’ నినాదం వినగానే గుర్తొచ్చే పేరు కొమరం భీమ్. వీరిద్దరికీ వయసులో పెద్ద తేడా లేకపోవడాన్ని రాజమౌళి గమనించి ఉంటారు. అసిఫాబాద్, జోడేఘాట్ గుట్ట కేంద్రంగా నిజాం నవాబు పై గెరిల్లా పోరాటాన్ని కొనసాగించాడు భీమ్. అతనికి కుడిభజంగా కొమరం సూరి ఉండేవాడు. ఒకవిధంగా ఇది నక్సలైట్ పోరాటం లాంటిదే. అతని పదిహేనేళ్ల వయసులో అటవీ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి చనిపోవడంతో భీమ్ కుటుంబం కరిమెర ప్రాంతంలోని సర్దాపూర్‌కు వలస వెళ్లిపోయింది.
అక్కడ వీరి భూమిని సిద్దిఖీ అనే జమీందారు ఆక్రమించుకున్నాడు. ఆవేశం పట్టలేక భీమ్ అతడిని చంపేసి మహరాష్ట్ర, ఆ తర్వాత అస్సాం వెళ్లిపోయాడు. అక్కడే ఐదేళ్ల పాటు కాఫీ, తేయాకు తోటల్లో పనిచేసినట్లు చరిత్ర చెబుతోంది. తర్వాత తిరిగొచ్చాడు. నిజాం నవాబు పశువుల కాపర్లపై విధించిన పన్నులకు వ్యతిరేకంగా గిరిజనులందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి ఉద్యమం ప్రారంభించాడు. ఈ ఇద్దరి కథలోనూ ఉన్న సారూప్యాంశాలను తీసుకుని రాజమౌళి సినిమా చేస్తున్నారు. నిజం నవాబుపై చేసిన పోరాటంలోనూ అల్లూరి పాల్గొన్నట్లు రాజమౌళి చూపబోతున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇద్దరు అజ్ఞాతవాసులు తిరిగొచ్చిన తర్వాత ఒకే తరహాలో ఫైట్ చేయడం ఆసక్తికరంగా అనిపించి ఈ సినిమా చేస్తున్నట్లు రాజమౌళి ఈ సినిమా ప్రారంభం సందర్భంలోనే చెప్పారు. ఇది కేవలం ఊహాగానంతో రూపొందిస్తున్న సినిమా. పైగా ఈ సినిమా కోసం ఎంతో రీసెర్చ్ చేశామని రాజమౌళి చెబుతున్నారు. నిజానికి చరిత్రలో దొరకని అంశాలకు ఎంత శోధించి మాత్రం లాభం ఏమిటి? అసలు వాస్తవ పాత్రలను ఈ సినిమా కోసం ఎంచుకునే బదులు ఈ తరహా రెండు పాత్రలను సృష్టించి సినిమా చేసి ఉంటే ఇంత గందరగోళం జరిగి ఉండేది కాదని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.
కేవలం పబ్లిసిటీ స్టంట్ లో భాగంగానే ఈ పాత్రలను ఎంచుకున్నట్లు విమర్శకులు అంటున్నారు. ఈమధ్య రామా ఫర్ భీమ్ పేరుతో ఓ టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ లో ఎన్టీఆర్ గెటప్ ను ముస్లింగా చూపించారు. భీమ్ పాత్ర టకియా (ముస్లింలు ధరించే టోపీ) ధరించి ఉంటుంది. అంటే నైజాం కోటలో చేరడం కోసం భీమ్ ఈ గెటప్ లో వెళ్లినట్టు ఊహించుకోవాలన్న మాట. ఈ గెటప్ ను చూపిస్తుంటే కొమరం భీమ్ నైజాం నవాబుకు వ్యతిరేకంగా సాగించిన గెరిల్లా పోరాటమే ఈ సినిమానా అన్న సందేహం కూడా కలుగుతోంది. ఎందుకంటే ఈ పోరాటంలో కొమరం సూరి అనే వ్యక్తి కూడా పాలుపంచుకున్నాడు.
ఆ సూరి పాత్రే అల్లూరి సీతారామరాజు అనుకోవాలా అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది. భీమ్ కు ఇలా టోపీ పెట్టడానికి ఆదివాసీ సంఘాలు ఒప్పుకోవడం లేదు. చరిత్ర వీరులు అని చెప్పి తీయడం వల్ల రాజమౌళికి వచ్చిన తిప్పలివి. ఇది చరిత్ర కాదని, వారు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ అని చెప్పకుండా ఇద్దరు వీరుల గురించి ఓ కథ చెప్పి ఉంటే ఎలాంటి ఇబ్బందులూ ఉండేవి కావు. విమర్శకులు నోరు విప్పడానికి అవకాశం ఉండేది కాదు. మరి రాజమౌళి ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
– హేమసుందర్ పామర్తి











