రాజకీయాల్లో ప్రత్యర్థులను విమర్శించే తీరు ఒక్కొక్కరిదీ ఓ స్టైల్ ఉంటుంది. అయితే ఇందులో విజయశాంతిది ప్రత్యేక స్టైల్ అని చెప్పుకోవచ్చు. ప్రజావ్యతిరేక విధానాలపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్, ప్రచార కమిటీ ఛైర్మన్ విజయశాంతి ఎప్పటికప్పుడూ తనదైన శైలీలో స్పందిస్తూ వస్తున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని దొరల పాలన అని, ఘడీల పాలన అంటూ ప్రతి సారి విమర్శిస్తుంటారు.
తాజాగా దీనదయాళ్ నగర్‌లో సుమేధ అనే 12 ఏళ్ల విద్యార్థిని నాలాలో పడి బండచెరువులో శవమై తేలిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత విజయశాంతి మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెన్ని ప్రాణాలు పోవాలో చెప్పాలని ట్విట్టర్‌లో ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. చిన్నారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తామని మాటలు చెప్పారే గానీ.. చేతలేవీ అని ఫైరయ్యారు. చినుకు పడితే చాలు జంట నగరాలు చిత్తడవుతాయని మండిపడ్డారు. హైదరాబాద్‌లో కురిసిన వర్షంతో డ్రైనేజీలు నిండి, నాలాలు పొంగి.. మ్యాన్ హోళ్లలోకి నీరు ఎలా వస్తుందో కళ్ల ముందు చూశామని చెప్పారు. వర్షాలు కురవడంతో మ్యాన్ హోళ్లలో చాలా మంది పడిపోయి చనిపోయారని విజయశాంతి గుర్తుచేశారు. మీ ప్రభుత్వ హయాంలో నాలాలో పడి చనిపోయిన వారి లిస్టు తీస్తే గిన్నీస్ రికార్డ్ అవుతోందని ఆమె ఆరోపించారు. ఇకనైనా నివారణ పనులు చేపట్టాలని కోరారు. లేదంటే ప్రజల ఆగ్రహాంలో మీరు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఆమె సీఎం కేసీఆర్‌కు హితవు పలికారు.
అలా వచ్చి ఇలా వెళుతున్నారు….
తెలంగాణ కాంగ్రెస్‌కు స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి చాలా కాలంగా ఆమె యాక్టివ్ పాలిటిక్స్‌లో కనిపించడం లేదు. గాంధీ భవన్ మెట్లు కూడా ఎక్కడం లేదంట. అడపాదడపా వార్తల్లో.. అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారు. ఏదోక సందర్భాల్లో ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే మిగతా నాయకుల్లాగా యాక్టివ్ పాలిటిక్స్ లో కనబడటంలేదని పొలిటికల్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆమె మళ్లీ సుమేధ బాలిక అంశంపై వార్తల్లోకి వచ్చారు. టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లోకి వచ్చిన కొత్తలో బాగా దూకుడుగా విజయశాంతి కనిపించేవారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఎప్పడూ విమర్శలు గుప్పించేవారు. కానీ, ఇటీవల కాలంలో పూర్తి సైలెంట్‌గా మారిపోయారు. ఏదోక అంశంపైన మాట్లాడానికి మాత్రమే వార్తల్లోకి వస్తున్నారు.
పార్టీ సమావేశాలకూ దూరంగా…
కాంగ్రెస్ పార్టీలోని కొందరి నేతల తీరుపై రాములమ్మ అసహనంగా ఉన్నారని సమాచారం. దీంతో పార్టీ కీలక సమావేశాలకు దూరంగా ఉంటున్నారని తెలిసింది. దుబ్బాక ఉపఎన్నికపై పార్టీ నిర్వహించిన ముందస్తు సమావేశానికి ఆమె హాజరు కాలేదని తెలిసింది. మెదక్ ఎంపిగా పనిచేసిన అనుభవం విజయశాంతికి ఉంది. ఇప్పుడు అదే పార్లమెంట్ స్థానం పరిధిలో జరిగే దుబ్బాక ఉపఎన్నికపై పార్టీ నిర్వహించిన సమావేశానికి రాకపోవడంపై కాంగ్రెస్ రాష్ట్ర నేతలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం.











