Concerns Have Begun Over Veligonda Project In Prakasam District People :
వెలిగొండ ప్రాజెక్టు ప్రకాశం జిల్లాలోని 6 నియోజకవర్గాలకు తాగునీరు, సాగునీరు.. నెల్లూరు జిల్లాలోని రెండు నియోజకవర్గాలు, కడప జిల్లాలోని ఒక నియోజకవర్గానికి తాగునీరు, సాగునీటి కోసం వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నారు. కాగా కేంద్ర జలశక్తి శాఖ వెలిగొండ ప్రాజెక్టును గెజిట్ లో పొందు పరచలేదు. దీంతో ప్రకాశం జిల్లా వాసుల మీద పిడుగు పడ్డట్టు అయింది.
విభజన చట్టం ప్రకారం
విభజన చట్టం షెడ్యూల్ 11 సెక్షన్ 85(ఈ 7) ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోని ఆరు ప్రాజెక్టులను (హంద్రి నీవా, తెలుగుగంగ, గాలేరు-నగరి, వెలిగొండ, కల్వకుర్తి, నెట్టంపాడు) అనుకున్న ప్రకారమే పూర్తి చేయాలని స్పష్టంగా పేర్కొన్నారు. కాగా మొన్న కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్ లో వెలిగొండ ప్రాజెక్టును పొందుపరచలేదు. ఇది విభజన చట్టానికి పూర్తి వ్యతిరేకం. వెలిగొండ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నా ఆ ప్రాజెక్టును వదిలేయడం వల్ల ప్రాజెక్టు భవిషత్తు అంధకారంలోకి వెళుతుంది. 20 ఏళ్ళుగా సాగుతున్న ప్రాజెక్ట్ నిర్మాణం చివరి దశకు చేరిన సమయంలో ఇలాంటి చర్యలు ప్రాజెక్టు భవిష్యత్తును ప్రమాదంలో పడేయడమేనని చెప్పాలి. వెరసి మూడు జిల్లాల రైతాంగం పెట్టుకున్న ఆశలు అవిరైపోతున్నాయి. లక్షలాది ఎకరాలు బీడు పట్టిపోయి రైతాంగం సంక్షోభంలో కి నెట్టబడుతుంది. గత కొన్ని దశాబ్దాలుగా ప్రకాశం జిల్లా నీటి ఎద్దడితో అల్లాడుతోంది. జిల్లాలో 26 మండలాలు సాగర్ నీటి మీద, 23 మండలాలు వెలిగొండ మీద.. మిగిలిన మండలాలు భూగర్భ జలాల మీద ఆధారపడి ఉన్నాయి.
ప్రకాశం జిల్లా కష్టాలు తీరినట్టే
వెలిగొండ ప్రాజెక్టుపై జిల్లాలో 29 మండలాలు, భూగర్భ జలాలపై ఆధారపడి ఉన్నాయి . సాగర్ నీరు 5 ఏళ్ల కు ఒక సారి 6 ఏళ్లకు ఒక సారి మాత్రమే విడుదల చేస్తారు. సాగర్ పరిధిలోని రైతులు భూములు వదిలేసి కూలీలుగా మారిపోతున్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అయితే ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, కొండెపి నియోజకవర్గాలకు నీటి ఎద్దడి తీరుతుంది. 29 మండలంలో 4.59 లక్షల ఎకరాలకు నీరు అందడమే కాకుండా 1.5 మిలియన్ ప్రజలకు తాగునీరు అందుతుంది.
జిల్లా వాసుల డిమాండ్లు..
– విభజన చట్టప్రకారం వెలిగొండ ప్రాజెక్టును గెజిట్ లో చేర్చాలి.
– ఏపీ రాష్ట్ర పునర్విభజన చట్టం షెడ్యూల్ 11 ప్రకారం జిల్లా రైతుల హక్కుల పరిరక్షణ కోసం గెజిట్ నోటిఫికేషన్ మళ్ళీ విడుదల చేయాలి.
-కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కలసి తమ సమస్యలను విన్నవించుకునేందుకు సమయం ఇవ్వాలని ప్రకాశం జిల్లా రైతాంగం కోరుకుంటోంది.
Must Read ;- అన్నీ అపశకునాలే.. అమరావతికి ఇబ్బందే లేదు