బెజవాడ కనకదుర్గ గుడికి సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకుని ఏపీలోని అన్ని దేవాలయాలకు కొత్త శోభ సంతరించుకుంది. తిరుమల, శ్రీశైలం ఆలయాలతో పాటుగా బెజవాడ కనకదుర్గ ఆలయాన్ని కూడా అధికారులు ముస్తాబు చేశారు. తిరుమల, శ్రీశైలం ఆలయాల్లో ఏటా కనిపించిన మాదిరే వేడుకల ఏర్పాట్లు కనిపించగా.. ఒక్క విజయవాడ కనకదుర్గ గుడిలో మాత్రం గతేడాది వేడుకలకు తాజాగా ఇప్పటి వేడుకలకు మాత్రం తేడా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఏర్పాట్లలో భాగంగా ఆలయం చుట్టూ అలంకరించిన విద్యుద్దీపాలు అచ్చు గుద్దినట్లుగా వైసీపీ జెండా రంగులతో కూడిన వెలుగులను విరజిమ్మాయి. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.
ఈ రంగుల గోలేమిటో..?
వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు కనిపించిన ప్రతి దానికీ జగన్ సర్కారు తన పార్టీ రంగులు వేయిస్తున్న వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోర్టులు కూడా మొట్టికాయలు వేస్తూనే ఉన్నాయి. నిన్నటికి నిన్న ఏపీ హైకోర్టు ఇదే విషయంపై విచారణ చేపట్టిన సమయంలో చేతులు కట్టుకుని స్కూలు విద్యార్థి మాదిరిగా కోర్టులో బోనులో నిలబడ్డ జగన్ సర్కారు.. ఇకపై ఏ ప్రభుత్వ భవనానికి గానీ, వాహనానికి గానీ రంగులు వేయబోమని, తమ తప్పు తెలుసుకున్నామని తెలిపింది. అయితే క్లీన్ ఏపీ కింద కొనుగోలు చేసిన చెత్త సేకరణ యంత్రాలకు వైసీపీ రంగులను చెరిపేసిన తర్వాత మరోమారు కనిపించండంటూ జగన్ సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు జారీ అయిన గంటల వ్యవధిలోనే బెజవాడ కనకదుర్గ గుడి చుట్టూ వైసీపీ రంగులు కనిపించడం గమనార్హం.
ఇతర ఆలయాల్లో ఈ రంగులు లేవు
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో కనకదుర్గ గుడి కంటే కూడా ప్రసిద్ధమైన ఆలయం తిరుమల శ్రీవేంకటేశ్వరుడి ఆలయమే. ఏ రకంగా చూసినా దుర్గ గుడి కంటే తిరుమల ఆలయం పెద్దదే. అయితే దుర్గ గుడి మాదిరిగా తిరుమల ఆలయం చుట్టూ విద్యుద్దీపాలు వెలుగులు విరజిమ్మేలా ఏర్పాట్లు చేసినా..అందులో వైసీపీ రంగులు కనిపించలేదు. ఇక కర్నూలు జిల్లా శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జుల ఆలయం కూడా దుర్గ గుడి మాదిరిగానే బాగానే ప్రాచుర్యం దక్కిన ఆలయమే. ఇక్కడ కూడా బుధవారం రాత్రి విద్యుద్దీపాలు వెలుగులు విరజిమ్మినా.. జగన్ పార్టీ జెండా రంగులు మాత్రం కనిపించలేదు. ఈ రెండు ఆలయాల్లో కనిపించని విధంగా ఒక్క బెజవాడ దుర్గ గుడి వెలుగుల్లో మాత్రమే వైసీపీ రంగులు కనిపించడంపై ఇప్పుడు పెద్ద రచ్చే జరుగుతోంది. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ సొంత జిల్లా, సొంత నియోజకవర్గం అయిన కారణంగానే దుర్గ గుడిలో వైసీపీ వెలుగులు కనిపించాయా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
Must Read ;- చేతులు జోడించి.. శిరస్సు వంచి..











