నవ్యాంధ్రప్రదేశ్‌కు పోలవరం ప్రాజెక్టు నిజంగానే జీవనాడి కిందే లెక్క. ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దుల్లో పోలవరం గ్రామం సమీపంలో గోదావరి నది మీద నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు గనుక పూర్తి అయితే ఏపీకి సాగు, తాగు నీటి కొరత అన్న మాటే వినబడదు. ప్రాజెక్టు ఉత్తరాంధ్ర పరిధిలోనే ఉన్నా.. ఈ ప్రాజెక్టును సరిగ్గా ప్లాన్ చేసుకుంటూ సాగితే.. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రతో పాటుగా రాయలసీమ జిల్లాలకూ మిగులు జలాలను తరలించుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని జల వనరుల నిపుణులు ఎప్పుడో చెప్పేశారు కూడా. ఏళ్ల నాడు ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు రాగా.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టుకు అనుమతులు సాధించారు. అయితే అనుమతులు లభించిన ప్రాజెక్టును పట్టాలెక్కించే విషయంలో మాత్రం వైఎస్సార్ సఫలం కాలేకపోయారు. ఆ తర్వాత తెలులు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోవడం, ఏపీకి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టడం, పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు పట్టాలెక్కించడం చకచకా జరిగిపోయాయి. రాష్ట్ర విభజనతో అన్ని రకాలుగా నష్టపోయిన ఏపీని ఆదుకునేలా పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తున్నామని, ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులు మొత్తాన్ని తామే భరిస్తామని కూడా కేంద్రం వాగ్దానం చేసింది.
కేంద్రం మాట మార్చినా..
ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమయ్యే నిధులన్నీ తామే ఇస్తామని వాగ్దానం చేసిన కేంద్రం ఆ తర్వాత మాట మార్చేసింది. ప్రాజెక్టు తొలి నాళ్ల అంచనాల మేరకే నిధులు విడుదల చేస్తామని, సవరించిన అంచనాల మేరకు రూ.56 వేల కోట్ల మేర నిధులను విడుదల చేసే ప్రసక్తే లేదని కూడా తేల్చేసింది. అయితే ఈ వ్యవహారంపై కేంద్రంపై చంద్రబాబు సర్కారు రాజీ లేని పోరే సాగించిందని చెప్పాలి. ప్రాజెక్టు తొలినాళ్లలో అంచనా వ్యయం ఊ.16 వేల కోట్లే అయినా.. వివిధ కారణాల వల్ల ప్రాజెక్టు నిర్మాణం మందకోడిగా సాగిందని, దానికి తమ తప్పేమీ లేదని, ఉమ్మడి రాష్ట్రానికి చెందిన చివరి ప్రభుత్వాలే కారణమని, వారు చేసిన తప్పులకు ఇప్పుడు తాము మూల్యం చెల్లించలేమని, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని మొత్తం నిధులను ఇవ్వాల్సిందేనని, సవరించిన అంచనాల మేరకు రూ.56 వేల కోట్లను విడుదల చేయాల్సిందేనని చంద్రబాబు సర్కారు వాదించింది. ఈ వాదనల కోసం చంద్రబాబు సీఎం హోదాలో ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసినంత పనిచేశారు. అయితే కేంద్రాన్ని ఒప్పించేలోగానే చంద్రబాబు సర్కారు దిగిపోవడం, ఆ స్థానంలో జగన్ సర్కారు పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగిపోయింది.
ముఖం మీదే చెప్పేస్తున్నారే
చంద్రబాబు సీఎంగా ఉన్నంత కాలం ఏపీ సమస్యలను కేంద్రం ఒకింత సానుకూల దృక్పథంతోనే పరిగణించేది. ఏపీ సమస్యలను పూర్తిగా తీర్చకున్నా.. దశలవారీగా అయినా ఆయా సమస్యలను పరిష్కరించే యత్నం చేసిందనే చెప్పాలి. అయితే జగన్ సీఎం అయ్యాక ఏపీ సమస్యలపై కేంద్రం తనదైన శైలి దూకుడు వైఖరిని ప్రదర్శిస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు ఆమోదం తెలపలేమని ఇప్పటికే ఖరాకండీగా చెప్పేసిన కేంద్రం.. తాజాగా మరో బాంబు లాంటి వార్తను పేల్చింది. పోలవరం ప్రాజెక్టుకు తామేమీ ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వలేమని, ఈ ప్రాజెక్టు కోసం రూ.20 వేల కోట్లకు మించి సింగిల్ పైసా ఇవ్వలేమని తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెగేసి చెప్పారు. బుధవారం నాడు తనను కలిసిన ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ముఖం మీదే ఆమె ఈ మాట చెప్పేశారు. అంతేకాకుండా పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చారు కదా అని బుగ్గన చెబితే.. జాతీయ హోదా ఇచ్చిన మాట గుర్తుందని, ఇతర రాష్ట్రాల్లోనూ జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టులు ఉన్నాయని, వాటిని మించిన ప్రాధాన్యం పోలవరానికి ఇవ్వలేమని కూడా నిర్మలమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. హోదా మాట అటుంచితే.. కనీసం సవరించిన అంచనాలనైనా ఆమోదించండి అంటే.. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? ఈ ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్లకు మించి సింగిల్ పైసా కూడా ఇచ్చేది లేదని నిర్మలమ్మ తేల్చి పారేశారట. మొత్తంగా జగన్ జమానాలో ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు జీవం లేని నాడిగా మారిపోయిందని, అసలు ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందా? అంటూ ఏపీ జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Must Read ;- బాబు ‘బిల్డింగ్’లనూ తనఖా పెట్టేస్తారా?











