వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన మొదలయ్యాక.. ఏపీకి కొత్తగా పెట్టుబడులు రాలేదు. కొత్త పరిశ్రమ ఏర్పాటు కాలేదు. ఈ పరిస్థితికి మించి అప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చంద్రబాబు సర్కారుతో ఒప్పందం కుదుర్చుకున్న రిలయన్స్, లులూ గ్రూపు లాంటి కంపెనీలు ఏకంగా ఆ ఒప్పందాలను రద్దు చేసుకుని మరీ పరుగు లంకించుకున్నాయి. ఇక రాష్ట్రంలో అప్పటికే కార్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన కియా.. ఏపీలో తన విస్తరణను రద్దు చేసుకుంది. ఈ కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు చెందినవి కాగా.. రాష్ట్రానికే చెందిన అమరరాజా ఏకంగా తన విస్తరణను ఏపీలో రద్దు చేసుకుని పొరుగు రాష్ట్రం తమిళనాడుకు మరలించాలని యత్నించింది. మొత్తంగా కొత్తగా పరిశ్రమల ఏర్పాటు గానీ, కొత్తగా పెట్టుబడుల రాక గానీ.. ఏపీలో వినిపించడం లేదు. కనిపించడం కూడా లేదు. ఇందుకు కారణం పారిశ్రామికవేత్తలపై వైసీపీ నేతలు, ప్రజా ప్రతినిధుల బెదిరింపులే కారణమన్న వాదనలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మంగళవారం విజయవాడలో వాణిజ్య ఉత్సవ్ పేరిట సీఎం జగన్ ప్రారంభించిన సమావేశంలో ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. ఈ దృశ్యం వైరల్ గా మారింది.
కియాకు గోరంట్ల వార్నింగ్ గుర్తుందిగా
చంద్రబాబు హయాంలో అనంతపురం జిల్లాలో కొరియా కార్ల కంపెనీ కియా తన ఉత్పత్తి ప్లాంట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే కియా ఉత్పత్తి ప్రారంభమయ్యేలోగానే 2019 ఎన్నికలు రావడం, టీడీపీ ఓటమిపాలై వైసీపీ విజయం సాధించడంతో చంద్రబాబు స్థానంలో జగన్ ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక కియా ప్లాంట్ ఉన్న హిందూపురం పార్లమెంటు సభ్యుడిగా మాజీ పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ ఎన్నికయ్యారు. చేతికి పదవి దక్కగానే తన నియోజకవర్గ పరిధిలోని కియా వ్యవహారాలను నియంత్రించే దిశగా గోరంట్ల చర్యలు ప్రారంభించారు. ఆ సందర్భంగా తనకు ఎదరు చెప్పిన కియా మోటార్స్ కీలక ప్రతినిధిని గోరంట్ల బెదిరిస్తున్న ఫొటో తెగ వైరల్ అయ్యింది. ఇలా పారిశ్రామికవేత్తలను బెదిరిస్తే.. ఏపీకి కొత్తగా పరిశ్రమలు ఎలా వస్తాయన్న వాదనలు నాడు వినిపించాయి. ఆ వాదనలు నిజమేనన్నట్లుగా జగన్ జమానాలో ఏపీకి కొత్త పరిశ్రమలు రాలేదు. కొత్త పెట్టుబడులు కూడా రాలేదు.
ఇప్పటికీ గోరంట్ల నీడలోనే కియా
ఇదిలా ఉంటే.. తాజాగా మంగళవారం నాడు విజయవాడలో వాణిజ్య ఉత్సవ్ పేరిట సీఎం జగన్ ప్రారంభించిన సమావేశంలోనూ గోరంట్ల కనిపించారు. గోరంట్లతో పాటు గోరంట్ల కనుసన్నల్లోనే కియా సంస్థ ప్రతినిధి డోంగ్ లీ మసలుకున్న వైనం చాలా స్పష్టంగా కనిపించింది. సీఎం హోదాలో జగన్ వాణిజ్య ఉత్సవ్ ప్రారంభోపన్యాసం చేస్తుండగా.. కార్యక్రమానికి వచ్చిన వారిని చూపుతూ కెమెరా అలా రొటేట్ అవుతూ పోయింది. ఈ సందర్భంగా మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ పక్కన డోంగ్ లీ కనిపించారు. ఈ ఇద్దరి పక్కనే గోరంట్ల మాధవ్ కూడా కనిపించారు. విశేషమేమిటంటే.. కార్యక్రమం జరుగుతున్నంత సేపూ డోంగ్ లీని గోరంట్ల ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. అంతేకాకుండా ఎవరో భయపెట్టి కార్యక్రమానికి తీసుకువచ్చినట్లుగా డోంగ్ లీ కనిపించారు. ఇందో ఆసక్తికరమైన అంశమేమిటంటే.. ఈ కార్యక్రమానికి మంత్రులు హాజరైనా ఎంపీలు మాత్రం కనిపించలేదు. కృష్ణా జిల్లాకు చెందిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గానీ, గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గానీ ఈ సమావేశంలో కనిపించలేదు. మిగిలిన ఎంపీలు కూడా ఈ సమావేశానికి రాలేదనే చెప్పాలి. అయితే డోంగ్ లీని బలవంతంగా ఈ సమావేశానికి తీసుకువచ్చినట్లుగా గోరంట్ల మాధవ్ మాత్రం ఈ సమావేశంలో ప్రత్యేకంగా కనిపించారు.
Must Read ;-కార్పొరేట్లు ఏపీకి ఎందుకు రావట్లేదు