ఏపీలో జగన్ సర్కారుకు కోర్టుల్లో పడినన్ని మొట్టికాయలు ఇంకే ప్రభుత్వానికి కూడా పడి ఉండవంటే అతిశయోక్తి కాదేమో. ఏ అంశం తీసుకున్నా.. జగన్ సర్కారు తనదైన శైలి నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయాలపై ఇటు విపక్షాలో, అటు ప్రజలో కోర్టులను ఆశ్రయించడం.. కోర్టులు కూడా ఈ నిర్ణయాలు సరైనవి కావంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం, కోర్టు నిర్ణయాలను కూడా అమలు చేసే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, తిరిగి కోర్టు బోనులో జగన్ సర్కారు తరఫున అధికారులు చేతులు కట్టుకుని నిలబడటం.. జనమంతా చూసిందే కదా. ఇది, అది అన్న తేడా లేకుండా జగన్ సర్కారు తీసుకున్న దాదాపుగా అన్ని నిర్ణయాలపైనా హైకోర్టు మొట్టికాయలు వేసిందనే చెప్పాలి.
పార్టీ రంగులేయబోం
ఇప్పటికే గ్రామ సచివాలయాలతో పాటు కొత్తగా నిర్మించే ప్రభుత్వ కార్యాలయాలకు కూడా వైసీపీ రంగులేసే దిశగా జగన్ సర్కారు సంచలన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టులో పిటిషన్లు పడగా.. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు కుదరవంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలను పాటిస్తామని చెబుతూనే.. ఒకటి, అరా బిల్డింగులకు పార్టీ రంగులు తీసేసి తనదైన మార్కు కళను జగన్ సర్కారు ప్రదర్శించింది. ఒకసారి కోర్టులో ఒప్పుకున్నాక.. ఆ నిర్ణయాన్ని అమలు చేయకపోతే.. ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. అయితే పాలనలో జగన్‌కు అంతగా అనుభవం లేదు కదా. అందుకే కాబోలు కోర్టు ఆదేశాలు పాటించకున్నా ఏమీ కాదులే అన్న భావనతో ముందుకు సాగారు. కోర్టు మరోమారు జగన్ సర్కారును కోర్టుకు పిలిచి కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో బుద్ధి వచ్చిన జగన్ సర్కారు.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు తొలగిస్తామని చెప్పుకొచ్చింది.
చేతులు జోడించక తప్పలేదు
అయితే ఎన్నిసార్లు ఈ విషయంపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా.. జగన్ సర్కారులో ఎలాంటి మార్పు రాలేదనే చెప్పాలి. ఇటీవల జగన్ సర్కారు రాష్ట్రంలో స్వచ్ఛ కార్యక్రమం క్లీన్ ఏపీని ప్రారంభించారు. ఈ సందర్భంగా 4 వేల పైచిలుకు చెత్త సేకరణ వాహనాలకు జగన్ పచ్చజెండా ఊపారు. అయితే ఈ వాహనాలకు కూడా వైసీపీ జెండా రంగులనే వేశారు. దీంతో జై భీమ్ జస్టిస్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. ప్రభుత్వ వాహనాలకు పార్టీ రంగులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో తాజాగా హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. వాహనాలకు పార్టీ రంగులు తొలగిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాదు.. భవిష్యత్తులో ఏ ప్రభుత్వ భవనానికి కూడా పార్టీ రంగులు వేయమంటూ హైకోర్టుకు హామీ ఇచ్చింది. తమకు తెలిసి వచ్చిందని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం తరఫున పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది దాఖలు చేసిన అఫిడవిట్‌లో జగన్ సర్కారు చేతులు కట్టుకున్నంత పనిచేసింది. జగన్ సర్కారు తన ముందు చేతులు కట్టుకుని నిలుచున్నా.. హైకోర్టు మాత్రం ప్రభుత్వాన్ని నమ్మలేకపోయింది. వాహనాలకు పార్టీ రంగులు తొలగించిన తర్వాత మళ్లీ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించడంతో.. చేతులు కట్టుకుని.. శిరస్సు వంచి అన్న రీతిలో సర్దిచెప్పినా జగన్ సర్కారును కోర్టు నమ్మలేకపోయిందన్న సెటైర్లు పడుతున్నాయి.
Must Read ;- ‘ఆత్మ సాక్షి’గా వైసీపీ గల్లంతే!