కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయ పాలనా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి కొత్త పాలక మండలిని ఏర్పాటు జగన్ సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టీటీడీ చైర్మన్ గా తన బాబాయి వైవీ సుబ్బారెడ్డిని వరుసగా రెండో పర్యాయం కూడా నియమించిన జగన్.. పాలక మండలి సభ్యులను మాత్రం బుధవారం ప్రకటించారు. మొత్తం 25 మంది సభ్యులతో కూడిన ఈ పాలక మండలిలో పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కూడా స్థానం కల్పించారు. ఇదిలా ఉంటే.. ఈ 25 మంది సభ్యులతో పాటు మరో 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులను నియమించనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వెరసి టీటీడీ పాలక మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 75కు చేరుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి సంబంధించి మాత్రం ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.
జాబితా ఇదే
టీటీడీ పాలక మండలిలో సభ్యులుగా ఎన్నికైన వారి జాబితా బుధవారం సాయంత్రం విడుదలైంది. ఈ జాబితాలో కల్వకుర్తి విద్యాసాగర్, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, శంకర్, మధుసూదన యాదవ్, గొల్ల బాబురావు, పోలకల అశోక్, మల్లాడి కృష్ణారావు, జీవన్ రెడ్డి, పార్థసారధి రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, శశిధర్, విశ్వనాథ్ రెడ్డి, జూపల్లి రామేశ్వరరావు, రాజేశ్ శర్మ, మోరంశెట్టి రాములు, నందకుమార్, కేతన్ దేశాయ్, మారుతి, జె.శ్రీనివాసన్, కన్నయ్య, లక్ష్మినారాయణ, సౌరభ్, సనత్ ఆడిటర్, మిలింద్, రాజోలు కృష్ణంరాజు సతీమణి ఉన్నారు.
వారు ముగ్గురు.. వీరు ముగ్గురు
తాజాగా ప్రకటించిన జాబితాలో ముగ్గురు మాత్రం గత పాలక మండలిలోనూ సభ్యులుగా ఉన్నారు. వారిలో మైహోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, హెటిరో గ్రూప్ నకు చెందిన పార్థసారధి రెడ్డిలు ఉన్నారు. గత పాలక మండలిలో సభ్యులుగా కొనసాగిన వీరు.. టీటీడీ నిర్వహించిన ప్రతి పాలక మండలి సమావేశానికి హాజరయ్యారట. అంతేకాకుండా మిగిలిన సభ్యులందరి కంటే కూడా వీరు స్వామి వారి సేవకు సంబంధించి విశేష కృషి చేశారట. ఇక ఏపీలోని మూడు ప్రాంతాలకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కూడా బోర్డులో చోటు దక్కింది. రాయలసీమ నుంచి కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోస్తా నుంచి ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన యాదవ్, ఉత్తరాంధ్ర నుంచి విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావులను బోర్డు సభ్యులుగా ఎంపిక చేశారు.
Must Read ;- జగన్, సాయిరెడ్డిలకు ఊరట.. బెయిల్ రద్దు లేదు