ఏపీలో జగన్ పాలన రెండున్నరేళ్లు పూర్తి కావస్తోంది. అంటే.. జగన్ తన ఐదేళ్ల పదవీకాలంలో ఇప్పటికే సగం మేర పాలనను పూర్తి చేసుకుంటున్నారు. ఇంకో రెండున్నరేళ్ల పాటు ఆయన పాలనకు ఎలాంటి ఢోకా లేకున్నా.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగేతే మాత్రం వైసీపీ అధికార పార్టీ హోదాను కోల్పోవడం గ్యారెంటీ. ప్రస్తుతం ఆ పార్టీ టికెట్లపై ఎమ్మెల్యేలుగా గెలిచిన 151 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా 46 మంది ఓడిపోవడం ఖాయం. వీరిలో 11 మంది మంత్రులు కూడా ఉన్నారు. ఇక ఆ పార్టీ టికెట్లపై ఎంపీలుగా గెలిచిన 23 మందిలో ఇప్పటికే రఘురామకృష్ణరాజును పక్కనపెడితే.. మిగిలిన 22 మందిలో ఏకంగా 7 మంది ఏం చేసినా కూడా తిరిగి గెలవరు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే పరిస్థితి అయితే లేదు గానీ.. ఇదే తరహాలో జగన్ పాలన సాగించినా.. ఓడిపోయే ఛాన్సున్న 46 మంది ఎమ్మెల్యేలు, 7 మంది ఎంపీలు తమ పనితరును మెరుగుపరచుకోకున్నా.. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం తప్పదు. ఇదేదో వైసీపీ ప్రత్యర్థి పార్టీలో, లేదంటే స్వయంగా వైసీపీనో చేయించుకున్న సర్వే చెప్పిన మాట కాదు. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలుగా పేరుగాంచిన ఐఐటీల్లో విద్యనభ్యసించిన నిపుణుల ఆధ్వర్యంలో జరిగిన సర్వే చెప్పిన మాట ఇది. ఆత్మ సాక్షి అనే ఓ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ సర్వే ఫలితాలు వైసీపీలో పెను కలవరాన్నే రేపుతున్నాయి.
ఆ మంత్రులు, ఎంపీలెవరంటే..?
ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రి పదవుల్లో కొనసాగుతూ.. ప్రజలు ఆశించిన మేరకు పని చేయలేక చతికిలపడుతూ ఓటమి అంచుల్లో పయనిస్తున్న మంత్రులు ఏకంగా 11 మంది ఉంటే.. వారిలో ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. వారిలో హోం మంత్రిగా కొనసాగుతున్న మేకతోటి సుచరిత, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌లున్నారు. ఇక ఈ జాబితాలో ఉన్న మిగిలిన మంత్రుల విషయానికి వస్తే.. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఆర్అండ్‌బీ శాఖ మంత్రి శంకరనారాయణ, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌లున్నారు. మంత్రులుగా వీరు ఏ మేర పనితీరు కనబరుస్తున్నారో తెలియదు గానీ.. ఎమ్మెల్యేలుగా మాత్రం 27 శాతం మేర పరితీరుతో జనానికి దూరమైపోయారు. ఇక ఓటమి దిశగా సాగుతున్న ఎంపీల్లో బెల్లాన చంద్రశేఖర్(విజయనగరం), ఎంవీవీ సత్యనారాయణ(విశాఖపట్నం), మార్గాని భరత్ రామ్(రాజమహేంద్రవరం), రఘురామకృష్ణరాజు(నరసాపురం), నందిగం సురేశ్(బాపట్ల), గోరంట్ల మాధవ్(హిందూపురం), చింతా అనురాధ(అమలాపురం), సంజీవ్ కుమార్(కర్నూలు)లు ప్రజలను తమ పనితీరుతో మెప్పించలేకపోతున్నారు. ఈ జాబితాలో జగన్ సర్కారు నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైసీపీ సర్కారుకు పక్కలో బల్లెంలా మారిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా ఉండటం గమనార్హం.
గెలుపు టీడీపీదే
ఇదిలా ఉంటే.. 2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లలో ఏంకగా 151 సీట్లను కైవసం చేసుకున్న వైసీపీ మొత్తం ఓట్లలో దాదాపుగా 50 శాతం ఓట్లను తన ఖాతాలో వేసుకుంది. 23 సీట్లకే పరిమితమైనప్పటికీ విపక్ష టీడీపీకి 40 శాతం మేర ఓట్లు వచ్చాయి. అంటే.. ఈ రెండు పార్టీల మధ్య ఓట్లలో 10 శాతం తేడా ఉంది. అయితే జగన్ రెండున్నరేళ్ల పాలన ముగుస్తున్న సమయానికి వైసీపీ నుంచి 3.5 శాతం ఓటర్లు దూరయ్యారు. వీరంతా విపక్ష టీడీపీ వైపు మళ్లారు. వెరసి ఇప్పుడు టీడీపీకి దక్కే ఓట్ల శాతం 43.5 శాతానికి పెరిగింది. వైసీపీ ఓట్ల శాతం 46.5 శాతానికి పడిపోయింది. అంటే.. ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా కేవలం 3 శాతమే. అయితే 4.75 శాతం మంది ఓటర్లు ఎవరి పక్షం వహించాలన్న విషయంపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదట. జగన్ పాలనపై ఇప్పటికే జనాల్లో బాగానే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో తటస్థంగా ఉన్న ఈ 4.75 శాతం ఓటర్లు టీడీపీ వైపునకు తిరిగే ఛాన్సులే ఎక్కువ. అదే జరిగితే.. టీడీపీకి పడే ఓట్ల శాతం 48.25 శాతానికి చేరుతుంది. అప్పుడు వైసీపీ కంటే కూడా 2 శాతం మేర ఓట్లను అధికంగా సాధించనున్న టీడీపీ అధికారం చేజిక్కించుకుంటుంది. అంటే.. ఆత్మ సాక్షి సర్వే అంతిమంగా చెప్పేదేంటంటే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి పరాభవం ఎదురు కానుండగా.. ఐదేళ్లలోనే టీడీపీ తిరిగి అధికారం చేజిక్కించుకుంటుందన్న మాట.
Must Read ;- బద్వేల్ బైపోల్‌లో విక్టరీ టీడీపీదేనా?