ఏపీ రాజధానిగా అందరికీ సమదూరంలో చంద్రబాబు సర్కారు ఎంపిక చేసిన అమరావతిలో ఇప్పుడు అభివృద్ధి పడకేసింది. ఎన్నికలు అయ్యేదాకా అమరావతిని కదల్చబోనని ప్రకటనలు గుప్పించిన జగన్.. తాను సీఎంగా పదవీ ప్రమాణం చేశాక.. మాట మార్చేశారు. అమరావతిని కేవలం శాసన రాజధానికి మాత్రమే పరిమితం చేసి పాలనా రాజధానిగా విశాఖను, న్యాయ రాజధానిగా కర్నూలును అభివృద్ధి చేస్తామంటూ మూడు రాజదానుల పాటను అందుకున్నారు. ఫలితంగా చంద్రబాబు సర్కారు ఎంపిక చేసిన అమరావతిని పునాదిలోనే నిలిపేసి.. రాజధాని కోసం బంగారం పండే భూములను త్యాగం చేసిన అమరావతి రైతులను దగా చేసేందుకే కంకణం కట్టుకున్నారు. జగన్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు నాన్ స్టాప్ ఉద్యమాలకు తెర తీశారు. ఇప్పటికే 600 రోజుల ఉద్యమాన్ని దాటేసిన రైతులు.. ఇంకా అక్కడ నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఈ ఉద్యమాలను చూసీ చూడనట్లుగానే వ్యవహరిస్తున్న జగన్.. పాలనా రాజధానిని విశాఖకు తరలించే దిశగా సాగుతున్నారు. అయితే అంతలోనే ఏం జరిగిందో తెలియదు గానీ.. రాజధాని అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం ప్రతిపాదించిన గృహ సముదాయాన్ని పూర్తి చేయాలని జగన్ సర్కారు తాజాగా నిర్ణయించింది. ఇదే విషయాన్ని ఏఎంఆర్డీఏకు అప్పగించారు. దీని వెనుక పెద్ద కుట్రే ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
30 శాతం నిర్మాణాలు పూర్తి
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ గృహ సముదాయం పనులను చంద్రబాబు సర్కారు హయాంలోనే మొదలుపెట్టారు. చంద్రబాబు సీఎంగా ఉండగా ఈ భవన నిర్మాణాలతో పాటుగా ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వెంట్ల కోసం నిర్దేశించిన భవనాల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇతర ఉద్యోగులకు కూడా గృహ సముదాయాల కోసం స్థలం ఎంపిక, నిర్మాణాలు కూడా మొదలైపోయాయి. ఈ నిర్మాణాలన్నీ ఇప్పటికే 30 శాతం మేర పూర్తి అయ్యాయి. అయితే ఈ నిర్మాణాలు పూర్తి కాకుండానే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగా.. వైసీపీ అధికారం చేపట్టింది. ఆ వెంటనే జగన్ సీఎం అయ్యారు. జగన్ సీఎం అయ్యాక రాజధాని పరిధిలోని దాదాపుగా అన్ని నిర్మాణ పనులు పడకేశాయి. సగం పూర్తి అయిన రోడ్ల పనులు కూడా స్తంభించాయి. జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చాక.. అన్ని పనులు నిలిచిపోయాయి. రాజధానిని విశాఖకు తరలిస్తున్న నేపథ్యంలో అమరావతిలో అభివృద్ధి పనులు ఎందుకు అన్న భావనతోనే జగన్ ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఫీలర్లు కూడా వదిలారు. మొత్తంగా అమరావతి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
పనుల పునఃప్రారంభానికి రీజనిదేనా?
జగన్ సీఎం అయిన దగ్గర నుంచి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను ప్రకటించారు. భారీ మొత్తంలో నిధులను ఖర్చు చేస్తున్నారు. ఉద్యోగుల జీతాలపై దృష్టి పెట్టని జగన్.. సంక్షేమ పథకాల కోసం అప్పులు చేస్తున్నారు. ఈ క్రమంలో అన్ని రకాల పరిమితులను దాటేసిన జగన్.. కొత్తగా అప్పులు ఎక్కడ పుడతాయన్న దిశగా మార్గాలను వెతుకుతున్నారు. ఇందుకోసం ఎస్బీఐ చైర్మన్ గా పనిచేసిన రజనీష్ కుమార్ ను సలహాదారుగా నియమించుకున్నారు. ఆ తర్వాతే జగన్ పలు కొత్త నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల గృహ సముదాయ పనులను శరవేగంగా పూర్తి చేయాలని కూడా భావిస్తున్నారు. భవన నిర్మాణం పూర్తయ్యే దాకా వేచి చూసి.. ఆ వెంటనే ఆ భవనాలన్నింటినీ బ్యాంకుల వద్ద ఆ భవనాలను తాకట్టు పెట్టి కొత్తగా అప్పులు చేసే అవకాశం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవలే విశాఖలోని ఓ ప్రభుత్వ ఆస్తిని కుదువ పెట్టేసిన జగన్ సర్కారు బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ రుణం తీసుకున్న తర్వాతే.. ఎలాగూ 30 శాతం మేర పూర్తి అయిన అమరావతిలోని నిర్మాణాలను ఎలాగోలా పూర్తి చేసి ఆ భవనాలను బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టి కొత్త రుణం తీసుకునే దిశగానే జగన్ అడుగులు వేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే. బాబు కట్టిన బిల్డింగులను కూడా జగన్ అప్పుల కోసం తనఖా పెట్టినట్టే కదా.
Must Read ;- 23 ఏళ్ల నాటి బాబు శ్రమ.. ఇప్పుడో మధుర జ్ఞాపకంగా