బెజవాడ పాలిటిక్స్‌లో వంగవీటి కుటుంబానికో ప్రత్యేక గుర్తింపు ఉంది. వంగీవీటి మోహనరంగా తనదైన శైలిలో సత్తా చాటితే.. ఆయన వారసుడిగా రంగప్రవేశం చేసిన ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ మాత్రం రాజకీయంగా ఇప్పటిదాకా పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. ఓ వైపు బెజవాడలో భారీ అనుచర గణం, కృష్ణా జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో తనకంటూ ఓ ప్రత్యేక వర్గం.. ఇక కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో ఆయన చిటికేస్తే వేలాదిగా తరలివచ్చే కాపులు ఉన్నా.. ఎందుకో గానీ రాధా సక్సెస్ ఫుల్ నేతగా రాణించలేకపోతున్నారు. దీనికి ఎప్పటికప్పుడు ఆయన వేస్తున్న తప్పటడుగులే కారణమని చెప్పక తప్పదు. ఇప్పటికే పలుమార్లు రాంగ్ స్టెప్స్ వేసిన రాధా.. ఇప్పుడు కొత్త అడుగు దిశగా సాగుతున్న ఆయన పయనం కూడా ఆయనకు కలిసి రాదన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. రెండు రోజుల క్రితం తన బెస్ట్ ఫ్రెండ్, మంత్రి కొడాలి నానితో కలిసి కనిపించిన ఆయన ఈ కొత్త తరహా చర్చలకు తెర తీశారని చెప్పాలి.
సింగిల్ టైమ్ ఎమ్మెల్యే..
వంగవీటి మోహన రంగా మృతి తర్వాత ఆయన సతీమణి రత్నకుమారి ఓ దఫా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వంగవీటి రాధాకృష్ణ 2004 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పేరిట పార్టీ పెడితే.. దానిలో చేరిపోయారు. ఆ పార్టీ టికెట్ మీదే ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన రాధా ఓటమిపాలయ్యారు. బెజవాడలో ప్రజారాజ్యం తరఫున ప్రస్తుత మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచినా.. రాధా మాత్రం గెలవలేకపోయారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం కాగా.. రాధా మాత్రం కాంగ్రెస్ నుంచి వేరుపడి వైఎస్సార్సీపీ పేరిట కొత్త పార్టీ పెట్టుకున్న జగన్ వెంట నడిచారు. ఈ క్రమంలో 2014లో విజయవాడ తూర్పు నుంచే బరిలోకి దిగినా.. టీడీపీ చేతిలో ఓడిపోయారు. అయితే 2019 ఎన్నికలకు వచ్చేసరికి తనకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కావాలని పట్టుబట్టిన రాధా.. జగన్ ఒప్పుకోకపోవడంతో ఏకంగా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. టికెట్ ఇవ్వకున్నా ఫరవా లేదంటూ టీడీపీలో చేరిపోయారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలు కావడంతో రాధాకు ఏం చేయాలో పాలుపోలేదు.
మళ్లీ వైసీపీలో చేరతారా?
ఇలాంటి నేపథ్యంలో రెండు రోజుల క్రితం మంత్రి కొడాలి నాని ప్రాతినిథ్యం వహిస్తున్న గుడివాడ వెళ్లిన రాధా.. నానితో కలిసి చాలా సేపు భేటీ అయ్యారు. దాదాపుగా రెండు గంటలకు పైగా సాగిన ఈ భేటీలో రంగా, నానిలు ఏం చర్చించుకున్నారో గానీ.. రాధా మళ్లీ వైసీపీ వైపు చూస్తున్నారని, త్వరలోనే ఆయన వైసీపీలో చేరబోతున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలను ఇటు రాధా గానీ, అటు నాని గానీ ఖండించలేదు. అప్పటిదాకా తరచూ గుడివాడ వెళ్లి వస్తున్న రాధా.. ఎప్పుడూ నానిని కలిసిన దాఖలా లేదు. పార్టీలకు అతీతంగా నాని, రాధా, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌లు స్నేహితులుగా సాగుతున్న వైనం తెలిసిందే. మొన్నటిదాకా నాని ఒక్కరే వైసీపీలో ఉండగా.. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వల్లభనేని కూడా ఇప్పుడు వైసీపీలో చేరిపోయారు. వెరసి ఈ మిత్రత్రయంలో ఇద్దరు వైసీపీలో ఉంటే.. ఒక్క రాధా మాత్రమే టీడీపీలో ఉన్నారు. అయితే వైసీపీ గ్రాఫ్ అంతకంతకూ పెరుగుతోందని, ఇకనైనా తిరిగి వైసీపీలోకి వస్తే రాజకీయ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని రాధాకు నాని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ మాటలకు రాధా కూడా మెత్తబడినట్టే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే వీరిద్దరూ భేటీ అయినట్టు కూడా సమాచారం. అయితే ఇప్పుడు నాని చెప్పినట్టుగా రాధా తిరిగి వైసీపీలోకి వచ్చినా.. ఆయన పోటి చేసేందుకు ఏ ఒక్క నియోజకవర్గం కూడా ఖాళీ లేదు. గతంలో రాధా పోటీ చేసిన విజయవాడ తూర్పు గానీ, విజయవాడ సెంట్రల్ గానీ ఇప్పుడు ఖాళీగా లేవు. గన్నవరం నుంచి బరిలోకి దిగుదామనుకుంటే.. అక్కడ ఆయన మిత్రుడు వల్లభనేనే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో వైసీపీలోకి వస్తే ఈ దఫా కూడా రాధాకు టికెట్ కూడా దక్కదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో వైసీపీకి రీ ఎంట్రీ ఇస్తే.. రాధా మరోమారు తప్పడుగు వేసినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- వైసీపీది ద్వంద్వ వైఖరే.. ఇదిగో నిదర్శనం











