రాష్ట్రంలో జరుగుతున్న అనేకానేక సంఘటనల నేపథ్యంలో.. పోలీసు యంత్రాంగం యావత్తూ అధికార పార్టీ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారని, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఏం చెబితే అది చేస్తున్నారనే ఆరోపణలు ఈ రెండున్నరేళ్లలో అనేకం వినిపిస్తున్నాయి. కేవలం ప్రతిపక్షం ఆరోపించడం మాత్రమే కాదు.. తటస్థులు, సామాన్యులు కూడా.. పోలీసుల పనితీరుపై అధికార పార్టీ కార్యకర్తల్లాగానే మాట అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఎవరూ ఏం చెప్పకుండానే.. యావత్ పోలీసు వ్యవస్థ మీద అధికార పార్టీ రంగు పడిందనే అనుకోవాలి. అది చాలదన్నట్లుగా పోలీసు వాహనాలకు కూడా అధికార పార్టీ రంగులను ‘అధికారికంగా’ స్టిక్కర్లుగా అంటించేసి.. ప్రభుత్వం చిత్రంగా వ్యవహరిస్తోంది.
‘రంగు పిచ్చి’కి పరాకాష్ట
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఎంతగా ‘రంగు పిచ్చి’ ఉన్నదోననడానికి ఇది పరాకాష్ట. ఇప్పటికే పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులు పూయించి.. ప్రభుత్వం ఎంతగా విమర్శల పాలైందో అందరికీ తెలుసు. ఆ విషయం కోర్టుకు వెళ్లి, ఉత్తర్వులు వచ్చిన తర్వాత.. కూడా మళ్లీ పార్టీ రంగులనే తలపించేలా కొత్త రంగులు వేయించి మరోసారి అభాసుపాలయ్యారు. చివరికి సుప్రీం కోర్టు తీర్పుతో కార్యాలయాల రంగులు మార్పించాల్సి వచ్చింది. ఇలా రంగుల విషయంలో న్యాయస్థానాలు మొట్టికాయలు వేసినా సరే ప్రభుత్వానికి బుద్ధి వచ్చినట్లుగా కనిపించడం లేదు.
పోలీసు వాహనాలకే పార్టీ రంగులు
అదే బుద్ధులను మరోసారి నిరూపించుకుంటూ ఈసారి ఏకంగా పోలీసు వాహనాలకే పార్టీ రంగులు పులిమారు. రాష్ట్రంలో ఆడపడచుల రక్షణ కోసం అన్నట్లుగా ప్రభుత్వం దిశ చట్టాన్ని తెచ్చింది. ప్రత్యేక పోలీసు స్టేషన్లను కూడా ఏర్పాటు చేశారు. ‘మహిళల రక్షణ’ అనేది అనేక సాంకేతిక కారణాల కారణంగా.. చట్టం రూపంలోకి తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న అనేక సందేహాలను నివృత్తి చేయడంలోనూ విఫలమైంది. దాంతో అది చట్టం రూపం దాల్చలేదు. అయితే దిశ పోలీసు సిబ్బంది మాత్రం మహిళల రక్షణ కోసం విధులు నిర్వహిస్తూనే ఉన్నారు. వీరి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ద్విచక్ర వాహనాలను కేటాయించింది. ఆ వాహనాలకు మాత్రం.. పార్టీ రంగులు పులిమారు.
Must Read ;- జగనోరి జమానాలో దేనికైనా రంగు పడాల్సిందే!
దిశ పోలీసు వాహనాన్ని చూస్తే..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలో ఉండేలా.. నీలం, ఆకుపచ్చ రంగుల స్టిక్కర్లను పోలీసు వాహనాలకు వేయించారు. దీంతో పార్టీ కార్యకర్తలు ఎలాంటి రంగుల స్టిక్కర్లను తమ వాహనాలకు అంటించుకుని తిరుగుతారో.. పోలీసు వాహనాలు కూడా అచ్చంగా అదే తీరుగా తయారయ్యాయి. దిశ పోలీసు వాహనాన్ని చూస్తేనే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను చూసినట్లుగా ఉంటోంది. వైసీపీ జెండా నీడలో మాత్రమే మహిళలకు రక్షణ దొరుకుతుందనే భావన ప్రజల్లో వ్యాపింప జేయదలచుకున్నారో లేదా వైసీపీకి చెందిన వాళ్లు తప్ప మరొక మహిళ తనకు అన్యాయం జరిగినా సరే.. దిశ పోలీసులను సంప్రదించడానికి వెనకాడాలనే ఉద్దేశంతో ఇలాంటి రంగులు పులిమారో అర్థం కావడం లేదు గానీ.. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్న వైసీపీ రంగుల పిచ్చి పలు రకాలుగా విమర్శలకు గురవుతోంది.
పోలీసు స్కూటర్లకు పార్టీ రంగులు వేయడం.. చాలాకాలం కిందట కూడా వివాదంగా మారింది. అప్పట్లో గుంటూరు జిల్లాలో ఇలాంటి రంగులు వేసి వివాదానికి శ్రీకారం చుట్టారు. తాజాగా విశాఖ కలెక్టరేట్‌లో కూడా విధులకు వచ్చిన పోలీసులు ఇలాంటి వైసీపీ రంగుల వాహనాలను వాడడం మరోమారు అదే వివాదాన్ని రేకెత్తించినట్టయింది.
ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే..
పంచాయతీ కార్యాలయాలకు పులిమిన రంగులే పెద్ద వివాదంగా మారగా, ప్రభుత్వం కోర్టు తీర్పుతో వెనక్కు తగ్గింది. అధికారంలో ఉన్న వారికి కూడా భయపడకుండా, నిష్పాక్షికంగా విధులు నిర్వర్తించాల్సిన పోలీసు సిబ్బందికి ఇచ్చే వాహనాలకే పార్టీ రంగులు పులమడం ఇంకా పెద్ద వివాదంగా మారనుంది. ఈ విషయంలో కూడా ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే గనుక.. ప్రభుత్వానికి మరోసారి ఎదురు దెబ్బ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పంచాయతీ ఆఫీసులకు రంగుల విషయంలో పంతానికి పోయి.. వందల కోట్ల రూపాయలను వృథా చేసిన సర్కారు, ఈ దిశ పోలీసు వాహనాల రంగుల రూపేణా మరెంత ప్రజాధనం తగలేస్తుందోననే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది.
Must Read ;- ఎక్కడ నుంచైనా సీఎం పాలన.. ఇదే సూత్రంతో విశాఖలో అన్ని ఏర్పాట్లు