రాజధానిని కాపాడుకోవడం మా బాధ్యత!
రాజధానిని కాపాడుకోవడంలో మా బాధ్యత కూడా ఉందని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించాడు. మొన్న తిరుపతిలో బీజేపీ బాస్ అమిత్ షా భేటీ అనంతరం ఏపీ బీజేపీలో ఒక రేంజ్లో కదలికలొచ్చాయి. అమిత్ షాను విమానం ఎక్కించి రాష్ట్ర కార్యవర్గం విజయవాడలో వచ్చి కూర్చున్నారు. ‘వాట్ డూ .. వాట్ నాట్ డూ’.. అంటూ చర్చలు జరిపారు. ఏపీ రాజధానిని కాపాడుకోవడంలో భూములిచ్చిన రైతులకు ఎన్ని హక్కులున్నాయో .. ప్రజా రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన బీజేపీ చీఫ్, ప్రధాని మోదీ తరుఫున మనకు అంతే బాధ్యత ఉంటుందని గుర్తుచేసుకున్నారు.
తలంటుతోనే తలిచారా?
తిరుపతి వేదికగా అమిత్ షా సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆ సమావేశం అనంతరం బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశం అయ్యింది. ఈ సమావేశానికి జాతీయ కార్యవర్గంలోని ఏపీ సభ్యులు, రాష్ట్రాధ్యక్షుడు సోము తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ సమావేశం అంతా హాట్ హాట్ గా జరిగిందని వార్తలు బయటకు వచ్చాయి. సమావేశంలో అమిత్ షా పేరుపేరునా తలంటారంటా! దానితోనే తత్వం బోధపడి పాదయాత్రలో పాత్రపై తలిచారని తెలుస్తోంది. అయితే రాజధాని అంశంపై బీజేపీ రెండు పడవులపై సవారిలా ఉన్నా.. మోదీ శంకు స్థాపన చేసిన రాజధాని ఇలా కళ్ళముందే రాజకీయం చెలగాటంలో కూలుతుందేమోనన్న భయం వారి మదిలో ఏ మూలనో ఉండే ఉంది. అందుకే పూర్వ అధ్యక్షడు కన్నా రాజధానికి మేం అనుకూలం అని తీర్మానం చేశారు. అలానే గత ఏడాది డిసెంబర్ 17న చంద్రబాబు అధ్యక్షత రాజధాని అమరావతి ప్రాంతంలోని రాయపూడిలో నిర్వహించిన జనభేరి యాత్రకు పూర్తి మద్దతును కూడా బీజేపీ ప్రకటించి, వేదికను పంచుకున్నారు.
పాదయాత్ర మద్దతు, ఉద్యమ కార్యచరణకు ప్రణాళికలు!
రైతులు నిర్వహిస్తున్న మహా పాదయాత్రకు బీజేపీ మద్దతు తెలపడంతోపాటు నెల్లూరు, చిత్తూరు జిల్లాలో జరిగే పాదయాత్రలో రైతులను కలిసి సంఘీభావం తెలిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అలానే జనసేనాని కలుపుకుని ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఉద్యమ కార్యచరణ వ్యూహాన్ని కూడా బీజేపీ రచిస్తున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు మరిన్ని అంశాలను చర్చించేందుకు ఈ నెల 26 న విజయవాడ కేంద్రంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కార్యవర్గం సమావేశం నిర్వహించబోతున్నట్లు పార్టీ ప్రకటించింది. దీనిబట్టి చూస్తే .. ఏపీ ప్రభుత్వంపై స్టేట్ బీజేపీ పోరాడేందుకు కేంద్రం పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో అమరావతి రాజధాని, ఎయిడెడ్ విలీనం, ఆర్థిక సమస్యలు, చేస్తున్న అప్పులు, ఉద్యోగుల పీఆర్సీ, ఉద్యోగ నోటిఫికేషన్లు వంటి అనేక విషయాలపై పోరాడేందుకు బీజేపీ కార్యచరణ ప్రకటించబోతున్నట్లు సమాచారం.











