సినిమా ప్రపంచంలో ఆస్కార్ అవార్డుకు ఉన్న క్రేజే వేరు. ఎన్నో సినిమాలు ఈ అవార్డుకు నామినేట్ అవుతుంటాయి కానీ చివరికి కొందరినే ఈ అవార్డు వరిస్తూ ఉంటుంది.
ఆస్కార్ అవార్డు సాధించడం అనేది ప్రపంచ సినిమా ప్రేమికులకు ఓ కల. ఆ సినిమాలో ఎంతో కళ ఉంటేనేగానీ ఆ కల నెరవేరదు. ముఖ్యంగా మన భారతీయ సినిమా అలాంటి అవార్డు దక్కించుకుంటే జన్మ ధన్యమైనట్లే కదా. ప్రపంచ చిత్ర పటంలో భారతీయ సినిమాకు కూడా ఎంతో ప్రత్యేకత ఉంది. ఆస్కార్ బరిలోకి దిగి అంతర్జాతీయ సినిమాని సైతం వణికించిన భారతీయ చిత్రాలు ఎన్నో ఉన్నాయి.
94 అకాడమీ అవార్డుల సంరంభానికి తెరలేచింది. ఈసారి మన దేశం నుంచి కూడా జైభీమ్, మరక్కార్ లాంటి చిత్రాలు నామినేట్ అయ్యాయి. దాదాపు 276 చిత్రాలు బరిలో నిలిచాయి. నామినేషన్లపై ఓటింగ్ ఈ నెల 27 నుంచి ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 1 వరకూ ఇది కొనసాగుతుంది. ఈ నామినేషన్ల వివరాలను ఫిబ్రవరి 8న ప్రకటిస్తారు. మార్చి 27న హాలీవుడ్ అండ్ హైలాండ్ లోని డాల్బీ థియేటర్ లో విజేతల వివరాలు వెల్లడవుతాయి.
ఏదీ మన భారతీయత?
ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మొట్టమొదటిసారిగా మే 16, 1929లో హాలీవుడ్ లోని హోటల్ రూజ్వెల్ట్ లో జరిగింది. 1958 వరకూ మన భారతీయ సినిమా ఆ ఛాయలకు వెళ్లిన దాఖలాలు లేవు. ఆ ఏడాది మదర్ ఇండియా చిత్రం ఆస్కార్ కు నామినేట్ అయి అంతర్జాతీయ చిత్రాలతో పోటీపడింది. కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో ఇటాలియన్ చిత్రం నైట్స్ ఆఫ్ కబ్రియా ఈ అవార్డును కొట్టుకుపోయింది. ఇక 1983లో గాంధీ చిత్రానికి గాను కాస్ట్యూమ్ డిజైనర్ భాను అథైయా గోల్డెన్ ట్రోఫీ లభించింది.
ఆ తర్వాత 1992లో సత్యజిత్ రే కు గౌరవ పురస్కారం ఆస్కార్ నుంచి లభించింది. ఈ గౌరవం దక్కిన తొలి భారతీయుడు ఆయనే అని చెప్పవచ్చు. 2008లో మన ఘనత స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రంతో నిరూపితమైంది. ఈ సినిమా భారతీయ కథాంశంతో రూపొందింది. కాకపోతే దీన్నిబ్రిటీష్ నిర్మాణ సంస్థ నిర్మించింది. ఈ సినిమాకి 8 అవార్డులు దక్కాయి. వాటిలో రెండు అవార్డులు మన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కు దక్కాయి. ఎక్కువ అవార్డులు అందుకున్న తొలి భారతీయుడిగా రెహమాన్ ని చెప్పాలి.
మదర్ ఇండియా తర్వాత లగాన్, సలామ్ బాంబే చిత్రాలు ఆస్కార్ కు నామినేట్ అయినా ఫలితం దక్కలేదు. గత ఏడాది వైట్ టైగర్ చిత్రానికి బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగంలో నామినేషన్ లభించింది. ఈసారి జైభీమ్, మరక్కార్ చిత్రాలకు నామినేషన్ లభించింది. చివరికి షార్ట్ లిస్టులో చోటు మాత్రం దక్కలేదు. అసలు దక్షిణాది చిత్రాలు ఈ స్థాయికి వెళ్లడమే గొప్పవిషయం.
టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన జైభీమ్ కు ఇప్పటికే ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా నోయిడా ఫిల్మ్ ఫేర్ పెస్టివల్‍కు కూడా ఎంపికైంది. ఆస్కార్ మీద ఆశలు ఉన్నా ప్రపంచ స్థాయి కళాఖండాల మధ్య నిలుస్తుందా అన్న అనుమానాలు ఉన్నాయి. ఆ ప్రకారం షార్ట్ లిస్టులో చూస్తే జైభీమ్ లేదు. కాకపోతే ఆస్కార్ అధికారిక యూట్యూబ్ ఛానెల్ లో మాత్రం ఈ సినిమా ప్రదర్శిత మవుతుంది.











