పాతతరం నుంచి నేటి తరం వరకు హాస్య నటులెందరో హీరోలుగా కూడా సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఆ కోవలో షకలక శంకర్ కి ప్రమోషన్ లభించి, హీరోగా కూడా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే డ్రైవర్ రాముడు, నేనే కేడీ నెంబర్ 1, 3 మంకీస్ వంటి సినిమాలు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. తాజాగా ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కార్పొరేటర్’. దీని ద్వారా సంజయ్ పూనూరి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఎ.పద్మనాభరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు పాటల చిత్రీకరణ మినహా పూర్తయింది.
కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో సాగే ఇతివృత్తంతో మలుస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ చిత్రాల మాదిరిగానే ఉంటుందని దర్శకుడు సంజయ్ తెలిపారు. వినోదానికి పెద్దపీట వేయడంతోపాటు ఓ మంచి సందేశాన్ని కూడా మిళితం చేశామని ఆయన వెల్లడించారు. షకలక శంకర్ నటన చిత్రానికి ఆయువు పట్టుగా నిలుస్తుందని చెప్పారు..ఇందులో ఐదు పాటలతో పాటు నాలుగు ఫైట్స్ కూడా ఉన్నాయని అన్నారు.
శంకర్ సరసన అందాల భామలు సునీత పాండే, లావణ్య శర్మ, కస్తూరి హీరోయిన్లుగా కనువిందు చేయనున్నారు. ఈ చిత్రానికి సినెమాటోగ్రఫీని జగదీష్ కొమరి, సంగీతాన్ని ఎం.ఎల్.పి.రాజా, ఎడిటింగ్ ను శర్వాణి అందిస్తున్నారు. సహ నిర్మాత: డాక్టర్ ఎస్.వి.మాధురి, నిర్మాత: ఎ.పద్మనాభరెడ్డి, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: సంజయ్ పూనూరి.











