ఏసీ అసెంబ్లీ సమావేశాల్లో పుట్టాల్సిన వేడి, బీఏసీలోనే ప్రారంభమైంది. సీఎం జగన్మోహన్ రెడ్డి టీడీపీ నేత అచ్చెన్నాయుడుపై సెటైర్లు వేశారు. ద గ్రేట్ అచ్చెన్నాయుడు ధర్నా చేస్తున్నారని, ఆయన రావడానికి ఆలస్యం అవుతుందనే బీఏసీ సమావేశం ఆలస్యంగా నిర్వహించామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. అసెంబ్లీ సమావేశాలు కనీసం పది రోజులు జరపాలని టీడీపీ నేత అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. దీనికి సభా వ్యవహారాల మంత్రి కలుగజేసుకుని ఏపీలో కరోనా ఎక్కువగా ఉందని, సభలో 70 సంవత్సరాలు దాటిని సభ్యులు కూడా ఉన్నారని పరోక్షంగా చంద్రబాబునాయుడు వయసును గుర్తు చేశారు.
కరోనా వల్ల అధికారులు కూడా భయపడుతున్నారని బీఏసీకి హాజరైన మంత్రులు కన్నబాబు, అనిల్ యాదవ్ గుర్తుచేశారు. అధికార పార్టీ నేతల ర్యాలీలకు కరోనా నిబంధలు వర్తించవా అని అచ్చెన్న గట్టిగా నిలదీశారని తెలుస్తోంది. కరోనాకు భయపడే చంద్రబాబు ఏపీకి రావడం లేదని మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ ఎక్కడున్నారో అందరికీ తెలుసని అచ్చెన్నాయుడు గట్టిగా సమాధానం ఇచ్చారు.
మమ్మల్ని టీవీల్లో చూపించడం లేదన్న అచ్చెన్నాయుడు బీఏసీలో వ్యాఖ్యానించారు. దీనికి బదులుగా ఆరడుగుల ఆజానుభావుడివి నీవు కనిపించకపోవడం ఏంటని సీఎం జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేశారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులపై చర్చించాలని అచ్చెన్నాయుడు బీఏసీలో కోరగా, తన ఎంపీ నందిగం సురేష్ పై జరిగిన దాడి గురించేనా అని సీఎం కౌంటర్ ఇచ్చారు. దీంతో బీఏసీ సమావేశంలో మంత్రులకు, అచ్చెన్నాయుడికి మధ్య గట్టిగా మాటల యుద్ధం జరిగింది. అచ్చెన్నాయుడు వేసిన ప్రతిప్రశ్నకు వైసీపీ నేతలు సెటైర్లు వేశారు.











