(ఉత్తరాంధ్ర లియో న్యూస్ ప్రతినిధి)
ఇదో ప్రేమ కథ..కల్పితం కాదు… సినిమా కథ కానే కాదు… కానీ,అంతకు మించి ట్విస్టులు ఉన్నాయి.ప్రేమించిన యువతి కోసం పాదయాత్రగా దేశాలు దాటే సాహసానికి ఒడిగట్టిన రియల్ స్టోరీ.వీసా,పాస్‌పోర్ట్,చేతిలో డబ్బు లేకున్నా స్విట్జర్లాండ్‌కు బయలుదేరి పాకిస్థాన్ ఆర్మీకి పట్టుబడి నాలుగేండ్ల తర్వాత ఇంటికి చేరుకున్న ఓ భగ్నప్రేమికుడి కథ.ప్రియురాలి కోసం వెళ్తూ పాకిస్థాన్ చెరలో చిక్కుకున్న విశాఖ యువకుడు ప్రశాంత్ ఎట్టకేలకు విడుదలయ్యాడు.వాఘా సరిహద్దులో పాక్ అధికారులు ప్రశాంత్‌ను భారత అధికారులకు అప్పగించగా మంగళవారం మాదాపూర్ పోలీసులు అతడిని ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.సైబరాబాద్ సీపీ సజ్జనార్ అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించి విశాఖ వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు.సోదరుడు శ్రీకాంత్‌తో కలిసి ప్రశాంత్ బుధవారం మధ్యాహ్నం విశాఖ మధురవాడలోని తన నివాసానికి చేరుకొన్నాడు.ప్రశాంత్ తండ్రి,కుటుంబ సభ్యులు అతడిని చూసి ఉద్వేగానికి లోనయ్యారు.స్థానికులు కూడా అతడిని చూసేందుకు వచ్చారు.ప్రేమ కోసం అంత రిస్క్ చేసిన ప్రశాంత్‌ను చూసి ఆశ్చర్యపోయారు.
బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేస్తున్నప్పుడు..
ప్రశాంత్ కొంతకాలం కిందట బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేశాడు.ఆ సమయంలో అక్కడే పనిచేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన యువతిని ప్రేమించాడు.కానీ ఆ విషయం ఆమెకు చెప్పలేదు.ఇంతలోనే ఆమె స్విట్జర్లాండ్ వెళ్లిపోయింది.తర్వాత ప్రశాంత్ ఉద్యోగం హైదరాబాద్‌కు మారినప్పటికీ ఆమె ధ్యాసలోనే గడిపేవాడు.2017 ఏప్రిల్‌లో ఎలాగైనా యువతిని కలువాలని నిర్ణయించుకున్నాడు.వీసా,పాస్‌పోర్ట్, చేతిలో అంత డబ్బు లేకున్నా హైదరాబాద్ నుంచి స్విట్జర్లాండ్‌కు పాకిస్థాన్ మీదుగా 7,400 కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు.టికెట్ లేకుండా హైదరాబాద్‌లో రైలెక్కి రాజస్థాన్ చేరుకొని సరిహద్దులో కంచెదాటి పాకిస్థాన్ ఆర్మీకి చిక్కాడు.ఏడాది కిందట పాక్ జైల్లో ఉన్నట్టు ప్రశాంత్ వీడియో బయటికి రావడంతో తల్లిదండ్రులు సైబరాబాద్ పోలీసులను సంప్రదించారు. అప్పటి నుంచి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు,సైబరాబాద్ పోలీసుల కృషితో ఎట్టకేలకు బయటపడి ఇంటికి చేరుకున్నాడు.











