స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ వైసీపీలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వరుస పరిణామాలు ఫ్యాన్ పార్టీని ఆత్మరక్షణలో పడేశాయి. భీమిలి సమన్వయకర్తగా ఉన్న మజ్జి శ్రీనివాసరావు ఇటీవల పార్టీకి గుడ్‌బై చెప్పి TDPలో చేరిపోగా, మరోవైపు తమ్మినేని చిరంజీవి నాగ్ తిరుగుబాటు వంటి పరిణామాలు..గోరుచుట్టుపై రోకలి పోటులా మారాయి. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల పోరును ఎదుర్కొనేందుకు క్యాడర్‌ను గాడిలో పెట్టడం ఇప్పుడు జగన్‌కు కత్తి మీద సాములా మారింది.
భీమిలి సమన్వయకర్త నియామకంపై పార్టీ అధిష్ఠానం తీవ్ర తర్జనభర్జన పడుతోంది. తొలుత పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ పేరును ప్రకటించాలని జగన్ ఆదేశించినప్పటికీ, స్థానిక సీనియర్ల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. కొండా రాజీవ్‌కు బాధ్యతలు ఇస్తే క్యాడర్ సహకరించదని, సీనియర్లను కలుపుకెళ్లేవారికే బాధ్యతలు ఇవ్వాలని స్థానిక నేతలు అధిష్ఠానానికి తేల్చిచెప్పారు. దీంతో విజయనగరం జిల్లాకు సంబంధించి మిగిలిన పదవులు ప్రకటించినా, భీమిలి విషయంలో మాత్రం పెండింగ్ పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఇక పార్టీని వీడిన నేతలను తిరిగి వెనక్కి రప్పించేలా జగన్ తన పంథాను మార్చుకోవడం విశేషం. సాధారణంగా పార్టీని వీడి వెళ్లిన నేతలను తిరిగి వెనక్కి తీసుకునే నైజం జగన్‌ది కాదనే పేరుంది. కానీ, ఉత్తరాంధ్రలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, పార్టీ తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉండటంతో జగన్ మెట్టు దిగాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇందులో భాగంగానే 2024 ఎన్నికల తర్వాత పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి)ని తిరిగి పార్టీలోకి ఆహ్వానించేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆయనే కనుక సుముఖంగా ఉంటే బాధ్యతలు అప్పగించాలని, ఒకవేళ కుదరకపోతే ముగ్గురు సీనియర్లతో త్రిసభ్య సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని అధిష్ఠానం భావిస్తోంది.
మొత్తానికి, ఉత్తరాంధ్రలో కిందిస్థాయి నుంచి వస్తున్న వ్యతిరేకతను చల్లార్చడానికి, పార్టీ పట్టు నిలుపుకోవడానికి జగన్ అనివార్య పరిస్థితుల్లో రాజీ పడుతున్నట్లు స్పష్టమవుతోంది. మరి ఈ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో, స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఏ విధంగా నిలదొక్కుకుంటుందో వేచి చూడాలి.











