గోదావరిలో కావలసినన్ని నీళ్లున్నాయి.. కావాలంటే ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోండి అని తెలంగాణ నాయకులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలంగాణలో గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టులు నిండిన తర్వాతే పోలవరం ప్రాజెక్టు వరకు నీళ్లు వస్తాయి. వృధాగా సముద్రంలోకి పోయే నీటిని వాడుకోవడం వల్ల లాభమే తప్ప ఎవరికీ నష్టం ఉండదని వివరించారు. పోలవరం నుంచి గోదావరి నీటిని కృష్ణా నదికి మళ్లించి నదుల అనుసంధానం చేయడం.. తెలంగాణకు మేలు చేస్తుందని చెప్పారు. పోలవరం పైన తెలంగాణలో ఉన్న దేవాదుల ప్రాజెక్టుని మరింత విస్తరించి.. ఇంకా ఎక్కువ నీటిని వాడుకొన్నా అభ్యంతరం లేదన్నారు.
నీటి విషయంలో రాజకీయాలు చేయొద్దని తెలంగాణకు నేతలకు విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రజల కోసం పోలిటిక్స్ చేస్తే ఎప్పటికైనా ఉపయోగం ఉంటుందని.. రాజకీయాల కోసం రాజకీయం చేయడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. భావోద్వేగాలతో ఆడుకోవడం మంచిది కాదని.. విరోధాలు పెంచి ఆనందించడం సరికాదన్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
రాయలసీమ ఎత్తిపోతల విషయంలో తెలంగాణ నాయకులు చేసిన కామెంట్స్‌లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. అనుమతులు లేని ప్రాజెక్టు కోసం 2 వేల కోట్లు వృధా చేశారు. ఎన్జీటీకి 100 కోట్లు జరిమానా చెల్లించారు. రాయలసీమ లిఫ్ట్ ప్రారంభించే సమయానికే ముచ్చుమర్రి ఎత్తిపోతల పని చేస్తోంది. ముచ్చుమర్రి ద్వారా శ్రీశైలంలో 800 అడుగుల నీటిమట్టం ఉన్నా.. నీటిని తీసుకోవచ్చు. రాయలసీమ లిఫ్ట్ వల్ల అదనపు ప్రయోజనం ఏమీ లేదు. అయినా కేవలం జగన్‌రెడ్డి ప్రచారం కోసం.. వైసీపీ ప్రభుత్వం అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టును చేపట్టింది. జగన్ సర్కారు చర్యల కారణంగానే పోలవరం ప్రాజెక్టు ఏడేళ్లు ఆలస్యం అయిందని చెప్పారు సీఎం చంద్రబాబు.











