మహిళా సాధికారత, ఉపాధి కల్పనలో ఆంధ్రప్రదేశ్ నగరాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ విడుదల చేసిన తాజా గణాంకాలు ఏపీ నగరాల సత్తాను కళ్లకు కట్టింది. ఈ జాతీయ స్థాయి సర్వేలో మహిళా ఉద్యోగుల భాగస్వామ్యంలో గ్రేటర్ విశాఖపట్నం ఏకంగా దేశంలోనే నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోగా..విజయవాడ జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచి సత్తా చాటింది.
ముఖ్యంగా ఈ రెండు నగరాల్లో మహిళలకు ఉన్న అనుకూల వాతావరణం, సాధికారత ఈ నివేదికతో స్పష్టమైంది. జాబితాలో అగ్రస్థానంలో ఉన్న గ్రేటర్ విశాఖపట్నంలో ఏకంగా 42.5 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉండటం విశేషం. ఇక్కడ మహిళలు స్వయంగా నిర్వహిస్తున్న వ్యాపారాలు సైతం 30.6 శాతంగా ఉన్నాయి. ఇక విజయవాడ విషయానికి వస్తే..36.9 శాతం మహిళా ఉద్యోగులతో పాటు, 29.9 శాతం మహిళా వ్యాపారాలతో నాలుగో స్థానంలో నిలిచింది. వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో మహిళలను ప్రోత్సహించడంలో, వారికి ఉపాధి కల్పించడంలో ఈ రెండు ఏపీ నగరాలు అద్భుతమైన పనితీరును కనబరుస్తున్నాయి.
విశాఖ, విజయవాడలతో పాటు టాప్-5 జాబితాలో ఇతర రాష్ట్రాలకు చెందిన టైర్-2 నగరాలే విశేషంగా రాణించాయి. గుజరాత్‌కు చెందిన సూరత్ అత్యధికంగా 43.2 శాతం మహిళా వ్యాపారాలు, 41.4 శాతం మహిళా ఉద్యోగులతో రెండో స్థానంలో నిలిచింది. మహారాష్ట్రలోని వసాయి విరార్ 29.0 శాతం వ్యాపారాలు, 38.5 శాతం ఉద్యోగినులతో మూడో స్థానంలో ఉండగా..గుజరాత్‌కే చెందిన వడోదర 40.7 శాతం మహిళా వ్యాపారాలు, 36.3 శాతం మహిళా ఉద్యోగులతో ఐదో స్థానాన్ని దక్కించుకుంది. ఏపీ నగరాలు ఈ బడా వ్యాపార కేంద్రాలతో ధీటుగా పోటీపడి మరీ టాప్-5లో నిలవడం గమనార్హం.
ఒకపక్క ఏపీలోని ద్వితీయ శ్రేణి నగరాలు మహిళా ఉపాధిలో దూసుకుపోతుంటే, దేశ రాజధాని ఢిల్లీ లాంటి ప్రధాన మెట్రో నగరాలు మాత్రం తీవ్రంగా వెనుకబడటం విస్మయానికి గురిచేస్తోంది. ఈ జాబితాలో కేవలం 16.2 శాతం మహిళా వ్యాపారాలు, 13.5 శాతం మహిళా ఉద్యోగులతో ఢిల్లీ 44వ స్థానానికి పరిమితమై అట్టడుగున నిలిచింది. ఇక ఫరీదాబాద్ (42వ ర్యాంకు), పాట్నా (43వ ర్యాంకు), వారణాసి (45వ ర్యాంకు) నగరాలు కూడా నిరాశపరిచాయి. అత్యంత తక్కువగా శ్రీనగర్ (46వ ర్యాంకు)లో కేవలం 9.9 శాతం వ్యాపారాలు, 10.5 శాతం మంది మాత్రమే మహిళా ఉద్యోగులు ఉన్నారు. భారీ మౌలిక సదుపాయాలు ఉండే మెట్రో నగరాల కంటే..విశాఖ, విజయవాడ లాంటి ఏపీ నగరాలే మహిళలకు అత్యంత సురక్షితమైన, అనుకూలమైన ఉపాధి వాతావరణాన్ని అందిస్తున్నాయని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.











