మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మొన్నటి భూ ఆక్రమణ కేసు మరువకముందే..తాజాగా ఆయన మెడకు మరో క్రిమినల్ కేసు చుట్టుకుంది. శ్రీకాకుళం మండలం కుందువానిపేటలో హుద్‌హుద్ తుఫాన్ బాధితుల కోసం నిర్మించిన గృహాల కబ్జా వ్యవహారంలో ఆయనపై కేసు నమోదైంది. శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఆగస్టు 29న నమోదైన FIRలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇళ్లను నేరుగా ఆక్రమించింది ఎవరు, వారిని వెనకుండి రెచ్చగొట్టింది ఎవరనే దానిపై పోలీసుల FIR కాపీతో పూర్తి వివరాలు బయటపడ్డాయి.
ఈ వ్యవహారంపై కేవలం ఆరోపణల మేరకే కాకుండా పోలీసులు పక్కా ఆధారాలతో ముందుకెళ్లారు. ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేయకుండా, శ్రీకాకుళం RDO, ఎస్డీపీవో (డీఎస్పీ), జిల్లా హౌసింగ్ అధికారితో కూడిన త్రిసభ్య కమిటీ చేత క్షేత్రస్థాయిలో విచారణ జరిపించారు. ఎలాంటి అధికారిక కేటాయింపులు, లాటరీ ప్రక్రియ లేకుండానే ఆక్రమణలు జరిగినట్లు ఈ కమిటీ నిర్ధారించింది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జడ్పీటీసీ రుప్ప దివ్య ప్రేరణతోనే ఈ కబ్జాలు జరిగినట్లు కమిటీ నివేదిక ఇవ్వడంతో.. దాని ఆధారంగా ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ AE వీవీ సత్యాజీ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
కొత్త క్రిమినల్ చట్టం భారతీయ న్యాయ సంహిత – BNS కింద పోలీసులు కఠిన సెక్షన్లతో FIR నమోదు చేశారు. ప్రభుత్వ ఇళ్లలోకి అక్రమంగా చొరబడిన రాయతి అంకమ్మ(A-1), బర్రి యేసమ్మ(A-2), బర్రి సీతమ్మ(A-3), బర్రి లక్ష్మమ్మ(A-4), బొడ్డేపల్లి లక్ష్మి(A-5), బొడ్డేపల్లి లక్ష్మణ(A-6)లను నిందితులుగా చేర్చారు. వీరికి వత్తాసు పలికి, ఆస్తులను ఆక్రమించేలా ఉసిగొల్పినందుకు శ్రీకాకుళం జడ్పీటీసీ రుప్ప దివ్యను A-7గా, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును A-8గా పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆస్తిలోకి అక్రమంగా చొరబడినందుకు 329(4) BNS, నేరం చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఇతరులను ప్రేరేపించినందుకు 49 BNS, ఒకే ఉమ్మడి ఉద్దేశంతో నేరంలో పాల్గొన్నందుకు రెడ్ విత్ 3(5) BNS కింద కేసులు నమోదు చేశారు. ఉన్నతాధికారుల కమిటీ విచారణ నివేదికతో పక్కాగా కేసు నమోదు కావడంతో ధర్మాన చుట్టూ ఉచ్చు గట్టిగానే బిగుసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.











