చంద్రబాబు నాయుడు ను ఏదో విధంగా దెబ్బ తీసే ప్రయత్నాల్లో భాగమే ఈ అమూల్ పథకం ను ప్రవేశపెట్టినట్లు కనిపిస్తుంది. హెరిటేజ్ ను దెబ్బతీయాలని అమూల్ కు ఆహ్వానం పలకింది ప్రభుత్వం. ఈ నెల 26 న ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ప్రారంభం కావలసివున్న జగనన్న – అమూల్ ప్రాజెక్టు డిసెంబర్ 2కి వాయిదా పడినట్లు ప్రభుత్వం ఒక ప్రకటన విడుదలు చేసింది. దూసుకొస్తున్న నివర్ తుఫాన్ జగనన్న-అమూల్ కు బ్రేకులు వేసినట్లు తెలుస్తుంది.
ఏది వారి లక్ష్యం?
మహిళా సాధికారత లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్తున్న ప్రభుత్వం, మధ్యలో అమూల్ కే పాలు అనే కండీషన్ ని ఎందుకు పెట్టిందో అర్థం కావడం లేదు. ఏ పథకంలోనూ లేని భాగస్వామ్యాన్ని ఇందులో ప్రత్యేకంగా చొప్పించి మరీ హెరిటేజ్ ని టార్గెట్ చేస్తుందనేది విస్పష్టం. గేదెలు మాత్రం ఏ జాతైనా పర్లేదు, ఏ రాష్ట్రమైనా నష్టం లేదు… కానీ పాలు మాత్రం గుజరాత్ కి చెందిన అమూల్ కే పోయాలి లేదా రాయితీ వర్తించదు అనే ప్రభుత్వ నిబంధనే చెప్తుంది వారి ఉద్దేశం.
ఎక్కడి నుండో తేవాల్సిన అవసరమేంటి?
పాల ఉత్పత్తిని ప్రోత్సహించడమే ప్రధాన ఉద్దేశం అయితే, రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నో పాల ఉత్పత్తి సంస్థలు ఏపీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వాటిని అన్నింటినీ వదిలేసి ఎక్కడో గుజరాత్ లోని అమూల్ తో ఒప్పందాలు చేసుకోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశలలో రూ. 3,034 కోట్ల వ్యయంతో 9,899 ప్రాంతాల్లో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, పాలసేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో పైలెట్ ప్రాజెక్టు క్రింద ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోని 400 గ్రామాలలో ప్రారంభించడానికి ప్రభుత్వం ఎంపిక చేసింది. మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ను ఇప్పటికే విజయవంతంగా నడుపుతున్న స్ధానిక సంస్థలను పక్కన పెట్టిందంటే ఎక్కడో ఏదో జరుగుతుందనే అనుమానం ఎవరికైనా రాక మానదు.
పాల సంస్ధలు కుదేలు
ఈ పథకం రూపుదాల్చడం జరిగితే, వాళ్లు టార్గెట్ చేసిన హెరిటేజ్ తో పాటు మిగిలిన పాల సంస్థలు కూడా కుదేలయ్యే అవకాశాలు ఎక్కువ. ఇలా పథకం పేరుతో ప్రభుత్వమే ఒక సంస్థకు పగ్గాలప్పగించి, రాష్ట్రంలోని సగానికి పైగా పాల ఉత్పత్తిని వారికి దానాదత్తం చేసే ప్రయత్నాలు చేస్తే మిగిలిన 12 సంస్థలు వ్యాపారాలు జరగక రాష్ట్రాలను వదిలి వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదు.
అలాంటి చర్యలకు దారి తీస్తే, వాటిపై ఆధారపడి జీవిస్తున్న వారి జీవితాలు తల్లకిందులవకమానవు. ఇది ఇంతటితో ఆగదు, పోటీ తత్వం లేకపోతే ధరలు పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. మేము చెప్పిందే ధర అంటే, మరొక మార్గం లేక వారికే అప్పగించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇదంతా కేవలం ఒక సంస్థను నిర్మూలించాలనే ప్రయత్నంలో చేస్తున్న ఈ చర్య పాల ఉత్పత్తి రంగాన్నే దెబ్బ తీస్తే పరిస్థితి ఏంటి? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అవుతుంది వ్యవహారం.











