ఏపీలో అయినవారిపై కేసుల ఉపసంహరణ షురూ అయింది. తాజాగా కృష్ణా జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్ అప్పారావు సహా 14 మంది వైకాపా నాయకులు, కార్యకర్తలపై 2018 అక్టోబరు 25న నమోదైన కేసును ఉపసంహరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా విశాఖ విమానాశ్రయంలో ఓ వ్యక్తి కోడికత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. దాడికి నిరసనగా నూజివీడులోని సింగ్ హోటల్ సెంటర్‌లో ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, మరికొందరు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
ఎమ్మెల్యే అప్పారావు సహా 14 మంది వైకాపా నాయకులు, కార్యకర్తలపై 2018 అక్టోబరు 25న పోలీసులు ఐపీసీ 341,143 రెడ్‌విత్, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాజాగా డీజీపీ సవాంగ్ విజ్ఞప్తి మేరకు ఆ కేసును ఎత్తివేస్తున్నట్టు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.
మరికొన్ని కేసులు కూడా..
విజయవాడలోని మాచవరం స్టేషన్ పరిధిలో ప్రస్తుతం పరారీలో ఉన్న ముప్పా దుర్గాప్రసాద్‌పై 2008లో నమోదైన కేసునూ ఉపసంహరించారు. తిరుపతి ఎస్వీయూలో పనిచేసి పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్ ఎల్లటూరి వెంకటరామిరెడ్డిపై ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించుకోవాలని సీఐడీ అధికారులను ఆదేశిస్తూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు ఇచ్చారు. కడప జిల్లాలోని యోగి వేమన విశ్వవిద్యాలయానికి ఓఎస్డీగా వెంకటరామిరెడ్డి పనిచేసినప్పుడు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారన్నది ఆయనపై ఆరోపణ.
ఆయనతో పాటు అప్పటి రిజిస్ట్రార్ షేక్ హిదయతుల్లాతోపాటు, మధుసూదన్, ప్రభాకర్‌రావు, జయరామిరెడ్డిపై సీఐడీ అధికారులు అభియోగాలు నమోదు చేశారు. చిత్తూరులోని నాలుగో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో ఈకేసు విచారణ జరుగుతోంది. ఈ ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించుకునేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సీఐడీ అదనపు డీజీని ఆదేశించింది.
అయితే ప్రభుత్వం ఉపసంహరించిన కేసుల సంగతి చూస్తే చిత్రంగా కనిపిస్తోంది. జగన్మోహన రెడ్డి మీద ఎవడో కోడికత్తితో దాడిచేస్తే.. ఆ విషయంలో మేకా వెంకటప్రతాప్ అప్పారావు ఎందుకు ఆందోళన చేశారో తెలియదు. పోనీ ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యే గనుక కేసు నుంచి విముక్తి ఇచ్చారని అనుకోవచ్చు. యూనివర్సిటీలో నిధుల అక్రమాలకు పాల్పడిన వారి మీద కేసులు కూడా ఎత్తేయడంలో ఔచిత్యం ఏమిటి అనే ప్రశ్న ప్రజల్లో మెదలుతోంది.
ఇలాంటి కేసులూ ఎత్తేస్తారా?
ప్రభుత్వం ఉపసంహరించుకున్న కేసుల తీరు కూడా చిత్రంగా ఉంది. సాధారణంగా ప్రజాప్రయోజనాలకోసం చేసే ఉద్యమాలకు సంబంధించి పార్టీలు ఆందోళనలు నిర్వహిస్తే.. తర్వాత వారు అధికారంలోకి వచ్చినప్పుడు ఆ కేసులు ఎత్తేస్తుంటారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ పోరాట కేసులు, స్పెషల్ స్టేటస్ కోసం ఏపీలో జరిగిన ఆందోళనకు సంబంధించిన కేసులు ఇలాంటి కోవకు చెందుతాయి.
అయిన వారిపై ఎత్తివేత, కానివారు ప్రశ్నిస్తే కేసులు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం కేసుల ఎత్తివేతపై తీసుకుంటోన్న నిర్ణయాలు పలు విమర్శలకు దారితీస్తున్నాయి. రాజధాని కృష్ణాయపాలెంలో ఆటోలో వెళుతున్న వారిని ఆపి ప్రశ్నించారని ఐదురుగు బీసీలు, ఇద్దరు ఎస్సీ రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి బేడీలు వేసిమరీ జైలుకు తరలించడం సంచలనం రేపింది. ప్రశ్నిస్తేనే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిన పోలీసులు ఎవరి ఒత్తిడి మేరకు ఈ పని చేశారో అందరికీ తెలిసిందే. అయినవారు ఎంతటి దుర్మార్గాలకు పాల్పడ్డా వారిపై కేసులు ఉండవు. ఒక వేళ అలాంటి వారిపై కేసులు అప్పటికే ఉంటే వాటిని కూడా ఎత్తివేస్తారు. కానివారు- అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై మాత్రం నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారు. అంటే ప్రజాస్వామ్యంలో నియంతృత్వం నడుస్తోందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతోందా.. లేక అధికారం ఉన్న వారి చుట్టంగా మారిందా అనే అనుమానాలు వస్తున్నాయని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.