ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాకలో బీజేపీ విజయంతో తనకు ఉన్న మూడు కోరికల్లో ఒకటి నెరవేరిందన్నారు. ఇక తిరుపతి ఉపఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలుపు ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారని మోహన్ బాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాలనపై ఎప్పుడూ నిప్పులు చెరిగే మోహన్ బాబు, ఈ సారి అల్లుడు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం వెనుక బలమైన కారణమే ఉండొచ్చని తెలుస్తోంది.
జగనన్న పాలన అంత చెండాలమా బాబూ?
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి సరిగ్గా ఒకటిన్నర సంవత్సరం అవుతోంది. అంతలోనే అనుకూల వర్గాల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తాజాగా ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయి. మొదటి నుంచీ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై మోహన్ బాబు నిప్పులు చెరుగుతూ ఉంటారు. మోహన్ బాబు నడుపుతున్న కాలేజీలకు ఫీజు రీ ఎంబర్స్ మెంటు ఇవ్వలేదంటూ ఎన్నికలకు ముందు రోడ్డుపై బైఠాయించి మరీ నిరసన తెలిపారు. అయితే మోహన్ బాబుకు బంధువు కూడా అయిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సీఎం అయినా ఆయన కాలేజీలకు రావాల్సిన బకాయిలు నేటికీ అందలేదట. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక కనీసం మోహన్ బాబును పిలిచి మాట్లాడింది కూడా లేదని ఆయన గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీ ప్రముఖులందరూ వచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలసినా మోహన్ బాబు మాత్రం రాలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తన కష్టాలు తీరుతాయని భావించిన మోహన్ బాబుకు చుక్కెదురైందనే చెప్పాలి. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు నేటికీ రాకపోవడంతో, మోహన్ బాబు ఫిల్మ్ నగర్ లోని తను నివాసం ఉంటున్న ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకుని సిబ్బందికి జీతాలు చెల్లించాల్సి వచ్చిందట. అల్లుడు అధికారంలోకి వచ్చినా మామను కనీసం పట్టించుకోకపోవడంతో ఆయన జగన్మోహన్ రెడ్డిపై మనస్తాపంతో ఉన్నారని తెలుస్తోంది.
Must Read ;- షాక్ : ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎప్పుడో ఆగిపోయింది!?
తనదాకా వస్తేగాని తత్వం బోధపడదంటారుగా..
టీడీపీ అధికారంలో ఉండగా కావాలనే తన కాలేజీలకు ఫీజు రీఎంబర్సుమెంటు చేయకుండా ఆపారని మోహన్ బాబు భావించారని తెలుస్తోంది. సహజంగా ఏ ప్రభుత్వం వచ్చినా ఫీజు రీఎంబర్స్ మెంటు బకాయిలు పేరుకుపోతూనే ఉన్నాయి. ఇప్పటికీ 2018 బకాయిలు ఏ కాలేజీలకు కూడా చెల్లించలేదు. ప్రత్యేకంగా మోహన్ బాబు కాలేజీకి మాత్రమే ఇస్తే పెద్ద రచ్చ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే అందరితో పాటే మోహన్ బాబు నడుపుతున్న కాలేజీలకు కూడా ఫీజులు వస్తాయి. అంతేకాని అల్లుడు సీఎం అయినంత మాత్రం మోహన్ బాబు కాలేజీకి ప్రత్యేకంగా ఫీజు రీఎంబర్స్ మెంటు బకాయిలు విడుదల చేయడం సాధ్యం కాదు. కేవలం ఒక్క ఫీజు రీఎంబర్సు మెంటు వ్యవహారమే కాదు…. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక, తనను ఆహ్వానిస్తాడని భావించారట. కనీసం పట్టించుకోకపోవడంతో మోహన్ బాబుకు బాగా కోపం వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే తిరుపతిలో వైసీపీకి దెబ్బపడితే కళ్లు తెరుస్తారని ఆయన భావిస్తున్నారని కొందరు విశ్లేషిస్తున్నారు.
తిరుపతి ఉపఎన్నికల్లో మోహన్ బాబు వ్యాఖ్యల ప్రభావం..
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయాలని భావించిన మోహన్ బాబుకు కనీసం టికెట్ కూడా దక్కలేదు. తిరుపతి పార్లమెంటు స్థానం కూడా ఎస్సీలకు కేటాయించడంతో ఆయన కోరిక నెరవేరలేదని తెలుస్తోంది. అయితే తాజాగా తిరుపతిలో బీజేపీ గెలవాలని కోరుకుంటున్నారంటే ఇక ఆయన జగన్మోహన్ రెడ్డిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసినట్టే. ఇప్పటికే తిరుపతిలో చతుర్ముఖపోటీ ఉంటుందని అందరూ అంచనాలు వేస్తున్నారు. ఇక మోహన్ బాబు తాజా వ్యాఖ్యలతో తిరుపతి బీజేపీ శ్రేణుల్లోనూ ఉత్సాహం మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.
Also Read ;- వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలో చేరుతున్నాట్ట! ఎందుకో తెలుసా?











