ఏపీలో పాల సేకరణ రంగంలోకి అమూల్ అడుగుపెట్టింది. గుజరాత్ కు చెందిన సహకార సంస్థ అమూల్ అన్ని రాష్ట్రాలను వదిలేసి ఏపీలో పాల సేకరణ చేపట్టడంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ ఖర్చుతో పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి డెయిరీలకు అప్పగించడం ఎక్కడా లేదు. ఏపీలోనే చూసుకుంటే సహకారరంగంలోని సంగం, విజయ, ఒంగోలు డెయిరీలు వారే గ్రామాల్లో పాడి రైతుల సహకార సంఘాల ద్వారా భవనాలు నిర్మించి ఇస్తున్నాయి.
ఇందులో ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టదు. కానీ ఎక్కడో గుజరాత్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమూల్ డెయిరీని ఏపీ ప్రభుత్వం రంగంలోకి దింపింది. ప్రభుత్వం రూ.5 వేల కోట్లతో నిర్మిస్తున్న రైతు భరోసా కేంద్రాల ద్వారా పాలు సేకరించి అమూల్ కు ఇవ్వాలని చూడటం వెనుక పెద్ద స్కెచ్ ఉందని తెలుస్తోంది.
టార్గెట్ హెరిటేజ్ డెయిరీనా?
తెలుగు రాష్ట్రాల్లో పాల సేకరణ, పాడి రైతుల సంక్షేమంలో హెరిటేజ్ డెయిరీకి మంచి పేరుంది. అయితే ఈ సంస్థ ఏపీ ప్రతిపక్ష నాయకుని కుటుంబం చేతిలో ఉంది. ఎలాగైనా వారి వ్యాపారాన్ని దెబ్బతీయాలనే కుట్రతోనే, ఏపీ ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసి, అమూల్ డెయిరీని రంగంలోకి దింపిందనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల పాడి గేదెలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. అంతవరకూ బాగానే ఉంది. అయితే ఆ పాడి రైతులు, పాలు అమూల్ డెయిరీలో పోస్తేనే, రాయితీపై గెదెలు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. అంటే ఖర్చు ప్రభుత్వానిది, పాలు అమూల్ డెయిరీకా? అని పాడి రైతులు విమర్శిస్తున్నారు.
Also Read:-తెలంగాణ వైసీపీ.. అలాంటిది ఒకటి ఉందా?
ఏపీలో సహకార డెయిరీలకు సవాల్?
ఉత్తరాది రాష్ట్రాల్లో మంచి బ్రాండింగ్ ఉన్న అమూల్ డెయిరీ ఏపీలో కార్యకలాపాలు ప్రారంభించడంతో, సహకార రంగంలోని సంగం, విజయ డెయిరీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావచ్చు. డెయిరీల నిర్వహణలో పాల సేకరణ చాలా కీలక అంశం. పోటీ పెరగడంతో పాటు, గ్రామాల్లోని రైతులను బలవంతంగా ప్రభుత్వ పెద్దలే అమూల్ డెయిరీకి పాలు పోయాలని ఆదేశించడంతో పాల మార్కెట్లో అనారోగ్యకరమైన పోటీ ఏర్పడింది.
గ్రామాల్లో సగం మంది అమూల్ డెయిరీకి పాలు పోస్తే, మిగిలిన సగం రైతులందరూ కలసి సహకార, ప్రయివేటు రంగంలోని 12 డెయిరీలకు పాలు పోయాల్సి వస్తుంది. అంటే ఏపీ ప్రభుత్వం అందుబాటులో వాటిలో సగం పాలను అమూల్ ద్వారా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు ప్రభుత్వ సహకారం కూడా తోడు కావడంతో వారి పని మరింత సాఫీగా సాగిపోతోంది.
Must Read:-రాసిపెట్టుకోండి : మూడేళ్ల తరవాత వైసీపీ ఉండదు
ఎన్నికల హామీ ఏమైంది?
2019 ఎన్నికల ప్రచారంలో పాడి రైతులకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మరలా తెరమీదకు వచ్చింది. తాము అధికారంలోకి వస్తే పాడి రైతులకు లీటర్ కు నాలుగు రూపాయల ప్రోత్సాహకం ఇస్తామని ప్రకటించారు. అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం పాడి రైతులకు లీటర్ కు 2 రూపాయలు అందించింది. వారు రెండు ఇస్తే మనం నాలుగు ఇద్దాం అనే చందంగా, జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో హామీలు గుప్పించారు. తీరా అమల్లోకి తీసుకురావడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. లీటర్ పాలకు రూ.4 ప్రోత్సాహకం ఇవ్వాలంటే, సంవత్సరానికి రూ.750 కోట్లు ఖర్చవుతుంది. ఇంత ఖర్చు పెట్టే స్థితిలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్టు కనిపించడం లేదు. అందుకే అందరికంటే అమూల్ ఎక్కువ ధర ఇస్తుందని ప్రచారం చేస్తున్నారు. ఇందులో కూడా వాస్తవం లేదు. పాల సేకరణలో డెయిరీల చెల్లింపుల మధ్య పెద్దగా వ్యత్యాసం లేదు. ఎందుకంటే ఎవరు ఒక రూపాయి ఎక్కువ ఇస్తే రైతులు ఆ డెయిరీకే పాలు పోస్తారు. అందుకే పాల సేకరణ ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. అమూల్ కూడా పాల సేకరణ చేసి దక్షిణాదిలోనే మార్కెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే వారు ఆచితూచి వ్యవహరిస్తున్నారని, ఖర్చంతా ప్రభుత్వంతో చేయిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.