హెరిటేజ్ సంస్థ అనగానే గుర్తుకు వచ్చేది టీడీపీ అధినేత చంద్రబాబే. హెరిటేజ్ పాల వ్యాపారం ఆయన కుటుంబం నిర్వహిస్తున్నా ఒక రకంగా దీనికి చంద్రబాబే పునాది వేశారు. దాదాపు మూడు దశాబ్దాల కిందట చిత్తూరులో ప్రారంభమైన హెరిటేజ్ పాల వ్యాపారం నేడు నాలుగు రాష్ట్రాలకు విస్తరించింది. ఏటా రూ.4000 కోట్ల వ్యాపారం నిర్వహిస్తూ వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది. పాల వ్యాపారంలో తనకంటూ గుర్తింపు పొందిన హెరిటేజ్ కు అమూల్ రూపంలో కష్టకాలం మొదలైందనే చెప్పవచ్చు.
అమూల్ ను రంగంలోకి దింపిన సీఎం
హెరిటేజ్ పాల వ్యాపారాన్ని ఏపీలో లేకుండా చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. ఎక్కడో గుజరాత్ లో పాల వ్యాపారం చేసుకునే అమూల్ సంస్థను ఏపీకి ఆహ్వానించారు. ఆ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ కూడా చేసుకుంది. ఏపీలో 6 వేలకుపైగా పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అందరికంటే ఎక్కువ ధర చెల్లిస్తామంటూ అమూల్, ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దీని వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉందని ప్రజలకు అర్దమైపోయింది.
హెరిటేజ్ పాల వ్యాపారాన్ని దెబ్బకొడితే, టీడీపీ ఆర్థిక మూలాలను కొట్టినట్టేనని వైసీపీ అధినేత భావిస్తున్నారట. అందుకే ఏపీలో హెరిటేజ్ వ్యాపారాన్ని సమూలంగా నిర్మూలించేందుకే మంచి పేరున్న అమూల్ ను రంగంలోకి దింపారని టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.
రైతుభరోసా కేంద్రాల ద్వారా పాల సేకరణ
ప్రతి గ్రామంలో రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలని వైసీసీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే అన్ని మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు సరఫరా చేయడంతోపాటు, రైతులు పండించిన పంటకు ఈ కేంద్రాల్లోనే గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా ప్రకటించారు. దీనికి మరో అడుగు ముందుకు వేసి రైతు భరోసా కేంద్రాల ద్వారా పాల సేకరణ ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం రూ.500 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించిందట. ఇలా సేకరించిన పాలను అమూల్ సంస్థకు సరఫరా చేయడం ద్వారా పాడి రైతులకు మంచి ధర ఇవ్వాలని వైసీపీ పెద్దలు భావిస్తున్నారట.
పాల సేకరణలో పోటాపోటీ…
పాల వ్యాపారం నిర్వహించే సంస్థలకు పాలు సేకరించడం సవాల్ గా మారింది. అనేక ప్రయివేటు సంస్థలు రైతుల వద్ద నుంచి పాలు సేకరించేందుకు నానాతంటాలు పడుతున్నాయి. రెండు దశాబ్దాల కిందట కేవలం సహకారరంగంలోని సంగం, విజయలాంటి సంస్థలు గ్రామాల్లో పాల సేకరణ సహకార సంఘాలు ఏర్పాటు చేసి పాలు సేకరించాయి. ప్రయివేటు కంపెనీలు రంగంలోకి దిగాక పాలసేకరణ పెద్ద సవాల్ గా మారింది. వారి మధ్య పోటీ కారణంగా లీటరు పాలు సేకరించేందుకు రూ.58 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక ప్రభుత్వ సహకారంతో అమూల్ ను రంగంలోకి దింపితే హెరిటేజ్ లాంటి సంస్థల మనుగడ కష్టమేనని వ్యాపారవర్గాలు అంచనా వేస్తున్నాయి.
లీటర్ కు రూ.2 అదనం
తెలంగాణ తరహాలో రైతు భరోసా కేంద్రాల్లో పాలు పోసే రైతులకు ప్రభుత్వం ప్రతి లీటర్ పాలకు రూ.2 అదనంగా చెల్లించాలనే ఆలోచన చేస్తోందట. ఇప్పటికే ఈ విధానం తెలంగాణలో అమలవుతోంది. ఇదే జరిగితే ఏపీలో ప్రయివేటు, సహకార డెయిరీలు మూతపడటం తప్పేలా లేదు. లాభాల్లో నడుస్తున్న సహకార సంఘాలు మూతపడ్డా పరవాలేదు. హెరిటేజ్ ను ఏపీలో లేకుండా చేయాలనే వైసీసీ పెద్దల స్కెచ్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో తెలియాలంటే మరో ఏడాది ఆగాల్సిందే.











