ఎమ్మెల్యేలే కాదు, మంత్రులపై కూడా సహజంగానే నిఘా ఉంటుంది. ఎవరు అధికారంలో ఉన్నా నిఘా కొనసాగుతూనే ఉంటుంది. అయితే తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ సీనీయర్ నేత, మంత్రి పెద్దిరెడ్డిపై వైసీపీ అధినేత మూడంచెల నిఘా ఏర్పాటు చేశారని తెలుస్తోంది. సీబీఐ కేసులు రోజు వారీ విచారణ ప్రారంభించడంతో ఏప్పుడైనా సీఎం జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దవుతుందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో జగన్ జైలుకు వెళితే తాను ముఖ్యమంత్రి పదవిలోకి రావాలని ఇప్పటి నుంచే మంత్రి పెద్దిరెడ్డి అనుకూల ఎమ్మెల్యేలతో సంప్రదింపులు చేస్తున్నారనే పుకార్లు గుప్పుమన్నాయి. దీంతో పెద్దిరెడ్డిపై నిఘాను మరింత పెంచినట్టు తెలుస్తోంది.
ప్రతి కదలికపై నిఘా…
పంచాయతీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి ప్రస్తుత రాజకీయాల్లో అత్యంత సీనియర్ అని చెప్పవచ్చు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబునాయుడు రాజకీయ ప్రస్థానం ప్రారంభించినప్పుడే పెద్దిరెడ్డి కూడా రాజకీయాల్లోకి వచ్చారు. అంటే పెద్దిరెడ్డి కూడా 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. అయితే అనేకసార్లు మంత్రి పదవి అనుభవించినా, ముఖ్యమంత్రి కాలేదనే ఒక అసంతృప్తి మిగిలిపోయిందట. పెద్దిరెడ్డి సమకాలికులు చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇద్దరూ ముఖ్యమంత్రులు కాగలిగారని, నాకేం తక్కువ, నేను కూడా ముఖ్యమంత్రిగా చేయాలనే ఆలోచనలో పెద్దిరెడ్డి ఉన్నారని సహచరులు చెబుతూ ఉంటారు.
అయితే ఆ అవకాశం జగన్ జైలుకు వెళితే వస్తుందనే అంచనాలు పెద్దిరెడ్డి శిభిరంలో ఉన్నాయట. అందుకే వైసీపీలో మూడో వంతు మంది ఎమ్మెల్యేలతో మంత్రి పెద్దిరెడ్డి టచ్ లో ఉన్నారట. గత ఎన్నికల్లో కూడా మూడు జిల్లాల్లో దాదాపు 18 మందికి ఎమ్మెల్యేలు గెలవడానికి పెద్దిరెడ్డి భారీగానే ఆర్థిక సహకారం అందించారని తెలుస్తోంది. ఇవన్నీ గమనించిన వైసీపీ అధినేత మంత్రి పెద్దిరెడ్డి రోజు వారీ కదలికలపై నిఘా పెంచారని సమాచారం. మంత్రి పెద్దిరెడ్డి ఎవరెవరిని కలుస్తున్నారు, ఆయన్ను ఎవరు వచ్చి కలసి వెళుతున్నారన్నారనే దానిపై రోజు వారీ నిఘా నివేదికలు తెప్పించుకుంటున్నారని వినిపిస్తోంది.
ఎంపీ మిథున్ రెడ్డిపైనా నిఘా నేత్రం..
మంత్రి పెద్దిరెడ్డి తనయుడు, రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై కూడా వైసీపీ అధినేత ఓ కన్నేసి ఉంచారని సమాచారం. ఎక్కువగా ఢిల్లీలోనే ఉండే మిథున్ రెడ్డి, ఇటీవల బీజేపీలో ప్రముఖులను కలుస్తున్నాడనే సమాచారం వైసీపీ అధినేతకు అందిందట. దీనిపై అప్రమత్తమైన వైసీపీ అధినేత ఢిల్లీలో ఎంపీలు పార్టీ అనుమతిలే కుండా బీజేపీ నేతలకు కలవడానికి వీల్లేదని హుకుం జారీ చేశారని సమాచారం. అటు ఢిల్లీలో మిథున్ రెడ్డిపై, ఇటు చిత్తూరు పెద్దిరెడ్డిపై నిఘా తీవ్రం చేయడంతో వారు కూడా అనుకూల పరిస్థితుల కోసం వేసి చూస్తున్నారని తెలుస్తోంది.
అందుకేనా…
ఏపీలో ఇసుక రీచ్‌ల నిర్వహణకు కేంద్ర సంస్థలను ఆహ్వానించారు. కేంద్ర సంస్థలు ఇసుక అమ్ముకునే వ్యాపారం దేశంలో ఎక్కడా నిర్వహించడం లేదు. మన రాష్ట్రంలోనూ వారు ఇసుక తవ్వకాలు, అమ్మకాలకు ఆసక్తి చూపే అవకాశం లేదు. కేంద్ర సంస్థలు రావు, కాబట్టి తరవాత ప్రయివేటు సంస్థలను పిలుస్తారు. అయిన వారికి ఇసుక రీచ్ లు కట్టబెడతారని తెలుస్తోంది. ఈ క్రమంలో తమిళనాడులో చక్రం తిప్పుతున్న బడా కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన సంస్థ తమిళనాడులో ఇసుక తవ్వకాల్లో మంచి అనుభవం సాధించింది. పెద్దిరెడ్డికి చెక్ పెట్టేందుకు ఇసుక రీచ్ లు శేఖర్ రెడ్డికి దక్కే విధంగా వైసీపీ అధినేత పావులు కదుపుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. అంటే ఇటు పెద్దిరెడ్డి కాంట్రాక్టు సంస్థకు దక్కుతాయనుకున్న ఇసుక రీచ్ లు, టీటీడీ బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడు శేఖర్ రెడ్డి ఎగరేసుకుపోయే అవకాశం ఉంది. అంటే పెద్దిరెడ్డికి చెక్ పెట్టినట్టేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.