మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎంపీలో గోవుల సంరక్షణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. ఇవాళ తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్న వెంటనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ నెల 22న అగర్ మల్యా గోవుల సంరక్షణ కేంద్రంలో జరిగే తొలి క్యాబినెట్ సమావేశంలోనే గోవుల సంరక్షణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుపై తీర్మానం చేయనున్నట్టు చౌహాన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
Also Read:-తిరుమల వేంకటేశ్వరుని సేవకు అంతరాయం
దేశంలో తొలిసారి..
గోవుల సంరక్షణకు ప్రత్యేకంగా ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం దేశంలో ఇదే మొదటి సారి. హిందుత్వపార్టీగా ముద్రపడ్డ బీజేపీ అధికారంలో ఉన్న మరికొన్ని రాష్ట్రాలు కూడా శివరాజ్ సింగ్ బాటలో పయనించే అవకాశం ఉంది. సహజంగా పశుసంవర్థక శాఖ ప్రతి రాష్ట్రంలో ఉంటుంది. గోవులు కూడా పశువుల జాబితాలోకి వస్తాయి కాబట్టి, వాటి సంరక్షణ కూడా పశుసంవర్థక శాఖ చూస్తూ ఉంటుంది. కానీ గోవుల రక్షణకే ఓ శాఖను ఏర్పాటు చేసి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కొత్త సాంప్రదాయానికి తెరలేపారని చెప్పవచ్చు
గో సంరక్షణలో కీలకశాఖలకు భాగస్వామ్యం
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఏర్పాటు చేయనున్న గో సంరక్షణ శాఖలో పశు సంవర్థకం, అటవీ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, హోం శాఖలకు భాగస్వామ్యం కల్పించనున్నట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. గోపూజ చేసిన వారికి అనంత కోటి పుణ్యాలు దక్కుతాయని హిందువుల నమ్మిక. హిందుత్వ ముద్ర వేసుకున్న బీజేపీ గోవుల సంరక్షకు ఇప్పటికైనా నడుం బిగించడంపై హిందూ సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
Must Read:-కాషాయ కమలం గళం పెంచుతోంది ఎందుకో?
రాజకీయ కోణం ఉందా
బీజేపీ నేతలు ఏ నిర్ణయం తీసుకున్నా అందులో రాజకీయ కోణం వెతకాల్సి వస్తోంది. వారు తీసుకుంటోన్న నిర్ణయాలు అలాంటివి మరి. గోవుల సంరక్షణకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయడం ద్వారా మధ్యప్రదేశ్ లో అత్యధికంగా ఉన్న హిందువుల మనోభావాలను సంతృప్తి పరచడం ద్వారా అక్కడ బీజేపీ మరింత బలోపేతం అయ్యే అవకాశాలను కొట్టిపారేయలేం. వ్యూహాలు రచించడంలో బీజేపీ నేతలు ఒకరిని మరొకరి మించిపోతున్నారు. ఎంపీలో గోసంరక్షణ శాఖ ను ఏర్పాటు చేయడం ద్వారా, శివరాజ్ సింగ్ చౌహాన్ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇలాంటి శాఖ కూడా ఒకటి ఏర్పాటు చేయవచ్చని తెలియజేసినట్టయింది











