(శ్రీకాకుళం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత, మంచి వాక్పటిమ, సమకాలీన రాజకీయ మేళవింపు అయిన ధర్మాన ప్రసాదరావు ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా సమకాలీన రాజకీయాలలో మేటి నాయకుడైన ధర్మాన ప్రస్తుతం శ్రీకాకుళం నుండి సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగుతుండటం తలపండిన రాజకీయ నాయకులనూ ఆశ్చర్యానికి గురిచేస్తుండగా, ఆయన మాత్రం లోలోన కుతకుతలాడుతున్నారు.
తన రాజకీయ అండతో ఆరంగేట్రం చేసిన సొంత అన్నయ్య ధర్మాన కృష్ణదాస్‌కు రెవెన్యూ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పట్టం కట్టి, తనను పక్కన పెట్టడం, నిన్న కాక మొన్న రాజకీయాలలోకి వచ్చిన పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజును మంత్రిగా నియమించడం వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎఎస్. జగన్మోహన్ రెడ్డి పట్ల ధర్మాన ప్రసాదరావుకు పీకలదాకా కోపం ఉన్నప్పటికీ ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు.
కురుపాం ఎమ్మెల్యే, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, సీదిరి అప్పలరాజు పాటి చేయలేకపోయానా అని మధనపడుతున్నారు. శ్రీకాకుళంలో ఇటీవల జరిగిన ఒక బహిరంగ సభలో వైసీపీ నేత విజయసాయిరెడ్డి సమక్షంలోనే ‘తల , తోక లేని మొండెం’ మాకెందుకు అంటూ జిల్లాల విభజనపై ఆయన కుండబద్దలు కొట్టినట్టు అభిప్రాయం వెలిబుచ్చడం, అంతర్గతంగా జగన్ పై ఉన్న అక్కసు వెళ్లగక్కడం అందుకు నిదర్శనం.
ఈ విషయంపై ముఖ్యమంత్రి ధర్మానకు వివరణ కోరడం , అది జిల్లా ప్రజల అభిప్రాయమని ఆయన చెప్పడం వేరేవిషయమైనప్పటికీ, వాస్తవం జిల్లా ప్రజలకు తెలుసనడంలో సందేహం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధర్మాన ప్రసాదరావును వెనక్కి నెట్టడంలో అసలు విషయం వేరేవుందనేది ప్రజల అభిప్రాయం.
కాంగ్రెస్ తో విభేదించిన జగన్ 2010లో వైఎస్సార్సీపీ అనే కొత్త పార్టీని ప్రారంభించడం , తన విధేయులు తనతో రావాలని, అలా వచ్చినవారు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని జగన్ కోరారు. జగన్మోహన్ పిలుపునకు స్పందించి వచ్చిన 16మంది ఎమ్మెల్యేలలో కృష్ణదాస్ ఒకరు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తన తమ్ముడు ధర్మాన ప్రసాదరావు ప్రోత్సాహంతో కృష్ణదాస్ నరసన్నపేట నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కృష్ణదాస్‌కు రాజకీయ భిక్షను ప్రసాదించిన ప్రసాదరావు శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
జగన్ పిలుపు మేరకు ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసిన కృష్ణదాస్ 2012 ఉప ఎన్నికలలో మళ్లీ నరసన్నపేట నుండి వైసీపీ తరపున పోటీచేశారు. అప్పటికి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో రహదారులు , భవనాలశాఖ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు నరసన్నపేట నుండి ఒక తమ్ముడు కృష్ణదాస్‌పై, మరొక తమ్ముడు రాందాస్‌ను కాంగ్రెస్ తరఫున బరిలో నిలిపారు. ఆ ఎన్నికల్లో కృష్ణదాస్ గెలుపొందినప్పటికీ తన అభ్యర్థిపై, తాను జైలులో ఉన్న సమయంలో ధర్మాన ప్రసాదరావు పోటీకి నిలిపారనే ఆగ్రహం జగన్‌కు ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
కాలక్రమంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో ధర్మాన ప్రసాదరావు 2015లో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి శ్రీకాకుళం ఎమ్మెల్యే గా గెలుపొందారు. వైసీపీయే ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ ఆయనకు ఆశించిన స్థానం లభించలేదు. ఆయన అన్నయ్యకే మంత్రి పదవి కట్టబెట్టారు గనుక.. ఇక కేబినెట్ ఆశలను ప్రసాదరావు పూర్తిగా వదులుకోవాల్సిందే. ఒకే కుటుంబంలో ఇద్దరికి పదవి దక్కడం అనూహ్యమైన సంగతి. వైఎస్సార్ కాంగ్రెస్ లో కొనసాగాలంటే.. ఎమ్మెల్యేగానే పరిమితం కావడం తప్ప ధర్మానకు మరో ఆల్టర్నేటివ్ లేదని పలువురు విశ్లేషిస్తున్నారు.