(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
విజయనగరం జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన కొమరాడ మండలంలోని చోళపదం పంచాయతీ వనదర గ్రామనికి చెందిన పి. జయమ్మ (26) పురిటి నొప్పులతో సోమవారం ఉదయం 5గంటల సమయంలో తీవ్ర ఇబ్బంది పడ్డారు. 108కు సమాచారం ఇవ్వగా కొమరాడ వైద్య సిబ్బంది తమ వాహనంతో హుటాహుటిన బయలు దేరారు. కొమరాడ నుండి వనదర వెళ్లేందుకు మధ్యలో ఉన్న నాగావళి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దాంతో 108 వాహనాన్ని నది ఒడ్డున నిలుపు చేశారు. గర్భిణీని తమ గ్రామం నుండి నాగావళి నది దాటించుకొని 108 వాహనం దగ్గరకు తీసుకొస్తున్న సమయంలోనే ఆమె పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న వైద్య సిబ్బంది అప్రమత్తమై హుటాహుటిన ఉధృతంగా ప్రవహిస్తున్న నది లోంచి నడుచుకుంటూ వెళ్లి నది మధ్యలోనే ప్రాధమిక చికిత్స అందించారు. అంతే కాకుండా జయమ్మ కుటుంబీకుల సహకారంతో వైద్య సిబ్బంది స్కూప్ స్టెచర్ ద్వారా ఆమెను తమ భుజాలపై మోసుకుంటూ నెమ్మదిగా నది దాటించి 108 వాహనం ద్వారా కూనేరు రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ తల్లీబిడ్డలకు మెరుగైన వైద్యం అందివ్వడంతో వారు ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు.
ప్రశంసల వర్షం
ధైర్యసాహసాలతో తమ ప్రాణాలకు తెగించి ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో చికిత్స అందించిన కొమరాడ 108 వైద్యసిబ్బందిపై స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా గర్భిణీ కుటుంబీకులు 108 సిబ్బంది ఇఎంటి చిన్నంనాయుడును, పైలట్ శ్రీనివాసరావును అభినందించారు.











