రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి తన ప్రజారంజక పాలన ద్వారా రాష్ట్రంలో నవశకానికి నాంది పలికారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. తీవ్రమైన ఆర్థిక లోటు ఉన్నప్పటికీ, అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ, ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారని కొనియాడారు. విజయనగరం ఆనందగజపతి ఆడిటోరియంలో, కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ ఆదివారం ఘనంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలకు ఉపముఖ్యమంత్రి శ్రీవాణి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముందుగా తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు.
మళ్లీ నిలదొక్కుకున్నాం
రాష్ట్రం రెండుగా విడిపోయి, హైదరాబాద్ లాంటి గొప్ప రాజధానిని కోల్పోయినప్పటికీ మనం నిలదొక్కుకున్నామని ఉపముఖ్యమంత్రి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కనీసం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కూడా జరుపుకోలేక పోయామని విమర్శించారు. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేస్తూ, ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. ఈ వ్యవస్థ వల్ల పాలన ప్రజలకు మరింత చేరువ అయ్యిందని, ప్రభుత్వ సేవలన్నీ గ్రామస్థాయిలోనే అందుతున్నాయని చెప్పారు..
విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత
విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని పుష్పశ్రీవాణి చెప్పారు. విజయనగరంలో ప్రభుత్వ వైద్య కళాశాల, పార్వతీపురంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, కురుపాంలో ఇంజనీరింగ్ కళాశాల దీనికి నిదర్శమన్నారు. రైతే దేశానికి వెన్నెముఖ అని భావించి, వారి సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు. మహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకువచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో జిల్లాను అన్ని విధాలా అభివృద్ది చేసేందుకు తనవంతు కృషి చేస్తానని శ్రీవాణి అన్నారు.
జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో విజయనగరం ఎంపి బెల్లాన చంద్రశేఖర్ , ఎంఎల్‌సి పెనుమత్స సూర్యనారాయణరాజు పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.











