మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం నాడు తిరుమల వెళ్లి శ్రీవేంకటేశ్వరస్వామివారి సేవలో పాల్గొన్నారు. బెయిల్ వచ్చిన తరువాత.. రెండు రోజుల కిందట కరోనా నెగటివ్ కూడా రావడంతో.. అప్పటిదాకా ఎన్నారై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడు.. విడుదల అయ్యారు. ఇప్పటిదాకా నోరెత్తి తన అరెస్టు గురించి ఆయన ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. బుధవారం తిరుమల వెళ్లి వచ్చిన తరువాత.. సాయంత్రం 7 గంటల సమయంలో ఆయన ట్వీట్ చేశారు. తన అరెస్టుపై పెదవి విప్పారు. తప్పుడు కేసులకు జడిసేది లేదని హెచ్చరించారు.
‘‘ప్రభుత్వం తప్పులు నిలదీయడమే నేను చేసిన తప్పయితే! ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా నేను నిలదీస్తూనే వుంటాను. సర్కారు అవినీతిని ప్రశ్నించడమే నేరమైతే ఎన్ని అక్రమకేసులు పెట్టినా నేను ప్రశ్నిస్తూనే వుంటాను. నిజాయితీ నా ధైర్యం. సత్యం నా ఆయుధం. ప్రజాక్షేమమే నా లక్ష్యం.’’
.. అంటూ అచ్చెన్నాయుడు ట్విటర్ లో పేర్కొన్నారు.
గత ప్రభుత్వం హయాంలో.. ఈఎస్ఐలో భారీ అవినీతి కుంభకోణం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. వాటిపై విచారణలో భాగంగా అచ్చెన్నపై కూడా కేసు నమోదు అయింది. పోలీసులు భారీగా ఆయన స్వగ్రామం నిమ్మాడకు తెల్లవారుజామున తరలివెళ్లి.. అరెస్టు చేశారు. రెండు రోజుల కిందటే సర్జరీ అయి ఉన్నప్పటికీ.. కారులో విజయవాడకు తరలించారు. అప్పటినుంచి ఆయన ఆరోగ్య సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. అరెస్టులో ఉండగానే.. మళ్లీ సర్జరీ కూడా చేయించారు. ఈలోగా ఆయనకు కరోనా కూడా సోకింది. ఆస్పత్రి మార్చారు. బెయిల్ వచ్చిన తర్వాత.. కరోనా నెగటివ్ కూడా రావడంతో డిశ్చార్జి అయ్యారు.
ఈ ట్వీట్ గమనిస్తే.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అచ్చెన్న వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ప్రభుత్వానికి కక్ష సాధింపు చర్యలు అని తెలుగుదేశం ఆరోపిస్తోంది. ఇలాంటి చర్యలు ఎన్ని తీసుకున్నా.. ప్రభుత్వాన్ని నిలదీసే తన ధోరణి మాత్రం మానదని అచ్చెన్న ట్వీట్ లో తెగేసి చెప్పడం గమనార్హం.
ప్రభుత్వం తప్పులు నిలదీయడమే నేను చేసిన తప్పయితే! ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా నేను నిలదీస్తూనే వుంటాను. సర్కారు అవినీతిని ప్రశ్నించడమే నేరమైతే ఎన్ని అక్రమకేసులు పెట్టినా నేను ప్రశ్నిస్తూనే వుంటాను. నిజాయితీ నా ధైర్యం. సత్యం నా ఆయుధం. ప్రజాక్షేమమే నా లక్ష్యం.
— Kinjarapu Atchannaidu (@katchannaidu) September 2, 2020











