టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ శ్రమ నిజంగానే ఫలించింది. ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటూ ఐటీ దిగ్గజాలకు ఆయన చేసిన వినతికి రోజుల వ్యవధిలోనే మంచి స్పందన లభించింది. ఐటీలో ప్రపంచంలోనే దిగ్గజ సంస్థగా పేరొందిన మైక్రోసాఫ్ట్ ఏపీలో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టింది. ఏపీ రాజధాని అమరావతికి కూతవేటు దూరంలో నందిగామ వద్ద ఆ సంస్థ ఏకంగా 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఈ భూమి కోసం సదరు సంస్థ ఏకంగా రూ.181 కోట్లను వెచ్చించింది. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట జరిగిన ఈ కొనుగోలుపై జాతీయ మీడియాలో ఆసక్తికర కథనాలు ప్రచురితమయ్యాయి. అమరావతి నుంచి కేవలం గంట ప్రయాణం దూరంలో ఉండే ఈ భూమిలో మైక్రోసాఫ్ట్ ఏ తరహా కార్యకలాపాలను ప్రారంభించనుందన్న వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. అంతేకాకుండా ఈ భూమి కొనుగోలుకు సంబంధించి మైక్రోసాఫ్ట్ నుంచి ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన కూడా విడుదల కాలేదు. రిజిష్ట్రేషన్ శాఖ వద్ద లభ్యమైన పత్రాల ఆధారంగా ఈ భూమి కొనుగోలుపై జాతీయ మీడియా వార్తలను రాసుకొచ్చింది.
ఇక నందిగామలోని ప్రైమ్ లొకేషన్ లో ఉన్న ఈ భూమి నాట్కో ఫార్మా, టైమ్ క్యాప్ ఫార్మాలకు చెందినదిగా తెలుస్తోంది. ఈ రెండు సంస్థల పేరు మీద ఉన్న 25 ఎకరాల భూమిని ఆ సంస్థల నుంచి మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. రిజిష్ట్రేషన్ పత్రాల ఆధారంగా ఈ భూ భూమి కొనుగోలు సెప్టెంబర్ 11ననే పూర్తి అయినట్లు సమాచారం. నాట్కో ఫార్మా, టైమ్ క్యాప్ ఫార్మాల నుంచి 25 ఎకరాల భూమి కొనుగోలు కోసం మైక్రోసాఫ్ట్ రూ.181.25 కోట్లను వెచ్చించింది. ఈ మొత్తం కాకుండా స్టాంప్ డ్యూటీ కింద రూ.9.96 కోట్లు, రిజిష్ట్రేషన్ రుసుము కింద రూ.3.62 కోట్లు, ఇతరత్రా ఖర్చుల కింద రూ.18 లక్షలను మైక్రోసాఫ్ట్ వెచ్చింది. మొత్తంగా ఈ భూమి కొనుగోలు కోసం ఐటీ దిగ్గజం దాదాపుగా రూ.200 కోట్లను ఖర్చు చేసిందని చెప్పాలి. ఇటీవలే ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి రికార్డు మెజారిటీతో విజయం సాదించడం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన తిరిగి కూటమి సర్కారు కొలువుదీరిన నేపథ్యంలోనే మైక్రోసాఫ్ట్ ఈ భూమిని కొనుగోలు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా చంద్రబాబు తిరిగి అధికారంలోకి రావడంతో అమరావతి సహా ఏపీలోని పలు కీలక ప్రాంతాల్లో భూముల రేట్లు ఆకాశాన్నంటాయి. ఈ పరిస్థితిని పరిశీలించిన తర్వాతే మైక్రోసాఫ్ట్ ఈ భూమిని కొనుగోలు చేసినట్లుగా సమాచారం.
ఇదిలా ఉంటే… ఏపీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కి కేపిటల్ తీర్చిదిద్దే దిశగా చంద్రబాబు సర్కారు ఇటీవలే ఐటీ పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పాలసీని చేతబట్టుకుని ఐటీ మంత్రి హోదాలో నారా లోకేశ్ అమెరికాలో పర్యటించారు. దాదాపుగా 10 రోజుల పాటు సాగిన అమెరికా పర్యటనలో మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన లోకేశ్… ఆ సంస్థ సీఈఓ గా కొనసాగుతున్న తెలుగు ప్రముఖుడు సత్య నాదెళ్లతో భేటీ అయ్యారు. ఏపీలో మైక్రోసాఫ్ట్ క్యాంపస్ ఏర్పాటు దిశగా ఆయనతో చర్చించారు. అంతేకాకుండా ఏఐకి తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం, విశాఖలో ఐటీ విస్తరణకు ఉన్న అవకాశాలు, అమరావతి పరిదిలో అందుబాటులో ఉన్న అవకాశాలు… రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలకు తమ ప్రభుత్వం ఇవ్వనున్న ప్రోత్సాహకాలు తదితరాలపై లోకేశ్ సవివరంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్ ను సాంతం ఆసక్తిగా విన్న నాదెళ్ల… ఏపీలోకి అడుగు పెట్టే దిశగా ఆలోచన చేస్తామని లోకేశ్ కు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు ఏపీలో పాలన ప్రారంభించిన తర్వాత అప్పటిదాకా ఏపీ వైపు చూడాలన్నా భయపడిపోయిన చాలా కంపెనీలు ఉత్సాహంగా రాష్ట్రంలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే టీసీఎస్, రిలయన్స్, ఆర్సెలర్ మిట్టల్ తదితర కంపెనీలు బారీ పెట్టుబడులతో ఏపీలోకి అడుగు పెట్టాయి కూడా. లోకేశ్ అమెరికా పర్యటన తర్వాత ఏపీ వైపు దృష్టి సారించిన గూగుల్..విజయవాడ, గుంటూరు మధ్యలో భూమిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపినట్లుగా వార్తలు వినిపించాయి. తన అనుబంధ సంస్థ యూట్యూబ్ అకాడెమీని ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తున్న గూగుల్… దానిని అమరావతికి సమీపంలోనే ఏర్పాటు చేయాలని దాదాపుగా నిర్ణయించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే విజయవాడ, గుంటూరుల మధ్యలో భూమికొనుగోలుపై దృష్టి సారించింది. అయితే గూగుల్ అలా భూమి కొనుగోలు దిశగా ఆలోచన చేస్తుండగానే… ఆ కంపెనీ స్పీడును దాటేసిన మైక్రోసాఫ్ట్ ఏకంగా భూమిని కొనుగోలు చేయడం చూస్తుంటే… ఈ రెండు దిగ్గజాలతో పాటు చాలా ఐటీ కంపెనీలు ఏపీకి క్యూ కట్టడం ఖాయమేనని చెప్పక తప్పదు. ఈ లెక్కన అతి త్వరలోనే ఏపీ రూపురేఖలే మారిపోనున్నాయన్న మాట.