భౌతికదాడులు, హింసాకాండతో భయాందోళనలు సృష్టించడం, అక్రమ కేసులు పెట్టి ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం ద్వారా పులివెందులలో ప్రతి ఎన్నికనూ ఏకపక్షం చేసుకోవడం YS కుటుంబానికి దశాబ్దాలుగా అలవాటైన విద్య. అయితే, ఈ ఎన్నికల్లో వారి సొంత గడ్డపై వైసీపీ ఘోర పరాజయం చవిచూడటానికి ప్రధాన బీజం 2021లో కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లోనే పడింది. అప్పట్లో వైసీపీ హయాంలో జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ప్రశాంతంగా ఉండే కుప్పంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలకు తెగబడ్డారు. బెదిరింపులతో ఏకగ్రీవాలు చేసుకుని గెలిచామని విర్రవీగిన నాడే TDP శ్రేణుల్లో కసి పెరిగింది.
గతంలో కుప్పంలో చేసిన అరాచకాలనే 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ రిపీట్ చేసి చంద్రబాబును ఓడించాలని వైసీపీ వేసిన వ్యూహాలు పారలేదు. పైగా కుప్పం ఘటనలతో రగిలిపోయిన తెలుగుదేశం శ్రేణులు, ఇప్పుడు పులివెందులలో వైసీపీని తీవ్రంగా దెబ్బకొట్టాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రభుత్వ కట్టుదిట్టమైన భద్రత కల్పించడంతో వైసీపీ బెదిరింపులు సాగలేదు. దాంతో ఏకంగా 20 స్థానాల్లో నామినేషన్లు వేయడానికే వైసీపీ భయపడింది. గతంలో 1996లో ఉమేష్ చంద్ర కడప ఎస్పీగా ఉన్నప్పుడు మాత్రమే పులివెందులలో ప్రజలు స్వేచ్ఛగా ఓటేశారు. మళ్లీ ఇన్నాళ్లకు ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవడంతో ఫలితం స్పష్టంగా తేలిపోయింది.
ఓటమి ఖాయమని ముందే అర్థం కావడంతో కౌంటింగ్ కేంద్రాలకు వైసీపీ ఏజెంట్లు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఒక్క దెబ్బతో వైఎస్ కుటుంబానికి చెందిన ఫ్యాక్షన్ రాజకీయాలు తుస్సుమన్నాయి. అధికారంలో ఉంటే దాడులకు తెగబడే ఫ్యాక్షనిస్టులు, అధికారం ఊడిపోతే ఎంతలా భయపడతారో అనడానికి పులివెందుల ఫలితాలే నిదర్శనం. నాడు జగన్ అండ చూసుకుని విపక్షాలపై విరుచుకుపడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా ఇప్పుడు అదే గతి పట్టింది. పుంగనూరు మున్సిపాలిటీలో కనీసం తమ పార్టీ అభ్యర్థులను పోటీకి దింపడానికి కూడా ఆయన ధైర్యం చేయలేకపోయారు.
నాడు కుప్పంలో వైసీపీ, జగన్ అరాచకంగా నాటిన విత్తనమే.. నేడు పులివెందులలో ప్రజాస్వామ్య బలానికి బాటలు వేసి, వైఎస్ కుటుంబ కంచుకోటను బద్దలు కొట్టేలా చేసింది. అధికార మదంతో నాడు చేసిన అక్రమాలు తిరగబడి, జగన్ కోరుకున్న బ్యాలెట్ పద్ధతిలోనే ఆయన సొంత గడ్డపై ఘోర పరాజయాన్ని మూటగట్టుకునేలా చేశాయి.











