గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి జగన్‌కి భారీ ఝలక్ ఇచ్చారు. ఆయన ఎమ్మెల్యే పదవితో పాటుగా పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్‌కు, సభ సెక్రటరీకి తన రాజీనామా లేఖను పంపించారు. అలాగే వైఎస్ఆర్ సీపీకి రాజీనామా చేసిన లేఖను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపారు. దీంతో జగన్ కోటలో బీటలు వారడం మొదలైందనే అభిప్రాయం వ్యక్తం అవుతూ ఉంది. మొన్న ఒంగోలులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి చేసిన వ్యాఖ్యలు, తాజాగా ఆళ్ల రామక్రిష్ణారెడ్డి వైదొలగడంతో మొదలైన ఈ పరంపర.. మరింత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ అసంతృప్తిని వెళ్లగక్కడానికి దారి తీస్తుందని తెలుస్తోంది.
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం అనేది కీలకంగా ఉంది. గత ఎన్నికల్లో లోకేశ్ ఇక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు. అయితే, ఇటీవలి కాలంలో మంగళగిరి వైఎస్ఆర్ సీపీలో గ్రూపు తగాదాలు పెరిగిపోయాయి. సొంత పార్టీ నేతల మధ్య పొరపొచ్చాలు రావడం.. అవి ఈ మధ్య మరింత పెరిగాయి. కనీసం జగన్ కూడా వీటిని పరిష్కరించే ప్రయత్నయం చేయలేదు. మంగళగిరిలో ఎమ్మెల్యే ఆర్కేకి, మంగళగిరి తాడేపల్లి వైసీపీ నగర అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డికి అస్సలు పడడం లేదు. అప్పటికే రామక్రిష్ణా రెడ్డి పార్టీ వైసీపీ ఆఫీసును మంగళగిరిలో ఏర్పాటు చేశారు. ఆ కార్యాలయం ఉండగానే.. దొంతిరెడ్డి వేమారెడ్డి పోటీగా మరో వైసీపీ ఆఫీసు పెట్టారు. దీంతో ఇది హాట్ టాపిక్‌గా మారింది. అటు జగన్ ఈ వివాదంలో కలగజేసుకోకుండా పట్టనట్టుగా ఉండడం.. పైగా మంగళగిరి వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా గంజి చిరంజీవికి పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఇలా తనను దూరం పెట్టడంతో అసహనంతోనే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి పార్టీని వీడినట్లుగా తెలుస్తోంది.
ఆదివారం నియోజకవర్గంలో వైఎస్ఆర్ సీపీ వర్గాల అసమ్మతి నేతల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారంతా ఆర్కేపై అవినీతి ఆరోపణలు గుప్పించారు. అదే సమయంలో మంగళగిరి నుంచి ఈసారి ఎన్నికల్లో బీసీలకు కేటాయింపు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో 2024 ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ దక్కకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. అందుకే ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా అస్త్రం ప్రయోగించినట్టు వైసీపీ వర్గాలలో చర్చ నడుస్తొంది. అంతేకాక, మంగళగిరి నియోజక వర్గం కోసం రూ.1250 కోట్లు నిధులు ఇస్తామని జగన్ హామీ ఇచ్చి మాట తప్పారని కూడా ఆర్కే ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది.
మొత్తానికి ఓవైపు తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీపై పడుతుండగా.. తాజాగా అసమ్మతి నేతలు ఒక్కొక్కరుగా బయటికి వస్తుండడం వైఎస్ఆర్ సీపీ పతనాన్ని సూచిస్తోంది. మొన్న బాలినేని శ్రీనివాస రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయిన విషయం మర్చిపోకముందే.. తాజాగా ఎమ్మెల్యే ఆళ్ల రాజీనామా చేశారు. అసలే టీడీపీ – జనసేన ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతున్నందున రాబోయే రోజుల్లో మరింత మంది వైసీపీ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లుగా తెలుస్తోంది.











