నాలుగు మాటలు అను పడతారు. రెండు తగిలించు సరే అని ఊరుకుంటారు. కానీ.. ఈగోను హర్ట్ చేస్తే ఏ మాత్రం ఊరుకోరు. దశాబ్దాల తరబడి అధికార జులం కింద బతికిన తెలంగాణ ప్రజలు దేనినైనా తట్టుకుంటారు కానీ చేతిలోని అధికారాన్ని బాధ్యతగా కాకుండా అహంకారంగా భావిస్తే మాత్రం..వారికి గుణపాఠం చెప్పేందుకు ఏ మాత్రం వెనుకాడరు. ఈ తీరే.. తాజాగా తెలంగాణ అధికార పక్షానికి ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి.
నిజంగానే టీఆర్ఎస్ అధినేతకు వారి అనుచర వర్గానికి అంత అహంకారం ఉందా? అంటే.. అవునన్న మాట సూటిగా చెప్పలేం. ఎందుకంటే దుబ్బాక విషయాన్నే తీసుకోండి. నిజంగానే హరీశ్‌కు అంత అహంకారంగా ఉండి ఉంటే నిత్యం 200 కి.మీ. తక్కువ కాకుండా ప్రచారం చేయాల్సిన అవసరం లేదు కదా? కనిపించిన వారందరిని అమ్మా.. అయ్యా అంటూ ఓట్లు అడగాల్సిన అవసరంలేదు కదా?
స్మార్ట్ వర్క్ మరిచిన టీఆర్ఎస్
అంతేనా గులాబీ అధినేత సైతం ఎక్కడా అహంకారంతో మాట్లాడింది లేదు. ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారే తప్పించి ఇంట్లో కూర్చున్నా గెలుస్తామన్న మాట అనలేదు. కానీ, దుబ్బాకలో ఫలితం మాత్రం తేడా కొట్టేసింది. ఎందుకంటే బీజేపీ చేసిన వ్యూహాత్మక ప్రచారం వల్లనే. హార్డ్ వర్క్ మాత్రమే కాదు.. స్మార్ట్ వర్క్ విషయంలో బీజేపీ నూటికి నూరుశాతం చేస్తే.. టీఆర్ఎస్ మాత్రం హార్డ్ వర్క్ మాత్రమే చేసింది తప్పించి తమకు మొదట్నించి అలవాటైన స్మార్ట్ వర్క్‌ను దుబ్బాకలో వదిలేసింది.
వ్యూహాత్మకంగా బీజేపీ
ఈ విషయాన్ని తమకు అనుకూలంగా మలుచు కోవటంలో బీజేపీ సక్సెస్ అయ్యింది. తెలంగాణ ప్రజలు ఏ విషయానికి అయితే బాగా కనెక్టు అవుతారో బీజేపీ నేతలు అవే అంశాల్ని ప్రస్తావించారు. బీజేపీ ఫైర్ బ్రాండ్లు బండి సంజయ్ కావొచ్చు.. ధర్మపురి అరవింద్ కావొచ్చు. తమ స్పీచుల్లో టీఆర్ఎస్ అధినేతల గురించి మాట్లాడినప్పుడు వారెంత అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు? అన్న విషయాన్ని ఓటర్లకు చెప్పేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.
నేరుగా చెప్పకుండా.. తమ మాటలతో ఆ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాదు, అధికారపక్షం జులుంకు తాము తరచూ ఇబ్బందులకు గురవుతున్నట్లుగా చెప్పే సందేశాన్ని దుబ్బాక ఓటర్లకు వ్యూహాత్మకంగా చేర వేశారు. దీంతో తెలంగాణ ప్రజలు ఏ మాత్రం ఇష్టపడని అహంకారం.. దుబ్బాక ఓటర్లకు ప్రత్యేకంగా కనిపించేలా చేయటంలో బీజేపీ వ్యవహరించిన నేర్పు తెలంగాణ అధికార పక్షానికి దిమ్మ తిరిగే షాక్‌ను ఇచ్చేలా చేసింది. ఏతా వాతా.. దుబ్బాక ఫలితంతో తేలేదేమంటే.. తెలంగాణ ప్రజలు అహంకారాన్ని అస్సలు తట్టుకోలేరని.